తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు.. ఎప్పటినుంచంటే..!
posted on Jul 1, 2021 @ 4:12PM
తెలంగాణ ప్రజలకో గుడ్ న్యూస్. ఎంతో కాలందగా ఎదురుచూస్తున్న కొత్త రేషన్ కార్డుల పంపిణికి ముహుర్తం కుదిరింది. త్వరలోనే కార్డులను అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్త రేషన్ కార్డులకు సంబంధించి టీఆర్ఎస్ సర్కార్ పై తీవ్ర విమర్శలు ఉన్నాయి. గత నాలుగేండ్లుగా ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. కొత్త రేషన్ కార్డులతో పాటు సవరణలు, పిల్లలను చేర్చించడానికి జనాలు దీర్ఘకాలంగా ఎదురు చూస్తున్నారు. మీ సేవా కేంద్రాల్లో అప్లయ్ చేసుకుని ఎప్పుడు ఇస్తారా అని ఆశగా ఉన్నారు. అయితే కేసీఆర్ సర్కార్ మాత్రం రేషన్ కార్డుల జారీని పట్టించుకోలేదు. దీంతో మీ సేవా కేంద్రాలు, అధికారుల చుట్టూ తిరిగి బేజారయ్యారు జనాలు.
ఇటీవల టీఆర్ఎస్ కు రాజీనామా చేసిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ కూడా.. గత నాలుగేండ్లుగా తాను ఒక్క రేషన్ కార్డు కూడా ఇప్పించలేకపోయాయని చెప్పారు. ఈటల ఎఫెక్ట్ తగిలిందో ఏమో తెలియదు కాదు.. రేషన్ కార్డుల పంపిణిపై ఫోకస్ చేసింది కేసీఆర్ సర్కార్. పెండింగులో ఉన్న ధరఖాస్తులను క్లియర్ చేయాలని ఆదేశించింది. దీంతో రేషన్ కార్డుల కోసం వచ్చిన అప్లికేషన్లును పరిశీలంచగా.. దాదాపు ఐదు లక్షల వరకు పెండింగులో ఉందని తేలింది. వాటన్నింటిని క్లియర్ చేసే పనిలో పడ్డారు అధికారులు. వీలైనంత త్వరగా కొత్త కార్డులు అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
పల్లె పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా సిరిసిల్లలో పర్యటించిన మంత్రి కేటిఆర్ .. కొత్త రేషన్ కార్డుల పంపిణిపై ప్రకటన చేశారు. జూలై8 నుంచి కొత్త కార్డులు ఇవ్వబోతున్నామని చెప్పారు. పెండింగు ధరఖాస్తుల పరిశీలన పూర్తైందని, అర్హులైన వారందరికి కార్డులు ఇస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో గత 70 సంవత్సరాల్లో జరగని అభివృద్ధి కార్యక్రమాలను ఏడు సంవత్సరాల్లో చేసి చూపించామని మంత్రి కేటిఆర్ తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్లే మానేరు నిండిందన్నారు. మండు వేసవిలో నర్మాల చెరువు మత్తడి పడిందన్నారు. చెరువుల నిండా నీళ్లు ఉండటంతో మత్స్యకారులు సంతోషంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాతే... చెరువులు బాగు పడ్డాయని అన్నారుయ తెలంగాణ ఏర్పడ్డాకే రాష్ర్టంలో 24 గంటల కరెంట్ వచ్చిందన్నారు.
ఇక గ్రామాల్లో త్వరలోనే రెండో విడత గొర్రెల పెంపకం చేపడుతామని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ర్టంలోని 12,769 గ్రామ పంచాయతీల్లో ట్రాక్టర్, ట్యాంకర్, నర్సరీ ఏర్పాటు చేశామన్నారు. రైతుబంధు స్ఫూర్తితో కేంద్రం పీఎం కిసాన్ అమలు చేస్తోందన్నారు. హరిత హారం సంధర్భంగా ఊరంతా మొక్కలు నాటి పెంచాలని ఆయన పిలుపునిచ్చారు. కరోనా సమయంలో ఆక్సిజన్ విలువ అందరికీ తెలిసిందని.అందుకే.. ప్రతి ఇంట్లో ఉన్న ఒక్కొక్కరు కనీసం ఒక మొక్క నాటి పెంచాలని సూచించారు.హరితహారం ప్రభుత్వ కార్యక్రమమే కాదని.. ప్రజల కార్యక్రమని, ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రూ.5,900 కోట్ల వ్యయంతో 220 కోట్ల మొక్కలు నాటే.. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద మానవ ప్రయత్నం కొనసాగుతుందన్నారు. తెలంగాణలో పచ్చదనం 23.4 శాతం నుంచి 28 శాతానికి పెరిగిందని ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా తెలిపిందన్నారు.