జగన్ జెండా ఎత్తేశారు..
posted on Jul 1, 2021 @ 5:53PM
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తెలంగాణలో పార్టీ జెండా పీకేశారు. తెలంగాణ విభజనకు ముందు, 2014లో జరిగిన లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పోటీ చేసింది. మూడు అసెంబ్లీ ఒక లోక్ సభ స్థానంలో విజయం సాధించింది. అయితే ఆ తర్వాత జగన్ రెడ్డి, అధికార దాహంతో ముఖ్యమంత్రి కావాలనే ఏకైక లక్ష్యంతో ఏపీ మీద దృష్టి పెట్టి తెలంగాణలో తమను నమ్ముకున్న వారందరినీ నట్టేట ముంచేసి, పార్టీని గాలికి వదిలేశారు. దాంతో గెలిచిన ముగ్గురు ఎమ్మెల్యేలు, ఎంపీ తెరాసలో చేరిపోయారు.అలాగే, తెలంగాణలో వైసీపీ జెండా పీకేయడంతో వైఎస్సార్ పట్ల అభిమానంతో, మంత్రి పదవిని వదులుకుని, వైసీపీలో చేరిన కొండా సురేఖ, ఆమె భర్త కొండ మురళి వంటి అనేక మంది రాజకీయ జీవితమే ప్రశ్నార్ధకంగా మారి పోయింది. అప్పటినుంచి కొండా దంపతుల పొలిటికల్ జర్నీ అలా గాలిలో దీపంలాగా, కొట్టుమిట్టాడు తోంది. అలాగే, జగన్ రెడ్డిని నమ్ముకుని కాంగ్రెస్’ను వదిలి వచ్చిన ఇతర నాయకులలో కొందరు సొంతగూటికి చేరితే, మరి కొందరు కారెక్కారు. మరో కొందరు రెంటికి చెడ్డ రేవడిలా జగన్ రెడ్డి రాజకీయ స్వార్ధానికి రాజకీయంగా బలై పోయారు.
అలా బలై పోయిన నాయకుల్లో వైసీపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి కూడా ఉన్నారు. నల్లగొండ జిల్లాకు చెందిన ఆయన 2014 ఎన్నికల్లో హుజూర్ నగర్ నుంచి పోటీ చేసి 35 వేల ఓట్లు తెచ్చుకున్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉద్యమ నాయకురాలు శంకరమ్మకు గట్టి పోటీ పోటీ ఇచ్చారు. ఆ తర్వాత కూడా ఆయన పార్టీ కోసం ఎంతో కష్టపడ్డారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో వైసీపీ పోటీ చేయకపోయినా, వైఎస్ మీద ఉన్న అభిమానంతో లేదా జగన్ రెడ్డి ఎదో ఒకనాటికి రాష్ట్రంలో పార్టీని నిలబెడతారనే ఆశతో అలాగే పార్టీలో ఉన్నారు.అయితే, ఇటీవల జగన్ రెడ్డి తెలంగాణలో తమ ఆస్తుల రక్షణ కోసం, కేసీఆర్’కు పూర్తిగా సరెండర్ కావడంతో, వైసీపీకి గుడ్ బై చెప్పారు. గురువారం తెలంగాణ బీజేపీ అధ్యక్షడు బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా గట్టు శ్రీకాంత్ రెడ్డి, జగన్ రెడ్డి స్వార్ధ రాజకీయాలకు, అనేకమంది రాజకీయంగా తెరమరుగయ్యారని ఆవేదన వ్యక్త చేసారు.ఏదేమైనా గట్టు శ్రీకాంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్లిపోవడంతో తెలంగాణలో వైసీపీ సంపూర్ణంగా ... సమాధి అయిందని
అనుకోవచ్చును.