షాడో సీఎం సజ్జల రామకృష్ణారెడ్డి.. అంతా ఆయన పెత్తనమే..నా?
posted on Jul 1, 2021 @ 10:59AM
ప్రభుత్వంపై మాటల దాడి పెరిగి..సమాధానం చెప్పుకోలేక డిఫెన్స్ లో పడిన టైమ్ లో ఈయన ప్రత్యక్షమవుతారు. పొంతన లేని వాదనలతో ఏదో రకంగా సమాధానం ఇచ్చేస్తారు. మంత్రులు చెప్పాల్సినవి కూడా ఈయనే చెబుతారు. అసలు మంత్రులు ఏదైనా తేడా మాట్లాడితే.. ఈయనకే సమాధానం చెప్పుకోవాలి. అందుకని ఈయన మాట్లాడితేనే బెటరని ఊరుకుంటున్నారు. సీఎం ఎటూ ఎప్పుడుబడితే అప్పుడు టైమ్ ఇవ్వరు. ఈయన మాత్రం పిలిచి మరీ క్లాసు తీసుకుంటారు. అందుకే బాస్ ని షాడో సీఎం అని ఈ మధ్య ముద్దుగా పిలుచుకుంటున్నారు.
వైసీపీలోనూ, ప్రభుత్వంలోనూ నెంబర్ టూగా చాలా డ్రమెటిక్ గా... చాలా స్పీడుగా ఎదిగిపోయారు ప్రభుత్వ సలహాదారుగా నియమించబడ్డ సజ్జల రామకృష్ణారెడ్డి. సజ్జల స్పీడు మామూలుగా లేదు. డీఎస్సీ వేయటం లేదు..టీచర్ల పోస్టులు భర్తీ చేయడం లేదంటే.. సమాధానం చెప్పాల్సిన విద్యామంత్రి ఆదిమూలపు సురేష్ ఇప్పటివరకు కనపడనే లేదు. కాని సజ్జల సార్ మాత్రం వచ్చి టీచర్ల పోస్టులపై ఎదురుదాడి చేసి వెళ్లిపోయారు. ఆ తర్వాత గృహ నిర్మాణాలపై ఆ శాఖ మంత్రితో కలిసి రివ్యూ నిర్వహించారు. ఇళ్ల నిర్మాణం ఎలా నడుస్తుందో సమీక్ష నిర్వహించారు సజ్జల. ఇక ఆ తర్వాత లేటెస్టుగా పోలవరం ప్రాజెక్టును ఎమ్మెల్యేలతో వెళ్లి సందర్శించి.. అధికారులతో సమీక్షించారు. ఇవన్నీ చూస్తుంటే సజ్జల రామకృష్ణారెడ్డి సీన్ బాగా పెరిగినట్లే కనపడుతోంది. జగన్మోహన్ రెడ్డి బాస్ కు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారని చెప్పుకుంటున్నారు.
ఇక పోలీసు డిపార్ట్ మెంటుపై సజ్జల గ్రిప్ సంగతి అందరూ చెప్పుకునేదే. ప్రభుత్వం వచ్చిన మొదట్లోనే పోలీసు అధికారుల బదిలీలు..కానిస్టేబుల్ స్థాయి వరకు లిస్టులు వైసీపీ సెంట్రల్ ఆఫీసులోనే.. అది కూడా సజ్జల చాంబర్ లోనే రెడీ అయ్యాయనే ఆరోపణలు వచ్చాయి. అందుకే ఆ తర్వాత పోలీసులు ఏం చేయాలన్నా.. ఎక్కడ ఎవరిని పట్టుకోవాలన్నా.. ఎవరిని వదిలేయాలన్నా సజ్జల నుంచి ఫోన్లు వెళుతున్నాయని చెప్పుకుంటున్నారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ ను డమ్మీ చేసి మరీ సజ్జల నేరుగా అందరు ఆఫీసర్లకు డైరెక్షన్ ఇస్తున్నారనే విమర్శలు వినపడుతున్నాయి. ఎంపీ రఘురామ అరెస్టు ఎపిసోడ్ లో అదే జరిగిందని అంటున్నారు. ఈ పరిణామాలతో గౌతమ్ సవాంగ్ కూడా సైలెంట్ అయిపోయారని.. పైగా దిశ యాప్ పై సీఎం పెట్టిన సభలో సైతం డీజీపీ పాల్గొనకపోవడం అందుకు సాక్ష్యం అని కూడా కొందరు ఆరోపిస్తున్నారు.
వైసీపీలో సజ్జల హవా బాగా పెరిగిపోయింది. ఒకప్పుడు వైసీపీ సెంట్రల్ ఆఫీసు బాధ్యతలు అప్పచెప్పినా.. మళ్లీ విజయసాయిరెడ్డి అడ్డం పడటంతో అది ఆగిపోయింది. తర్వాత జిల్లాలను విభజించి సజ్జల, విజయసాయి, వైవీ సుబ్బారెడ్డి, వేమిరెడ్డి లకు పంచారు జగన్. కాని విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్రకు పరిమితం అయిపోయారు. వైవీ సుబ్బారెడ్డి టీటీడీకే పరిమితమయ్యారు. అటు పార్టీపైనా..ప్రభుత్వంపైనా సజ్జల మాత్రం పట్టు పెంచుకున్నారు. క్రమంగా మంత్రులంతా చేతిలోకి వచ్చారు. ఇప్పుడు సజ్జలకు చెబితే జగన్ కు చెప్పినట్లే.. సజ్జల ఆదేశిస్తే జగన్ ఆదేశించినట్లే అన్నట్లు అయిపోయింది పరిస్ధితి. ఇధి మింగుడుపడని విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలు కౌంటర్ మంత్రాంగం కూడా మొదలెట్టారని తెలుస్తోంది.