ఉద్యమకారుల దూకుడు.. గులాబీ బాస్ కు గుబులు!
posted on Jul 1, 2021 @ 4:30PM
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మంత్రివర్గం నుంచి ఈటల రాజేందర్ తొలగింపుతో రాజకీయాలు వేడెక్కాయి. నెల రోజుల పాటు అంతా ఆయన చుట్టూనే సాగింది. తాజాగా ఎంపీ రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి రావడంతో అటెన్షన్ అంతా అటు వైపు మళ్లింది. మొన్నటి వరకు తెలంగాణలో టీఆర్ఎస్ కు బీజేపీని పోటీ ఇస్తుందని అంతా భావించారు. త్వరలో జరగబోయే హుజురాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికలోనూ కారు, కమలం మధ్యే పోటీ ఉంటుందని అంచనా వేశారు. కాని పీసీసీ బాస్ గా రేవంత్ రావడంతో సీన్ మారిపోయింది. కాంగ్రెస్ కూడా రేసులోకి వచ్చిందనే చర్చ జరుగుతోంది. ఇకపై తెలంగాణలో త్రిముఖ పోరు రసవత్తరంగా ఉంటుందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
కేసీఆర్ సర్కార్ పై జనాగ్రహం తీవ్రంగా ఉందనే ప్రచారం చాలా కాలంగా ఉంది. దీంతో ఇదే అదనకుగా కేసీఆర్ టార్గెట్ గా ఉద్యమ సంస్థలు యాక్టివ్ అవుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వివిధ వర్గాల నేతలంతా ఏకమవుతున్నారు. తెలంగాణ ప్రజలు ఆకాంక్షలు కేసీఆర్ వమ్ము చేశారని ఆరోపిస్తున్న ఉద్యమకారులు.. ఆయనపై ఉద్యమించేందుకు ఉమ్మడి వేదిక నిర్మిస్తున్నారు.
తెలంగాణ ఉద్యమకారుడు, మాజీమంత్రి ఏ.చంద్రశేఖర్ నివాసంలో ఆదివారం ఉద్యమకారులు సమావేశమై చర్చించారు. కరుడుగట్టిన తెలంగాణ ఉద్యమ నేత గాదె ఇన్నయ్య, స్వామిగౌడ్, ఎమ్మెల్యే యన్నం శ్రీనివాసరెడ్డి, బెల్లయ్య నాయక్, కపిలవాయి దిలీప్ కుమార్, బండి సాదానంద్, రవీంద్ర నాయక్ వంటి ఉద్యమ నేతలు హాజరయ్యారు.
అద్దంకి దయాకర్ తో పాటు మరికొందరు ఉద్యమ నేతలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తమ అభిప్రాయాలు పంచుకున్నారు. కేసీఆర్ కు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో కలిసి వస్తామని చెప్పారు.ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాల సాధన కోసం ఉద్యమకారులంతా ఒకే వేదిక మీదకు రావాలని పిలుపిచ్చారు. హుజూరాబాద్‌లో ఉద్యమకారులతో భారీ సభ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగానే శుక్రవారం మరోసారి సమావేశమవుతున్నారు ఉద్యమ కారులు. ఆదివారం జరిగిన సమావేశానికి హాజరుకాని మరికొందరు ఉద్యమకారులు..శుక్రవారం భేటీకి వస్తారని చెబుతున్నారు. టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ తో పాటు సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ ఈ భేటీకి వస్తారని చెబుతున్నారు. ఈ సమావేశంలోనే తమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించబోతోంది ఉద్యమకారుల ఉమ్మడి ప్రజా స్వామ్య వేదిక.
తెలంగాణ ఉద్యమకారులు హుజురాబాద్ ఎన్నిక రాష్ట్రానికి అత్యంత కీలకమని భావిస్తున్నారు. తెలంగాణలో ఏడేండ్లుగా నియంతృత్వ పాలన సాగుతుందని ఆరోపిస్తున్న ఉద్యమకారులు... హుజురాబాద్ లో టీఆర్ఎస్ గెలిస్తే.. కేసీఆర్ నియంతృత్వం మరింత పెరుగుతుందని చెబుతున్నారు. ఆయన నుంచి రాష్ట్రాన్ని ఎవరూ కాపాడలేరని ఆందోళన చెందుతున్నారు. అందుకే హుజురాబాద్ లో కేసీఆర్ కు తగిన బుద్ది చెప్పేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ఉద్యమంలో జరిగిన ఘటనలు, కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీలు, గత ఏడేండ్లుగా సాగుతున్న టీఆర్ఎస్ పాలనపై పూర్తి అవగాహనతో ఉన్న ఉద్యమకారులు.. ఇంటింటికి తిరికి కేసీఆర్ మోసాలు, వైఫల్యాలు, తెలంగాణ జనాల ఆకాంక్షల గురించి ప్రచారం చేయాలనే యోచనలో ఉన్నారని తెలుస్తోంది. ఉద్యమకారులంతా ఏకమై జనంలోకి వెళితే.. గులాబీ బాస్ చుక్కలు కనిపించడం ఖాయమనే అభిప్రాయం వస్తోంది. అందుకే టీఆర్ఎస్ వర్గాలు కూడా ఉద్యమకారుల కదలికలపై నిఘా పెట్టారని చెబుతున్నారు.