కేసీఆర్‌కు మెఘా షాక్! కాళేశ్వరంలో ఏం జరిగింది?
posted on Jul 1, 2021 @ 1:09PM
కాళేశ్వరం.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కలల ప్రాజెక్ట్. ఆసియాలోనే అతిపెద్ద ఎత్తిపోథల పథకంగా చెప్పుకుంటున్న కాళేశ్వరం ప్రాజెక్టును అనతి కాలంలో పూర్తి చేశారు. బ్యారేజీలు, పంపు హౌజ్ లు, వరద కాలువలు, సర్జిపూల్స్ ఈ ప్రాజెక్టులో ప్రత్యేకం. కాళేశ్వరం ప్రాజెక్టులో మెజార్టీ పనులను మెఘా ఇంజనీరింగ్ సంస్థ నిర్వహించింది. ప్రాజెక్టును అనుకున్న సమయానికే పూర్తి చేసిందంటూ మెఘా సంస్థను కేసీఆర్ కూడా పలు సార్లు ఓపెన్ గానే ప్రశంసించారు. అయితే ఇప్పుడా మెఘా సంస్థే కేసీఆర్ కు షాకిచ్చిందని తెలుస్తోంది. ఆ సంస్థ తీరుపై కేసీఆర్ అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారట.
కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇటీవల డిస్కవరీ ఛానెల్ లో టెలికాస్ట్ అయిన డాక్యుమెంటరీనే తాజా వివాదానికి కారణమని తెలుస్తోంది. డిస్కవరీలో కాళేశ్వరం డాక్యుమెంటరీని ముందుగా హైలెట్ చేసిన ప్రభుత్వం… నీటిపారుదల శాఖ ఆ తర్వాత తేలిగ్గా తీసిపారేస్తోంది. దాదాపు 55 నిమిషాల ఈ డాక్యుమెంటరీలో అత్యధికంగా మెఘా ప్రాజెక్టు, సంస్థ ఇంజినీర్లు, సంస్థ ప్రతినిధులనే హైలెట్చేశారు. ప్రభుత్వం, ఇరిగేషన్ఇంజినీర్ల భాగస్వామ్యాన్ని తెరకెక్కించడంలో వెనకబడ్డారు. దీంతో ఇది కాళేశ్వరం డాక్యుమెంటరా… మెఘా సంస్థ సొంత వీడియోలా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. కాళేశ్వరం ప్రత్యేక డాక్యమెంటరీలో కేవలం నిర్మాణ సంస్థనే హైలెట్చేసినట్లు ఇరిగేషన్ఇంజినీర్లు మండిపడుతున్నారు. అసలు ఇంజినీర్లు, ప్రభుత్వం చేసిందంతా పక్కన పెట్టి కేవలం మెఘా నిర్మాణ సంస్థ కష్టంతోనే కాళేశ్వరం పూర్తి చేశారనే విధంగా కథనం వచ్చిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వాస్తవానికి డిస్కవరీలో కాళేశ్వరం ప్రత్యేక డాక్యుమెంటరీపై ప్రభుత్వం కూడా విస్తృత ప్రచారం చేసింది. ఆ డాక్యుమెంటరీని తిలకించాలంటూ ప్రకటనలు ఇచ్చింది. కాళేశ్వరం ప్రగతి దేశ, విదేశాలకు పాకుతుందని, అంతర్జాతీయ వేదికపై కాళేశ్వరం ఆవిష్కృతమవుతుందంటూ నీటిపారుదల శాఖ ఈ కథనానికి ప్రచారం కల్పించింది. కానీ డిస్కవరీలో వచ్చిన పూర్తి కథనంలో నిర్మాణ సంస్థను హైలెట్ చేసినంతగా ప్రాజెక్టును చూపించలేదు. దీనిలో ప్రభుత్వం, ఇంజినీర్లు చేసిన కృషిని తక్కువగానే చూపించారు. పనులపై నీటిపారుదల శాఖ ఇంజినీర్లతో కాకుండా… ఎంత మేరకు పనులు చేశాం, ఎలా పనులు చేశామంటూ మెఘా ఇంజినీర్లతోనే చెప్పించారు. డాక్యుమెంటరీలో మెఘా ఇంజినీరింగ్సంస్థ ఎండీ కృష్ణారెడ్డి, డైరెక్టర్ శ్రీనివాస్‌రెడ్డితో పాటు ఇతర స్థాయిల్లోని కంపెనీ ఇంజినీర్లతోనే కథనంలో మాట్లాడించారు. మొదట్లో ఒకసారి, చివర్లో ఒకసారి కాళేశ్వరం ప్రాజెక్టు సీఈతో మాట్లాడించారు.
కాళేశ్వరం నిర్మాణంలో తమ సంస్థను హైలెట్ చేసుకునే క్రమంలో ప్రభుత్వాన్ని కూడా పట్టించుకోలేదనే విమర్శలు వస్తున్నాయి. నిర్మాణ సంస్థ ఎండీ ఐదారు సార్లు మ్యాపులను పరిశీలిస్తూ, పలుమార్లు పనులను పరిశీలిస్తూ, కొన్ని సందర్భాల్లో తమ సిబ్బందికి సలహాలు ఇస్తూ కనిపించేలా చిత్రీకరించుకున్నారు. దీనిపై సంస్థ ఎండీ కృష్ణారెడ్డి, డైరెక్టర్శ్రీనివాస్రెడ్డితో పదేపదే మాట్లాడించారు. కానీ సీఎం కేసీఆర్, ఇంజినీర్లను కేవలం రెండు నిమిషాలకే పరిమితం చేశారు. పనులు మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మెఘా కంపెనీ చేసిన పూజలు, పనులు… ఇలా అన్నింటినీ పాత వీడియోలతో ఈ కథనం చూపించారు. దీంతో సీఎం కేసీఆర్ కూడా అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం.
ప్రభుత్వ గొప్పతనాన్ని కాదని కేవలం నిర్మాణ సంస్థను ఫోకస్ చేయడంపై ఇరిగేషన్ ఉన్నతాధికారులపై కూడా కేసీఆర్ కొంత ఆగ్రహం వ్యక్తం చేసినట్లు జల వనరుల శాఖ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. లక్ష కోట్లు ఖర్చు పెట్టి చేపట్టిన ప్రాజెక్టును ఒక నిర్మాణ సంస్థ తమ గొప్పతనంగా చూపించుకోవడం డాక్యుమెంటరీలో ప్రధానంగా నిలిచిందని టీఆర్‌ఎస్‌వర్గాలు సైతం అసహనంగా ఉన్నాయి. ఇరిగేషన్ ఇంజినీర్లు కూడా సదరు నిర్మాణ సంస్థపై బహిరంగంగానే మండిపడుతున్నారు. మెఘా కంపెనీ ఇంజినీర్లు, ఆ సంస్థే పని చేసినట్లుగా చూపించుకుని, తమను తక్కువ చేశారంటూ ఆగ్రహిస్తున్నారు.