ప్రియాంకకు పార్టీ పగ్గాలు? రాహుల్ వద్దంటున్న లీడర్లు...
posted on Jul 1, 2021 @ 2:32PM
కాంగ్రెస్ పార్టీ అంటే, ఆ ముగ్గురే, కాదు, ఇంకా, కీలక నేతలు చాలా మంది ఉన్నారు. అయినా, పార్టీ నాయకులు, కార్యకర్తలు, సామాన్య ప్రజలు, మీడియా చివరకు రాజకీయ ప్రత్యర్ధులు, పార్టీలోని అసమ్మతులు అందరూ కూడా, సోనియా, రాహుల్, ప్రియాంకా ఈ ముగ్గురే, కాంగ్రెస్ పార్టీ సర్వస్వం అనే భావంతో, ఆ ముగ్గురే పార్టీ అనే అభిప్రాయంతో ఉంటారు. ఆ ముగ్గురు చుట్టూనే పార్టీ వ్యవహరాలు నడుస్తున్నాయి. నిజమే, ఇప్పుడే కాదు, మొదటి నుంచి కూడా, కాంగ్రెస్ పార్టీ అంటే నెహ్రూ గాంధీ ఫ్యామిలీ, నెహ్రూ గాంధీ ఫ్యామిలీ అంటే కాంగ్రెస్ అనే అభిప్రాయమే అందరిలో బలంగా నాటుకు పోయింది.
గత లోక్ సభ ఎన్నికల ఓటమి తర్వాత రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి, కుటుంబం వెలుపలి వ్యక్తిని పార్టీ అధ్యక్షునిగా ఎన్నుకోమని సీడబ్ల్యుసీ సమావేశంలో సోనియా, ప్రియాంక సమక్షంలో ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. అయినా నెలల తరబడి కిందా మీద పడి చివరకు, ఆ బాధ్యతలను పార్టీ వృద్ద నాయకురాలు సోనియాకే అప్పగించారు. ఇప్పటికి కూడా ఆమె ఆ మోయలేని భారాన్ని మోస్తూనే ఉన్నారు. అయితే, ఇప్పుడు మళ్ళీ పార్టీ అధ్యక్ష పదవి విషయంలో మరో కోణంలోంచి చర్చ మొదలైందని అంటున్నారు. పంజాబ్ కాంగ్రెస్’లో గత కొంత కాలంగా సాగుతున్న అంతర్యుద్ధం వ్యవహారం,చిలికి చిలికి రాహుల్ గాంధీ, ప్రియాంకా వాద్రాల మధ్య కూడా చిచ్చు పెట్టిందని, చివరకు రాహుల్ కంటే ప్రియాంక బెటర్ అన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో బలపడుతోందని అంటున్నారు.
ఇక విషయంలోకి వెళితే, పంజాబ్ కాంగ్రెస్’లో గత కొంత కాలంగా అంతర్యుద్ధం సాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడది తారాస్థాయికి చేరింది. ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ మాజీ మంత్రి నవజోత్ సింగ్ సిద్ధూ వర్గాలుగా పార్టీ చీలిపోయింది. సిద్ధూ వర్గం ముఖ్యమంత్రిపై తిరుగుబాటు జెండా ఎగరేసింది. ముఖ్యమంత్రిని అర్జెంటుగా మార్చేయాలని, లేదంటే... అంటూ అధిష్టానానికి అల్టిమేటం జారీ చేసింది. మరో ఎనిమిది నెలల్లో ఎన్నికలు జరగనున్న సమయంలో పార్టీలో తలెత్తిన ఈ సంకటం, పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. ఈ నేపధ్యంలోనే ఓ వంక ముఖ్యమంత్రిని మారుస్తారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. మరో వంక అంతర్గత కలహాలను పరిష్కరించేందుకు కాంగ్రెస్ ముగ్గురు సభ్యులతో కూడిన ఓ కమిటిని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఇరు వర్గాలను కలిసి మాట్లాడి, ఓ నివేదికను అధిష్టానానికి సమర్పించింది.
తమ వాదనను వినిపించేందుకు సిద్దూ రాహుల్ గాంధీని కలిసే ప్రయత్నం చేశారు. అయితే, సిద్దూను కలిసేందుకు రాహుల్ గాంధీ నో’ అనేశారు. ఆయనకు అప్పాయింట్మెంట్ ఇవ్వలేదు. అయితే, అప్పటికే, రాహుల్ గాంధీని కలుస్తున్నట్లు ప్రకటించుకున్న సిద్దూ షాకయ్యారు. మరో వంక రాహుల్ గాంధీని మీడియా ప్రశ్నిస్తే, ఆయన చిటపటలాడారు, చిందు లేశారు. ఏం మీటింగ్.. మీరేం మాట్లాడుతున్నారంటూ మీడియానే ఎదురు ప్రశ్నించారు. ఈ నేపధ్యంలో సిద్ధూ... కొంచెం చాలా అవమానానికి గురయ్యారు. కొద్దిగా నొచ్చుకున్నారు. అయితే, ఆ విషయం ఎలాగో ప్రియాంక చెవిన వేసి, ఆమె అప్పాయింట్మెంట్ కోరారు.. అడిగిందే తడవుగా ఆమె అప్పాయింట్మెంట్ ఇవ్వడమే కాకుండా మూడు గంటల సేపు సిద్దూ గోడు విన్నారు. రాహుల్ కాదన్నా ప్రియాంక తనకు అప్పాయింట్మెంట్ ఇచ్చారని సిద్దూ ఫుల్ జోష్’లోకి వెళ్లారు. ప్రియాంకతో ఉన్న ఫోటోను ట్వీట్ చేశారు. దీంతో సోషల్ మీడియాలో రాహుల్ గాంధీ బకరా అయ్యారు. రాహుల్ కంటే ప్రియాంక బెటర్ అంటూ, ఆమెకు పార్టీ బాధ్యతలు అప్పగించాలన్న డిమాండ్ బయలు దేరింది. ఇటు సిద్ధూ కూడా రాహుల్’ను కార్నర్ చేసేందుకే ఫోటోను ట్వీట్ చేశాడా అనే చర్చ కూడా జరుగుతోంది.
ఇదలా ఉంటే, సిద్దూను రాహుల్ గాంధీ అవమానపరిచిన నేపధ్యంలో, గతంలో అస్సాంకు చెందిన కీలక కాంగ్రెస్ నేత, ప్రస్తుత ఆ రాష్ట్ర బీజేపీ ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మను రాహుల్ గాంధీ ఇదే విధంగా అవమాన పరిచిన విషయాన్ని కొందరు గుర్తుచేస్తున్నారు. రాహుల గాంధీ కుక్క పిల్లతో ఆడుకుంటూ, తనను పట్టించుకోక పోవడంతో అవమానానికి గురైన శర్మ పార్టీకి రాజీనామా చేసి, బీజేపీలో చేరి ఈశాన్య రాష్ట్రలలో పట్టుమని పది సీట్లు లేని పార్టీని తిరుగు లేని శక్తిగా బలోపేతం చేశారు.శర్మ కారణంగానే వరసగా రెండవసారి అస్సాంలో బీజీపీ అధికారంలోకి వచ్చింది. అంతే కాదు కమ్యూనిస్టుల కంచుకోట త్రిపుర సహా ఈశాన్య రాష్ట్రాలు మొత్తాని శర్మ బీజేపీ పట్టులోకి తెచ్చారు. ఈ నేపధ్యంలో రాహుల్ వర్సెస్ ప్రియాంక అనే కోణంలో చర్చ జరుగుతోంది. ఎటూ రాహుల్ గాంధీకి అధ్యక్ష పదవి పై ఆసక్తి లేదు, రాజకీయాలు ఆయన ఫస్ట్ ప్రయారిటీ కాదు. కాబట్టి ప్రియాంకను పార్టీ అధ్యక్షురాలిని చేయాలన్న వాదనను కొందరు తెరపైకి తెస్తున్నారు. నిజానికి, ఇది కొత్తగా వస్తున్న వాదన కూడా కాదు,అయితే, గతంలో ఆమె పార్టీ పగ్గాలు చేపట్టేందుకు అంతగా ఉత్సాహం చూపలేదు, కానీ, ఇప్పడు, అందుకు ఆమె కూడా సిద్దంగా ఉన్నారని తెలుస్తోంది. అయితే, సోనియా గాంధీకి ఇంకా రాహుల్ మీద ఆశలు ఉన్నాయని, ఆమె ఏమంటారో చూడవలసి ఉందని కొందరు పార్టీ నాయకులు అంటున్నారు. మొత్తానికి, ప్రియాంకకు పార్టీ పగ్గాలు? ప్రస్తుతానికి ఇంకా ప్రశ్న ? గానే ఉన్నా త్వరలోనే ఆశ్చర్యార్ధక !’ మై నిలుస్తుందని, ఆమే కాబోయే కాంగ్రెస్ అద్యక్షురాలని కాంగ్రెస్ వర్గాల్లో గట్టిగావినవస్తోంది.