సర్కార్ పై ఇద్దరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల యుద్ధం! ఏం జరగనుందో...
posted on Jul 2, 2021 8:41AM
వాళ్లిద్దరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు .. అయినా ప్రభుత్వంపై తిరగబడ్డారు. ఏకంగా యుద్ధమే ప్రకటించారు. సొంత పార్టీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఇద్దరు ఎమ్మెల్యేలు ఉద్యమానికి దిగడం సంచలనంగా మారింది. అధికార పార్టీలో గందరగోళానికి కారణమైంది. వివరాల్లోకి వెళితే ఉమ్మడి ఆదిలాబాద్. ఖమ్మం జిల్లాల ఏజెన్సీలో పోడు భూముల వివాదం ముదిరింది. ఆదిలాబాద్ తో పాటు అన్ని జిల్లాల్లోని అడవి భూములున్న ప్రాంతాలకు పాకింది. మంచిగా వర్షాలు కురుస్తుండటంతో పొలం పనుల్లో ఉండాల్సిన పోడు రైతులు పోరు బాట పడుతున్నారు. ప్రజా ప్రతినిధులు కూడా తాము సైతం సై అన్నట్టుగా రైతుల పక్షాన గళం విప్పుతున్నారు.
ఆదిలాబాద్ ఏజెన్సీ ప్రాంతాల్లో గతంలో పోడు ఉద్యమం ఉవ్వెత్తున సాగింది. అయితే ఆ ప్రాంతంలో పులులు సంచరించడంతో జనాలు బయటికి రావడానికి భయపడ్డారు. పులి భయానికి కొంత కాలం పోడు వ్యవసాయం ఆపేశారు. ఇదే అదనుగా భావించిన స్థానిక అటవీశాఖ ఇక్కడి భూములను ఆక్రమించే యత్నం చేసింది. హరితహారం సాకుగా చూపి.. ఇక్కడ మొక్కలు నాటే ప్రయత్నం చేసింది. అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధులకు తమ ప్రభుత్వ అధికారులతోనే పంచాయతీ మొదలైంది. దీంతో పొడు భూముల్లో భీకర వాతావరణం ఎందుకు నెలకొంది..
ఆదివాసీలకు మద్దతుగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రంగంలోకి దిగారు. ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు రెండు సార్లు అటవీశాఖ అధికారులపై యుద్ధం ప్రకటిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ఆదివాసీ బిడ్డలు కదలి రావాలి అని పిలుపునిచ్చారు. తాజాగా ఉమ్మడి ఆదిలాబాద్ లో సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కొనప్ప కూడా అటవీశాఖ పై యుద్దానికి సిద్ధం అంటూ ప్రకటన చేశారు.విత్తనాలు నాటకుండా అధికారులు అడ్డుకుంటే తీవ్రపరిణామాలు ఉంటాయనిహెచ్చరించారు.గతంలో ఇదే నియోజకవర్గంలో పొడుభూముల విషయంలో కొనప్ప తమ్ముడుపై అటవీశాఖ అధికారులపై దాడి చేశాడని కేసులు కూడా పెట్టారు.
పొడు భూముల్లో ఆదివాసులకు వ్యవసాయం అనుమతి లేదంటూ ప్రతి సంవత్సరం అటవీశాఖ అధికారులు రైతులను అడ్డుకోవడం వారికి వీరికి మధ్య గొడవలు జరగడం ఒకానొక సందర్భంలో దాడులు జరిగిన ఘటనలు ఉన్నాయి. ఒకవైపు ప్రభుత్వ పెద్దలు అటవీశాఖ అధికారులకు ఎంత చెప్పినా సీన్ రిపిట్ అవ్వడం పట్ల పొడు భూములు ఉన్న ఎమ్మెల్యేలకు ఇబ్బందిగా మారింది. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్.. పొడు భూముల సమస్య రాష్ట్రవ్యాప్తంగా ఉందని, త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కానీ అది ఆచరణ సాధ్యం కాలేదు. దీంతో తమ నియోజకవర్గాల్లో ఆదివాసీ ఓటు బ్యాంక్ కలిగిన ఎమ్మెల్యలు అటూ ప్రభుత్వ అధికారులను ఎదిరించలేక.. ఇటు తమ ప్రజలను కాదనలేక నలగిపోతున్నారట.