నీళ్ల దొంగలా? తోడు దొంగలా? దొందు దొందేనా..?
posted on Jul 1, 2021 @ 12:25PM
జగన్ గజదొంగ.. వైఎస్సార్ నీళ్లదొంగ. ఇదీ తెలంగాణ మంత్రుల ఆరోపణ. కాదు కాదు.. జగన్, కేసీఆర్ ఇద్దరూ తోడు దొంగలే అనేది ప్రతిపక్షాల విమర్శ. ఇలా దొంగల దంగల్ తెలుగురాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఎవరు దొంగ? ఎవరు గజదొంగ? ఎవరెవరు తోడు దొంగలు? అనే కన్ఫ్యూజన్‌తో వాటర్ పాలిటిక్స్ రంజుగా మారాయి.
తెలంగాణ దూకుడు మీదుంది. ఏపీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేందుకు శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతలలో అవసరం లేకున్నా విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది. దీంతో ఏపీ కుర్రోమెర్రోనంటూ మొత్తుకుంటోంది. ఆ ప్రాజెక్టుల్లో నీళ్లే లేవు.. ఉన్న కాసిన్ని నీళ్లను కరెంట్ కోసం ఎందుకు వేస్ట్ చేస్తున్నారు.. ముందుముందు రైతుల పరిస్థితి ఏంటంటూ గగ్గోలుపెడుతున్నారు ఏపీ మంత్రి అనిల్. మేం పైనున్నాం.. మా ఇష్టం అనేది తెలంగాణ టెంపర్‌మెంట్. అసలు మూలాల్లోకి వెళితే.. నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టులు కట్టిందే విద్యుత్ ఉత్పత్తి కోసం.. సాగునీటికి కాదంటూ లా పాయింట్లతో వాదిస్తోంది తెలంగాణ. ఇట్టా అయితే ఎట్టా అంటూ.. కృష్ణాబోర్డుకు, ప్రధానికి ఫిర్యాదు చేస్తామంటూ.. సీఎం జగన్ గట్టి రిటార్డ్ ఇచ్చేందుకు ట్రై చేస్తున్నారు. చూస్తుంటే.. రెండు రాష్ట్రాలు.. ఇద్దరు సీఎంలు.. జలజగడంలో పట్టుదలకు పోతున్నారని.. తమ తమ రాష్ట్ర ప్రయోజనాల కోసం గట్టిగా పోరాడుతున్నారని అనిపించేలా జల వివాదం జోరుగా సాగుతోంది.
అయితే.. ఇదంతా ఉత్తుత్తి డ్రామానే అనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. తెలంగాణలో కేసీఆర్ ఇమేజ్ బాగా డ్యామేజ్ అయిందని.. ఇటు ఈటల.. అటు రేవంత్‌లతో ఆయనకు రాజకీయంగా మద్దెల దరువు మొదలైందని అంటున్నారు. ఆ డబుల్ బ్యారెల్ గన్ ఫైరింగ్ నుంచి తప్పించుకోడానికే.. జనంలో వాటర్ సెంటిమెంట్ రెచ్చగొడుతున్నారనేది కొందరి అనుమానం. నీళ్ల కోసం మా కేసీఆర్ ఏపీతో ఫుల్ ఫైట్ చేస్తున్నారనే భ్రమ ప్రజల్లో కలిగించడానికే ఇంత రచ్చ చేస్తున్నారని చెబుతున్నారు. తెలంగాణ మంత్రులు కావాలనే.. ఇంతకుముందెన్నడూ లేనంతగా జగన్‌ను ఇష్టమొచ్చినట్టు తిడుతున్నారని.. ఇదంతా తెరపైన ఉత్తుత్తి తిట్లేనని.. తెర వెనుక వాళ్లిద్దరూ రహస్య స్నేహితులేననేది ప్రతిపక్షాల మాట.
ఇటు ఏపీ సీఎం జగన్ సైతం డబుల్ గేమ్ ఆడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రాయలసీమ ప్రయోజనాల కోసం ఫైట్ చేస్తున్నట్టు బిల్డప్ ఇవ్వడానికే.. రాయలసీమ ఎత్తిపోతల పథకం- ఆర్డీఎస్‌పై హడావుడి చేస్తున్నట్టు సీన్ క్రియేట్ చేస్తున్నారని అనుమానిస్తున్నారు. నేను కాలువ తవ్వుతున్నట్టు చేస్తా.. నువ్వు ఆపుతున్నట్టు చేయి.. అనేట్టు ఇద్దరు సీఎంలా వ్యవహారం ఉందని విమర్శిస్తున్నారు. సీమ కోసం కేసీఆర్‌తో జగన్ పోరాడుతున్నారనే అభిప్రాయం కలిగేలా ముఖ్యమంత్రి మేనేజ్ చేస్తున్నారని అంటున్నారు. ఇటు రాజకీయ ప్రయోజనాలు, అటు హైదరాబాద్‌లో తన ఆస్తుల రక్షణకే.. జగన్ ఇలా జల డ్రామా ఆడుతున్నారనేది ప్రతిపక్షం ఆరోపణ.
తాజాగా, విజయవాడ ఎంపీ కేశినేని నాని అవే ఆరోపణలు చేశారు. ఇరు రాష్ట్రాల మధ్య జల వివాదం పెద్ద డ్రామా. ప్రజలను ఆ ఇద్దరూ పిచ్చోళ్లను చేసి ఆడుకుంటున్నారు. కేసీఆర్, జగన్ ఇద్దరూ తోడు దొంగలేనంటూ టీడీపీ చేసిన విమర్శలపై చర్చ జరుగుతోంది. లేదంటే.. నిత్యం బూతులు మాట్లాడే మంత్రి కొడాలి నాని.. జగన్‌ను అన్నేసి మాటలు అంటున్నా మౌనంగా ఉండటమేంటి? తెలంగాణ మంత్రులు వైఎస్సార్‌ను నీళ్లదొంగ అన్నా.. ఏపీ నీళ్ల మంత్రి అనిల్ అలా సుతిమెత్తగా మాట్లాడటటేంటి? నిజమే,. అంతా డ్రామాలానే ఉందని అంటున్నారు జనాలు. నేను కొట్టినట్టు చేస్తా.. నువ్వు ఏడ్చినట్టు నటించు.. అన్నట్టు ఉంది తెలుగు పాలకుల తీరు అంటూ ప్రజలు పరేషాన్ అవుతున్నారు.