భారతరత్నకు ఆంధ్రులు అర్హులు కాదా?
దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి. రాజకీయాలకు అతీతంగా, ప్రజలు ఆయన్ని గుర్తుచేసుకున్నారు. ఆయన చేసిందంతా మంచి కాకపోవచ్చును, కానీ, అయన చేసిన పనులలో కొన్ని అయినా మంచి పనులున్నాయి.సో.. ఆయన జయంతి రోజు, అయన గుర్తుచేసుకోవడం, నివాళులు అర్పించడం, వీలయితే ఆయనలోని మంచి చెడులను చర్చించుకోవడం మంచిదే, ఒక విధంగా అవసరం కూడా.. అయితే ఆ విషయాన్ని అలా ఉంచితే, ఇంతకుముందు ఎవరైనా ఇలాంటి డిమాండ్ చేశారో లేదో గానీ, మాజే మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు.
సరే వైఎస్సార్’కు భారత రత్న అందుకునే అర్హత, యోగ్యతా ఉన్నాయా లేవా అనే విషయాన్ని పక్కన పెడితే , తెలుగు వారికి భారత రత్న ఎందుకనో గానీ అందనంత దూరంగానే ఉంటోంది . కేంద్రంలో కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వమున్నా, బీజేపీ కూటమే అధికారంలో ఉన్నా, తెలుగు వారి భారత రత్న ఆకాంక్ష మాత్రం అందని ద్రాక్షగానే మిగిలిపోతోంది. ఇప్పుడు కాంగ్రెస్ నాయకుడు జీవన్ రెడ్డి వైఎస్సార్’కు భారతరత్న ఇవ్వాలని కోరుతున్నారు. కానీ, 1996లో ఆయన కన్నమూసిన నాటి నుంచి తెలుగు దేశం పార్టీ , పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మహానటుడు నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్)కు భారత రత్న ఇవ్వాలని కోరుతూనే ఉంది . ప్రతి మహానాడులో, ఎన్టీఅర్ జయంతి (మే 28) రోజున, ఎన్టీఅర్’కు నివాళులు అర్పించడం ఎంత రివాజుగా వస్తోందో, ఎన్టీఅర్’కు భారత రత్న ఇవ్వాలనే తీర్మానం చేయడం కూడా అంటే రివాజుగా, ఆనవాయితీగా వస్తూనే వుంది. కానీ, చివరకు ఆ ఒక్కటీ అందని ద్రాక్షగానే మిగిలి పోతోంది. కేంద్రంలో స్వయంగా ఎన్టీఅర్ కుమార్తె పురందేశ్వరి మంత్రిగా ఉన్నా, తెలుగు దేశం పార్టీ భాగస్వామ్య పక్షంగా ఉన్న సంకీర్ణ ప్రభుత్వమే ఉన్నా, వర్ధంతులు, జయంతులు వచ్చి పోతూనే ఉన్నాయి కానీ, అన్ని అర్హతలు యోగ్యతలు ఉన్న ఎన్టీఅర్ దక్కవలసిన భారత రత్న గౌరవం దక్కడం లేదు.
ఇక భారత దేశం గర్వించదగిన తెలుగు బిడ్డ పీవీ నరసింహ రావు విషయం అయితే చెప్పనే అక్కర్లేదు. అపర చాణుక్యుడు, బహుభాషా కోవిధుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి ఈ అన్నింటినీ మించి దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి తప్పించి, సంస్కరణలకు శ్రీకారం చుట్టిన మన పీవీకి సైతం భారత రత్న దక్కలేదు. తెలంగాణ ప్రభుత్వం పీవీ శత జయంతి వేడుకలను సంవత్సరం పాటు నిర్వహించింది. ఈ వేడుకలను సుసంపన్నం చేస్తూ జూన్ 27 పేవీ జ్ఞాన భూమిలో పీవీ కాంస్య విగ్రహాన్ని అవిష్కరించారు. ఈ సంవత్సరం పొడుగునా అసెంబ్లీలో తీర్మానం చేయడంతో పాటుగా దేశ విదేశాలలో పలు వేదికల ద్వారా పీవీకి భారత రత్న ఇవ్వాలని, ప్రపంచ తెలుగు ప్రజలు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. పీవీ జీవితాంతం సేవ చేసిన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కానీ ఆ తర్వాత కానీ, పీవీని పట్టించుకోలేదు. చివరకు అయన శవాన్ని కూడా, కాంగ్రెస్ పార్టీ ఎంతో అగౌరవానికి గురిచేసింది. ఢిల్లీ నుంచి హైదరాబాద్ పంపేసి, చేతులు కడుక్కుంది.
పీవీ నరసింహారావు శతజయంతి వేడుకలు ప్రారంభం సందర్భంగా గత సంవత్సరం ఆగష్టు 28 న తెలంగాణ శాసన సభ పీవీ కి భారత రత్న ఇవ్వాలని కోరుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశ పెట్టిన తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపింది. అలాగే, ఈ సంవత్సరం జూన్’ లో ముఖ్యమంత్రి మరో మారు కేంద్రానికి లేఖ రాశారు. ఇప్పటికే ఆలస్యమైంది .. . అసలు కానిదానికంటే, ఎప్పుడో అప్పుడు రావడం కూడా కొంతవరకు మేలే .. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా భారత రత్నకు అర్హులైన పీవీ,ఎన్టీఅర్ వంటి భరత మాత ముద్దు బిడ్డలు తెలుగు గడ్డన ఉన్నారని గుర్తించి, గౌరవిస్తుందని ఆశిద్దాం.