మురుగునీటితో కేటీఆర్ కు సన్మానం! మూసీలో నిలబెట్టాలన్న రేవంత్..
posted on Jun 29, 2021 @ 3:45PM
తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి జీహెచ్ఎంసీ కార్యాలయానికి వెళ్లారు. లింగోజిగూడ డివిజన్ ఉప ఎన్నికలో గెలిచిన కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ పని తీరు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, టీఆర్ఎస్ సర్కార్ పై నిప్పులు చెరిగారు ఎంపీ రేవంత్ రెడ్డి. మంత్రి కేటీఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
మెట్రో నగరంగా ఉన్న హైదరాబాద్ చెత్త నగరంగా మారిందని ఆరోపించారు రేవంత్ రెడ్డి. 16 నివాసయోగ్యమైన పట్టణాల గుర్తింపులో హైదరాబాద్‌కు స్థానం రాలేదంటే ఎంత చెత్తగా కేటీఆర్ పరిపాలన ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. కేటీఆర్ ను టార్గెట్ చేస్తూ ముంబైలో జరిగిన అంశాన్ని ప్రస్తావించారు రేవంత్ రెడ్డి. ఓ కాంట్రాక్టరు మోరీలలో చెత్త తీయకపోవడంతో మొత్తం మురుగు నీరు, చెత్త రోడ్డుపై నిలిచిపోవడంతో వాహనదారులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో స్థానిక ఎమ్మెల్యే కాంట్రాక్టర్‌ను పిలిపించి ఆ మురుగునీటిలో కూర్చోబెట్టి, అతనిపై చెత్త వేయించారని చెప్పారు. ఆ విధంగా మంత్రి కేటీఆర్‌కు సన్మానం చేయాలని ఉందని రేవంత్ అన్నారు. అయితే మంత్రి భద్రత మధ్య ఉన్నారు కాబట్టి చేయలేకపోతున్నామన్నారు రేవంత్.
మంత్రి కేటీఆర్‌ను మూసీలో నడుమలోతులో 4 గంటలు ఉంచితే అప్పుడు పేద ప్రజల సమస్యలు అర్ధమవుతాయన్నారు రేవంత్ రెడ్డి. ఏదో ఒక రోజు ఆ పరిస్థితి వస్తుందని వ్యాఖ్యానించారు. తూతూ మంత్రంగా మూసీ అభివృద్ధి చర్యలున్నాయని విమర్శించారు. హైదరాబాద్ పూర్తిగా చెత్త నగరంగా మారిందని దీనిపైన, నగరంలో ప్రజా సమస్యలపై పూర్తి స్థాయిలో పోరాటం చేయడానికి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంటుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. త్వరలో మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటించనున్నట్లు తెలిపారు.
హైదరాబాద్ నగరం తెలంగాణకు గుండెకాయ అన్నారు రేవంత్ రెడ్డి. మహా నగరాన్ని పరిశుభ్రంగా ఉంచితేనే ఫలితం ఉంటుందన్నారు. అన్ని రకాల ట్యాక్స్‌లు పెంచారని... 800 కోట్లతో వరద నివారణ చర్యలు చేస్తామని.. పట్టించుకోలేదని అన్నారు. నాలాలు, చెరువులు కబ్జా చేసుకున్నాక చర్యలు అంటున్నారని మండిపడ్డారు. మంత్రి కేటీఆర్, మునిసిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ ఒక మాఫియాగా ఏర్పడ్డారన్నారు. సీసీ కెమెరాలను నాలాలు, చెరువలు, కబ్జాల ప్రాంతాల్లో పెట్టమని చెప్పామని... అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. మాఫియాకు అనుకూలంగా ఉండేందుకే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయటం లేదని విమర్శించారు. లింగోజిగూడ కార్పొరేటర్ ప్రమాణ స్వీకరానికి రేవంత్ రెడ్డి హాజరయ్యారు.