వైఎస్సార్ జయంతి రోజే జగన్ కు గండమా?
posted on Jul 1, 2021 @ 5:53PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్ పై కీలక పరిణామం జరిగింది. ఎంపీ రఘురామ రాజు వేసిన పిటిషన్ పై సీబీఐ కోర్టులో గురువారం వాదనలు జరిగాయి. ఎంపీ రఘురామకృష్ణరాజు తరఫున న్యాయవాది శ్రీవెంకటేశ్ వాదనలు వినిపించారు. అధికారం ఉపయోగించి జగన్ సాక్షులను ప్రభావితం చేస్తున్నారని చెప్పారు. పిటిషన్ వేసిన తనపైనే తప్పుడు కేసులు పెట్టి వేధించారని రఘురామ కోర్టుకు తెలిపారు. సీబీఐ అభిప్రాయం వెల్లడించకపోవడం సరికాదని రఘురామ న్యాయవాది కోర్టుకు విన్నవించారు.
ఎంపీ రఘురామ రాజుకు పిటిషన్ వేసే అర్హత లేదని జగన్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. రాజకీయ ఉద్దేశాలతోనే పిటిషన్ వేశారన్నారని ధర్మాసనానికి వివరించారు. ఇరువైపుల వాదనలు విన్న హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టు.. రఘురామ ఆరోపణలకు బలమైన ఆధారాలు ఇవ్వలేదని అభిప్రాయపడింది. లిఖితపూర్వక వాదనలు సమర్పించాలని ఆదేశించింది. జగన్, రఘురామ, సీబీఐ లిఖితపూర్వక వాదనలు సమర్పించాలని సూచించింది. తదుపరి విచారణను జూలై 8కి వాయిదా వేసింది
జగన్ బెయిల్ రద్దు కోరుతూ వైసీపీ రెబెల్ ఎంపీ రఘురాకృష్ణరాజు హైదరాబాద్ సీబీఐ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై పలుమార్లు విచారణ జరిగింది. గతంలో జరిగిన విచారణ నేపథ్యంలో రఘురామ పిటిషన్ పై జగన్ కౌంటర్ దాఖలు చేశారు. ఆ కౌంటర్ కు రఘురామ తిరిగి రీజాయిండర్ ఇచ్చారు.జగన్ కు బెయిల్ వచ్చిన తర్వాత, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలను రీజాయిండర్ ద్వారా రఘురామ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అక్రమాస్తుల కేసులో సహనిందితులుగా ఉన్న వారికి జగన్ వల్ల జరిగిన ప్రయోజనాలు, మీడియా, విపక్ష నేతలపై జగన్ కక్షసాధింపు విధానాలు, జారీ చేసిన జీవోలు వంటి పలు అంశాలను ప్రస్తావించారు.
తనపై దాఖలైన కేసులకూ జగన్ బెయిల్ రద్దుకూ సంబంధం లేదని రఘురామ క్లారిటీ ఇచ్చారు. తనపై దాఖలైన కేసులన్నీ ఎఫ్ ఐఆర్ దశలో ఉన్నాయని, తాను దోషిగా ఎక్కడా నిరూపణ కాలేదని రఘురామ రీజాయిండర్ లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆ రీజాయిండర్ పై అదనపు సమయం కావాలని జగన్ తరఫు న్యాయవాదులు సీబీఐ కోర్టును కోరారు. ఈ క్రమంలోనే గతంలో వాయిదా పడిన విచారణ గురువారం జరిగింది. రఘురామ రీజాయిండర్లపై కౌంటర్ వేస్తామని జగన్ తరఫు న్యాయవాదులు అభ్యర్థించారు. అయితే కౌంటర్ వేయడానికి వీలు లేదని సీబీఐ కోర్టు నిరాకరించింది. డైరెక్ట్‌గా రీజాయిండర్ల వాదనలు వినిపించాలని జగన్ తరఫు న్యాయవాదులకు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.
జగన్ బెయిల్ కేసులో విచారణకు జూలై 8కి వాయిదా వేయడంతో.. ఈ కేసులో ఏం జరగబోతోందన్న ఉత్కంఠ సర్వత్రా ఏర్పడింది. జూలై 8 దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ జయంతి. అదే రోజును జగన్ బెయిల్ కేసు విచారణ జరగనుండటం మరింత ఆసక్తిగా మారింది. వైఎస్ జయంతి రోజునే జగన్ కు గండం ఉందా అన్న చర్చ కూడా కొన్ని వర్గాల్లో జరుగుతోంది. దీనిపై ఎంపీ రఘురామ రాజు కూడా స్పందించారు.
మా వైపు నుండి తుది ముగింపు కోసం మరియు వ్రాతపూర్వక సమర్పణలను ఇవ్వడానికి మేటర్ జూలై 8 న పోస్ట్ చేయబడింది. సిబిఐ కూడా దీనికి ముందు తమ కౌంటర్ దాఖలు చేస్తుంది. కాబట్టి చివరకు ఈ విషయం మా డాక్టర్ వైయస్ఆర్ పుట్టినరోజున ముగుస్తుంది మరియు ఆర్డర్ ప్రకటించడం కొన్ని రోజుల తరువాత కావచ్చు. సత్యవ్మేవ జయతే అంటూ ఎంపీ రఘురామ రాజు ట్వీట్ చేశారు. ఇది కూడా ఇప్పుడు చర్చనీయాశంగా మారింది.