ఉప్పెనలా మళ్లీ అమరావతి ఉద్యమం.. ఇక తగ్గేదే లే..!
posted on Jul 1, 2021 @ 3:45PM
600 రోజుల దిశగా అడుగులు. అమరావతి కోసం అలుపెరగని పోరాటం. మడమ తిప్పని, వెనక్కి తగ్గని ఉద్యమం. ఎండా-వానాను లెక్క చేయడం లేదు. కేసులు, కుట్రలకు తల వంచడం లేదు. లాఠీ దెబ్బలకు బెదరడం లేదు. కరోనాకూ భయపడటం లేదు. కాల పరీక్షకు నిలిచి ఆంధ్రుల కలల రాజధాని కోసం నిర్విరామంగా పోరాడుతున్నారు. కనుచూపుమేరలో ఫలితం కానరాకున్నా.. కళ్లల్లో నీళ్లు ఇంకుతున్నా.. గుండెల్లో ధైర్యం మాత్రం సడలలేదు. అమరావతి కోసం అవిశ్రాంత పోరాటం ఆపడం లేదు.
కరోనా విజృంభణతో అమరావతి ఉద్యమం సైడ్‌వేస్‌లోకి వెళ్లినా.. ఇప్పుడు కేసులు తగ్గడం, కర్ఫ్యూ సడలించడంతో మళ్లీ పడిలేచిన కెరటంలా ఉవ్వెత్తున ఎగుస్తోంది. అమరావతి రైతులు మళ్లీ తమ తడాఖా చూపిస్తున్నారు. కలిసివచ్చే ప్రతీ సందర్భాన్ని పోరాట అంశంగా మార్చుకుంటున్నారు. ఇటీవల తెలంగాణ ప్రయోజనాల కోసం ఎవరితోనైనా పోరాడుతాం.. ఒక్క నీటి చుక్క కూడా వదులుకోమంటూ.. వైఎస్ షర్మిల ట్వీట్ చేయడం అమరావతి రైతులకు ఆగ్రహం తెప్పించింది. తమ పక్కనుంచి పారే కృష్ణానదిని తెలంగాణ అడ్డుకుంటుంటే.. ఏపీ బిడ్డ అయిన షర్మిల వారికి ఎలా వంత పాడుతారంటూ.. ఛలో లోటస్ పాండ్ నిర్వహించారు ఇక్కడి రైతులు. డొంక తిరుగుడు ట్వీట్లు కాదు.. కృష్ణా జలాలపై స్పష్టమైన వైఖరి చెప్పాలంటూ షర్మిలను నిలదీస్తూ హైదరాబాద్‌లోని ఆమె ఇంటిని ముట్టడించారు.
ఎక్కడి అమరావతి రైతులు. ఎక్కడి షర్మిల. తానేదో తన మానాన తాను మాడిపోయిన మసాలా దోష తింటూ.. వాటర్ వార్‌లో మరింత మసాలా జోడించేందుకు అన్నట్టు.. అప్పుడెప్పుడో బట్టీ పట్టేసి వదిలిన పాత డైలాగులను ఇప్పుడు మళ్లీ కొత్తగా రిపీట్ చేస్తే.. తెలంగాణ వాళ్లే పట్టించుకోలేదు.. అమరావతి రైతులు ఇంత సీరియస్‌గా తీసుకున్నారేంటబ్బా అంటూ షర్మిలమ్మ అవాక్కయి ఉంటారు. అమరావతి రైతులా.. మజాకా. తమ ప్రయోజనాలకు భంగం కలిగించే ఏ అంశంపైనైనా వారు నో కాంప్రమైజ్ అన్నట్టు పోరాడటం వారి నైజం. అందుకే, రాజ్యం ఎన్ని కుట్రలు చేస్తున్నా.. అమరావతిని ఆగం చేయాలని చూస్తున్నా.. మొక్కవోని పట్టుదలతో.. ఇటు హైకోర్టులో, అటు ప్రజాక్షేత్రంలో పోరాడుతున్నారే కానీ.. జగన్‌లా మాటతప్పడం.. మడమ తిప్పడం.. చేయడం లేదంటున్నారు. అందుకే, షర్మిల చేసిన ట్వీట్‌తో వాళ్లకు ఒళ్లుమండి.. పక్క రాష్ట్రం వెళ్లి మరీ.. లోటస్‌పాండ్‌ను ముట్టడించడం.. అమరావతి రైతుల పట్టుదలకు నిదర్శనం. వీరిని కాదని అమరావతిని అక్కడి నుంచి తరలించడం ఎవరి తరం కానేకాదు. ఆఖరికి సీఎం జగన్‌కు సైతం కోర్టులో ఎదురుదెబ్బ తప్పదు. దొంగదారిలో విశాఖకు రాజధానిని షిఫ్ట్ చేయగలరేమో కానీ, అధికారిక రికార్డుల నుంచి అమరావతి పేరును మార్చడం జేజమ్మ తరం కూడా కాదంటున్నారు ఇక్కడి రైతులు.
కరోనా కాస్త కంట్రోల్‌లోకి రావడంతో అమరావతి ఉద్యమం మళ్లీ ఉవ్వెత్తున ఎగుస్తోంది. వైఎస్ షర్మిల ఇంటిముట్టడితో శుభారంభం చేసినట్టున్నారు రైతులు. ఆ టెంపో కంటిన్యూ చేస్తూ.. బుధవారం సీఎం జగన్ కరకట్ట విసర్తణ పనులకు శంకుస్థాపన చేసి మందడం మీదుగా సచివాలయానికి వెళ్తుండగా.. స్థానికి రైతులు.. జై అమరావతి, సేవ్ అమరావతి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దాదాపు 200 మంది పోలీసులను మోహరించినా ఎక్కడా తగ్గలేదు. షాపులు మూయించి.. పోలీసులు అడ్డుగోడగా నిలబడి.. ఉద్యమకారులను గృహనిర్బంధంలో ఉంచి.. రకరకాలుగా ప్రయత్నించినా.. జై అమరావతి, సేవ్ అమరావతి నినాదాలు జగన్ చెవికి సోకకుండా అడ్డుకోలేకపోయారు.
మరోవైపు, తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి మరోసారి రాజధాని దళిత రైతుల సెగ తగిలింది. కరోనా నుంచి కోలుకున్న తరువాత నియోజకవర్గానికి వస్తున్న ఆమెను రాజధాని గ్రామాల నుంచి గుంటూరుకు ర్యాలీగా తీసుకు వెళ్లాలని అనుచరులు భావించారు. అయితే ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు అవుతున్నా.. అసైన్డ్ రైతులకు కౌలు, ఫించన్ రూ.5 వేలు, టీడ్‌కో గృహాలు కేటాయించకుండా గ్రామాల్లోకి ఎలా వస్తారంటూ రాజధాని రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఏం సాధించారని రాజధాని గ్రామల్లో ర్యాలీ నిర్వహిస్తారంటూ.. ఎమ్మెల్యే శ్రీదేవీ ర్యాలీని అడ్డుకునేందుకు దళిత రైతులు ప్రయత్నించగా.. పోలీసులు వారిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.
కరోనా తగ్గిందిగా.. ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే. ముందుముందు ఉద్యమం మరింత ఉధృతం చేస్తాం.. సీఎం జగన్ దిగొచ్చేదాకా.. తగ్గేదే లే.. అంటున్నారు అమరావతి రైతులు.