సంచలనం..రేవంత్ రెడ్డి గూటికి దానం నాగేందర్?
posted on Jul 1, 2021 @ 7:59PM
తెలంగాణ రాజకీయాల్లో సంచలనాలు జరగబోతున్నాయా? టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి నియమాకంతో పొలిటికల్ సీన్ మారిపోనుందా? అంటే అవుననే తెలుస్తోంది. రేవంత్ రెడ్డి రాకతో జోష్ పెరిగిన కాంగ్రెస్ కు మంచి రోజులు రాబోతున్నాయని సమాచారం. ఎవరూ ఊహించని సంచలనాలు త్వరలో జరగబోతున్నాయని అంటున్నారు. అధికారాన్ని అడ్డు పెట్టుకుని, రాజకీయ పునరేకీకరణపేరున, ఇతర పార్టీలలో గెలిచిన ఎమ్మెల్యేలను ఆకర్షణ మంత్రంతో ఎగరేసుకుపోయారు గులాబీ బాస్. అప్పుడు అదే దిశలో కేసీఆర్ కు ఎదురు గాలి మొదలైందని తెలుస్తోంది.
రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఇంకా బాధ్యతలు స్వీకరించకముందే కేసీఆర్ కు గాంధీ భవన్ సెగ తగులుతోందని సమాచారం. గతంలో గత్యంతరం లేక కాంగ్రెస్ ను వదిలి గులాబీ పార్టీలో చేరిన చాలా మంది నాయకులు, ఎమ్మెల్యేలు మళ్ళీ సొంతగూటికి చేరేందుకు సిద్డంవుతున్నారని, అంటున్నారు. కాంగ్రెస్ పార్టీతో దశాబ్దాల అనుబంధం ఉన్న, మాజీ మంత్రి, ప్రస్తుత ఖైరతాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ లాంటి నాయకులు చాలామంది తెరాసలో ఉక్కపోతకు గురవుతున్నారు. దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న రోజుల్లో సిటీ రాజకీయాలలో చక్రం తిప్పారు. ఆసిఫ్ నగర్ నుంచి మూడు మార్లు, ఖైరతాబాద్ ఒకసారి ఎన్నికైన ఆయన 2018 అసెంబ్లీ ఎన్నికలముందు తెరాసలో చేరారు. ఖైరతాబాద్ నుంచి తెరాస అభ్యర్ధిగా పోటీచేసి మరో మారు, ఎన్నికయ్యారు.
సీనియర్ నేతగా ఉన్నా తెరాసలో నాగేందర్ కు సీనియారిటీ, చురుకుతనానికి గుర్తింపు దక్కలేదు. గుంపులో గోవిందయ్యలా మిగిలి పోయారు. ఇప్పుడు, రేవంత్ రాకతో, కాంగ్రెస్ పునర్జీవనంఫై ఆశలు పెరగడంతో, ఆయన తిరిగి సొంతగూటికి చేరే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. మాతృ సంస్థకు పూర్వ వైభవం తెచ్చేందుకు, తనవంతుగా కృషిచేస్తానని, అందు కోసం అవసరం అయితే, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు కూడా తాను సిద్దంగా ఉన్నట్లు ఆయన తమ సన్నిహితుల వద్ద దానం నాగేందర్ చెప్పినట్లు తెలుస్తోంది.
ఒక్క నాగేందర్ మాత్రమే కాదు, మరి కొందరు కాంగ్రెస్ పార్టీ మాజీ నేతలు, ప్రస్తుత తెరాస ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు కూడా తిరిగి గాంధీ భవన్ బాట పట్టేందుకు సిద్డంవుతున్నారని, విశ్వసనీయ వర్గాల సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ పై 19 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. అందులో 12 మంది కారెక్కి గులాబీ గూటికి చేరుకున్నారు. అయితే, అందులో చాలా మంది అసంతృప్తితో రగిలి పోతున్నారు. పార్టీలో చేర్చుకున్నప్పుడు ఇచ్చిన హమీలలో ముఖ్యమంత్రి మరిచి పోయారని మంది పడుతున్నారు. ఇంతకాలం గత్యంతరం లేక పార్టీలో సర్దుకు పోయిన ఎమ్మెల్యేలు ఇప్పుడు రేచుక్క రేవంత్ ఆశతో తిరిగి సొంత గూటికి చేరేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఒక్క కాంగ్రెస్ పార్టీని వదిలి తెరాసలో చేరినవారే కాకుండా, తెరాసలో చేరిన రేవంత్ రెడ్డి టీడీపీ పాత మిత్రులు, బీజేపీలో చేరి బయటకు వచ్చిన నాగం జనార్ధన రెడ్డి లాంటి మరికొందరు, ప్రస్తుతం బీజేపీలో ఉన్న మాజీ కాంగ్రెస్, మాజీ టీడీపీ నాయకులు కూడా ఆయన టచ్’లోకి వస్తున్నట్లు తెలుస్తోంది.
మొత్తానికి, కేసీఆర్, గత ఏడేళ్ళుగా సామదానదండో పాయాలతో ప్రయోగించిన ఆకర్ష్ మంత్రం ఇప్పుడు రివెర్స్ గేర్’లో దూసుకు వస్తోందని, తెరాస వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. జులై 7 న రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత కానీ,అసలు సీన్ తెరమీదకు రాదని గాంధీ భవన్ వర్గాల సమాచారం. మరో వంక కేసీఆర్’కు ఇక మ్యూజిక్ తప్పదని, రాత్రులు నిద్ర కూడా కష్టమేనని, రాజకీయ జ్యోతిష్కులు సైతం శుభం పలుకుతున్నారు.