వైవీ సుబ్బారెడ్డి వర్రీ.. పక్కన పెట్టేశారా? పట్టు సాధిస్తారా?
posted on Jul 1, 2021 @ 10:59AM
ఎంపీ టిక్కెట్ ఇవ్వమంటే ఇవ్వలేదు. కోపం వచ్చింది. కనీసం జిల్లాలో తాను చెప్పినవారికి ఇవ్వమన్నా.. వినలేదు. ఈసారి బాగా హర్టయ్యారు. సైలెంట్ అయిపోయారు. అధికారం వచ్చాక..కీలక పదవి అప్పచెప్పారు. అలక తీరిపోయింది. బాగుంది బాగుంది అనుకున్నారు. కట్ చేస్తే ఇప్పుడు తాను ఒక కోటలో బంధించబడ్డానని.. తన కొలీగ్స్ మాత్రం రాష్ట్రాన్ని ఏలేస్తున్నారని..అర్ధమైంది. అందుకే బాధపడుతున్నారు. ఆ కీలక పదవి ఇక అక్కర్లేదని తెగేసి చెప్పేశారంట. అధినేత ఏమనుకున్నా సరే..ఐ డోంట్ కేర్ అంటున్నారంట. రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పాల్సిందేనని డిసైడ్ అయ్యారంట.
వైవీ సుబ్బారెడ్డి. వైసీపీలో కీలక నేత.. పార్టీ పంచతంత్రంలో ఒక ముఖ్యమైన తంత్రం. అలాంటిది తనకు వాల్యూ లేకుండా పోయిందని.. కీలకమైనవన్నీ ఇతరులు చేసుకుంటుంటే..తాను మాత్రం తిరుపతికే పరిమితమైపోయానని బాధపడుతున్నట్లు సమాచారం. అందుకే ఈసారి టీటీడీ ఛైర్మన్ పదవి తనకు వద్దని తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. టీటీడీ ఛైర్మన్ ప్రతి ఏడాది నియమిస్తారు. కొనసాగించాలనుకుంటే కొనసాగిస్తున్నట్లు చెబుతారు. రాష్ట్రంలోని నామినేటెడ్ పదవులపై కసరత్తు చేస్తున్న వైసీపీ అధిష్టానం ముందు వైవీ సుబ్బారెడ్డి ఈ మాట చెప్పారట. తనకు టీటీడీ ఛైర్మన్ పదవి అవసరం లేదని చెప్పేశారంట. బాస్ ఇలా అలగడం మొదటిసారి కాదు.
2014 ఎన్నికలప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి మధ్య ప్రకాశంలో ప్రచ్ఛన్న యుద్ధమే జరిగింది. అప్పుడు బాలినేనితో సహా కొందరి ఓటమికి వైవీ సుబ్బారెడ్డే కారణమని పార్టీలో చర్చ జరిగింది. అప్పటి నుంచి జగన్ వైవీపై గుర్రుగా ఉన్నారని చెబుతుంటారు. అందుకే 2019 ఎన్నికలప్పుడు ఎంపీ టిక్కెట్ రెండో సారి ఇవ్వకుండా.. టీడీపీ నుంచి వచ్చిన మాగుంట శ్రీనివాసులరెడ్డికి ఇచ్చారు. మిగతా నియోజకవర్గాల్లో కూడా వైవీ మాటకు విలువ ఇవ్వలేదు. దీంతో హర్టయిన వైవీ సుబ్బారెడ్డి సైలెంట్ అయిపోయారు.
అధికారం వచ్చాక.. వైవీ సుబ్బారెడ్డికి టీటీడీ ఛైర్మన్ పదవి అప్పచెప్పారు. దీంతో వైవీ శాంతించారు. చాలా కమిటెడ్ గా..జగన్ డైరెక్షన్ ప్రకారం టీటీడీ వ్యవహారాలు నడిపిస్తున్నారు వైవీ సుబ్బారెడ్డి. వారనుకున్నట్లే.. టీటీడీలో ఆసాంతం వారి కంట్రోల్ లోకి తెచ్చుకున్నారు. అంతా బాగానే ఉందనుకున్న టైములో వైవీ సుబ్బారెడ్డికి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు కొత్త ఆలోచనలు కలిగించాయని తెలుస్తోంది.
సజ్జల రామకృష్ణారెడ్డి నెంబర్ టూ గా ఎదిగిపోవటం.. పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ అంతా ఆయనదే నడుస్తుండటం వైవీ సుబ్బారెడ్డికి మింగుడుపడటం లేదని తెలుస్తోంది. అలాగే విజయసాయిరెడ్డికి ప్రాధాన్యం తగ్గినట్టు కనపడ్డా..ఉత్తరాంధ్రను సామంతరాజ్యంలా నడిపిస్తూ..ఢిల్లీలో తన పట్టు కొనసాగించుకోవడంతో..ఆయనకు ఏ ఢోకా లేకుండా ఉంది. ఎటొచ్చీ వారిద్దరి కంటే జగన్ కు క్లోజ్ అయినప్పటికీ...తాను మాత్రం దూరమైపోయానా అనే బాధ ఆయన గుండెలను మెలిపెడుతున్నట్లు చెప్పుకుంటున్నారు. తన మనిషి సీఎంగా ఉంటే..తాను మాత్రం ఏడుకొండల మధ్య బందీ అయిపోయానని.. ఇలా కాదని.. తాను కూడా రాష్ట్రమంతా పట్టు సంపాదించాలని పట్టుదల మీదున్నట్లు తెలుస్తోంది. అందుకే ఈసారి తనకు టీటీడీ ఛైర్మన్ పదవి అవసరం లేదని తెగేసి చెప్పేశారంట. మరి సీఎం జగన్మోహన్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో.. దానికి వైవీ సుబ్బారెడ్డి రియాక్షన్ ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.