రెడ్డి ఎంటర్‌ప్రైజెస్ వసూళ్ల కథ ఏంటీ? రఘురామ మరో సంచలనం..
posted on Jul 9, 2021 9:22AM
ఆంధ్రప్రదేశ్ వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్మోరెడ్డిపై పోరాటం చేస్తున్న నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు మరో సంచలనానికి తెర తీశారు. ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి అక్రమాలు, వైసీపీ నేతలు దురాగాతాలపై లేఖలు రాస్తూ జగన్ రెడ్డిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న రఘురామ.. తాజాగా మరో బాంబా పేల్చారు. రెడ్డి ఎంటర్‌ప్రైజెస్ వసూళ్లను ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రికి లేఖ రాశారు. వసూళ్ల పర్వానికి సంబంధించి అంశాలను ప్రస్తావిస్తూ.. ఆ కథేంటో తేల్చాలని డిమాండ్ చేశారు.
ఏపీబెవరేజెస్ సంస్థ సిబ్బంది, రెడ్డి ఎంటర్‌ప్రైజెస్ వసూళ్లను ప్రస్తావిస్తూ ఏపీ సీఎం జగన్ మోహన్‌రెడ్డికి ఎంపీ రఘురామకృష్ణంరాజు లేఖ రాశారు. రాష్ట్రానికి 25 వేల కోట్ల ఆదాయాన్నిచ్చే ఏపీబెవరేజెస్ సంస్థ ఉద్యోగులు..వారి సమస్యలను తమ దృష్టికి తేవాలని ప్రయత్నించారన్నారు. తమరు అవకాశం ఇవ్వకపోవడంతో సమస్యలను తన దృష్టికి తెచ్చినట్లు చెప్పారు. 6 నెలల క్రితం రెడ్డి ఎంటర్‌ప్రైజెస్ ఏజెన్సీ రాష్ట్రంలోని మద్యం షాపుల నుంచి..5 కోట్ల రూపాయలు వసూలు చేసేందుకు పకడ్బందీ ప్లాన్ వేసిందన్నారు. 10,258 మంది ఉద్యోగులకు నెల జీతం చెల్లించాలంటూ మద్యం షాపుల నుంచి ఈ మొత్తం డిమాండ్ చేశారని తెలిపారు ఎంపీ రఘురామ రాజు.
రెడ్డి ఎంటర్ ప్రైజెస్ మరో 10.25 కోట్ల వసూలుకు మరో ప్లాన్ వేసిందని...ఈ సంస్థ వివరాలన్నీ తమరు పరిశీలించాలని ముఖ్యమంత్రి కోరారు నర్సాపురం ఎంపీ. ఈ సంఘటనలపై డిప్యూటీ సీఎంకు ఫిర్యాదు చేసినా విచారణ జరగలేదన్నారు. ఈ ఘటనలపై వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని రఘురామ లేఖలో పేర్కొన్నారు. ఇటీవలే ఎక్సైజ్ శాఖకు సంబంధించి పలు ప్రాంతాల్లో అవినీతి జరిగినట్లు బయటకి వచ్చింది. ప్రభుత్వ ఖజానాకు జమ చేయాల్సిన డబ్బులను కొందరు సిబ్బందే అక్రమంగా కాజేశారనే తేలింది. ఈ ఘటనలపై దర్యాప్తు కూడా జరుగుతోంది. ఆ నేపథ్యంలో తాజాగా ఎంపీ రఘురామ రాజు చేసిన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. అసలు ఏపీబెవరేజెస్ సంస్థలో ఏం జరుగుతోంది, రెడ్డి ఎంటర్‌ప్రైజెస్ వసూళ్లపై సమగ్ర విచారణ జరపాలనే డిమాండ్ జనాల నుంచి వస్తోంది.
రెడ్డి ఎంటర్‌ప్రైజెస్ వసూళ్లపై ముఖ్యమంత్రికి ఎంపీ రఘురామ రాజు రాసిన లేఖ ఇది..
ముఖ్యమంత్రి గారూ,
తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెవ్వరు?
ప్రభువెక్కిన పల్లకి కాదోయ్ అది మోసిన బోయీలెవ్వరు?
– శ్రీ శ్రీ
రాష్ట్రానికి 25 వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని ఇచ్చే అతి ముఖ్యమైన సంస్థ ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్. ఇంత ముఖ్యమైన కార్పొరేషన్ కు చెందిన సేల్స్ పర్సన్లు, సూపర్ వైజర్లు తాము ఎదుర్కొంటున్న సమస్యలను మీ దృష్టికి తీసుకురావాలని శతవిధాలా ప్రయత్నించారు. అయితే మీరు వారికి అవకాశం ఇవ్వలేదు. దాంతో ఏఐటియుసి అనుబంధ సంస్థ అయిన ఏపి బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ కాంట్రాక్ట్ అండ్ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ వారు తమ సమస్యలను నా దృష్టికి తీసుకువచ్చారు. ఈ లేఖ ద్వారా వారి సమస్యలను మీ దృష్టికి తీసుకురావాలని భావిస్తున్నాను.
ఆరు నెలల కిందట రెడ్డి ఎంటర్ ప్రైజెస్ అనే అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ రాష్ట్రంలోని మద్యం షాపుల నుంచి 5 కోట్ల రూపాయలు వసూలు చేసేందుకు పకడ్బంది ప్లాన్ వేసింది. తమకు ఉన్న 10,258 మంది ఉద్యోగులకు నెల రోజుల జీతం చెల్లించాలని చెబుతూ రాష్ట్రంలోని మద్యం షాపుల వారి నుంచి ఈ మొత్తం డిమాండ్ చేశారు. మద్యం షాపులకు తదుపరి లైసెన్సులు రెన్యూవల్ కావాలీ అంటే ఈ మొత్తం తమకు చెల్లించాల్సిందేనని వారు వత్తిడి తెచ్చారు. దాంతో కొందరు ఫిర్యాదు చేయగా సంబంధిత మంత్రి, ఉపముఖ్యమంత్రి ఈ సంఘటనపై విచారణకు ఆదేశించారు. తమ ప్రభుత్వం అవినీతిని ఎట్టి పరిస్థితుల్లో సహించదని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. రెండు రోజుల్లో దర్యాప్తు నివేదిక తనకు అందాలని ఆదేశాలిచ్చారు.
అదే సమయంలో రెడ్డి ఎంటర్ ప్రైజెస్ మరో 10.25 కోట్ల రూపాయలు వసూలు చేసేందుకు మరో పకడ్బంది ప్లాన్ వేసింది. తన వద్ద పని చేస్తున్న సిబ్బందికి గుర్తింపు కార్డులు ఇచ్చేందుకు, వారిని ఈఎస్ఐ జాబితాలో చేర్చేందుకు ఒక్కొక్కరూ 10 వేల రూపాయలు తమకు చెల్లించాలని రెడ్డి ఎంటర్ ప్రైజెస్ కోరింది. ఇలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ మద్యం షాపుల్లో పని చేస్తున్న 10,258 మంది సూపర్ వైజర్ల నుంచి, సేల్స్ మెన్ ల నుంచి డబ్బులు వసూలు చేసేందుకు రెడ్డి ఎంటర్ ప్రైజెస్ స్కెచ్ వేసింది. ఇలా చేయని ఉద్యోగులకు ఈ నెల జీతాలు రావని బెదిరించింది. చట్టపరంగా చెల్లించాల్సిన ప్రావిడెంట్ ఫండ్, ఈఎస్ఐ లను సకాలంలో చెల్లించకుండా ఈ సంస్థ, న్యాయపరమైన చిక్కుల్లో పడుతున్న విషయాన్ని గుర్తించడం లేదు. ఆరు నెలల కిందట ఫిర్యాదు ఇచ్చినప్పుడు వసూళ్ల కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేసిన ఈ సంస్థ, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో మళ్లీ కలెక్షన్లు ప్రారంభిస్తున్నది.
సికింద్రాబాద్ లోని దక్షిణ మధ్య రైల్వేలో సీనియర్ డిసిఎం గా పని చేస్తున్న ఐఆర్ టి ఎస్ అధికారి అయిన డి.వాసుదేవరెడ్డిని డెప్యుటేషన్ పై తీసుకువచ్చి మీరు ఏపి బెవరేజెస్ కార్పొరేషన్ కు మేనేజింగ్ డైరెక్టర్ గా నియమించారు. ఇలా చట్ట విరుద్ధ కలెక్షన్లు జరుగుతున్నా కూడా ఆయన నోరు మెదపడం లేదు… ఎవరిపైనా చర్యలు తీసుకోవడం లేదు.సూటిగా చెప్పాలంటే ఈ రెడ్డి ఎంటర్ ప్రైజెస్ కు ఔట్ సోర్సింగ్ కార్యకలాపాలలో ఎలాంటి గత అనుభవం లేదు. ఈ మద్యం షాపు ఉద్యోగులతో కూడా ఆ సంస్థకు ఎలాంటి సంబంధం కూడా లేదు. ఈ మద్యం షాపు ఉద్యోగులను జిల్లా కలెక్టర్లు నేరుగా బెవరేజెస్ కార్పొరేషన్ కోసం నియమించారు. ఇలా జిల్లా కలెక్టర్లు బెవరేజెస్ కార్పొరేషన్ కోసం నియమించిన ఉద్యోగులను తమ ఉద్యోగులుగా ఈ సంస్థ తన వెబ్ సైట్ లో చూపిస్తున్నది. అంతే కాదు ఈ సంస్థ ఈ ఒక్క కాంట్రాక్టునే చూపిస్తున్నది తప్ప గతంలో తాను నిర్వహించిన కాంట్రాక్టులను చెప్పడం లేదు. అంటే ఈ సంస్థకు ఎలాంటి పూర్వ అనుభవం కూడా లేదన్నమాట. బెవరేజెస్ కార్పొరేషన్ కోసం నియమితులైన సిబ్బందికి జీతభత్యాలు చెల్లించాలన్న విషయం ముందుకు రాగానే ఈ రెడ్డి ఎంటర్ ప్రైజెస్ తెరపైకి వచ్చింది. దాదాపు 10 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చినట్లు చెప్పుకుంటున్న ఇంత ‘‘పెద్ద’’ సంస్థ గురించి ప్రజలకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి మీరు కూడా ఒక్క సారి ఈ వివరాలన్నీ పరిశీలించండి.
దాదాపుగా రెండు సంవత్సరాలు కావస్తున్నా ఈ ఉద్యోగులకు గుర్తింపు కార్డులు ఇవ్వలేదు. అంతే కాదు వీరికి ఈఎస్ఐ కూడా అమలు చేయడం లేదు. ఈ ఆందోళనలతో బాటు వారిని మరో భయం కూడా వెంటాడుతున్నది. ఒక్కో ఉద్యోగి మూడు లక్షల రూపాయల సెక్యూరిటీ ఇవ్వాలని, అందుకోసం ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులను పూచీకత్తుగా తీసుకురావాలని కోరుతున్నారు. వారు ఇప్పటికే APBCL కు రెండు లక్షల రూపాయల పూచీకత్తులను సమర్పించి ఉన్నారు.సాక్షాత్తూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసినా ఈ సంఘటనలపై ఎలాంటి విచారణ జరగలేదు. APBCL అధికారుల నుంచి సైతం ఎలాంటి స్పందన లేదు. దాంతో సుమారు 10 వేల మందికి పైగా ఉన్న సిబ్బంది, వారిపై ఆధారపడి ఉన్న మరో 50 వేల మంది కుటుంబ సభ్యులు తీవ్రమైన ఆందోళనలో ఉన్నందున, వారిని దృష్టిలో ఉంచుకుని తక్షణమే విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా నేను ఈ లేఖ ద్వారా మిమ్మల్ని కోరుతున్నాను. చట్టబద్ధంగా ఇవ్వాల్సిన ఈఎస్ఐ సౌకర్యాన్ని, ప్రావిడెంట్ ఫండ్ ను కూడా ఈ సంస్థ అమలు చేసే విధంగా తక్షణ చర్యలు తీసుకోవాలని నేను మిమ్మల్ని వినమ్రంగా కోరుతున్నాను. కార్మిక చట్టాల ప్రకారం వారికి పని గంటలను కూడా నిర్దేశిస్తే మరింత మంచిది. ఇప్పుడు కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ. ఈ సమయంలో ఈ సిబ్బందిని ఈఎస్ఐ ఆసుపత్రుల నెట్ వర్క్ పరిధిలోకి తీసుకువచ్చి వారికి వైద్య సౌకర్యం కల్పించాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. దురదృష్టవశాత్తూ కరోనాకు గురి అయి ఏ ఉద్యోగి అయినా మరణిస్తే కారుణ్య నియామకాల కింద మరణించిన ఉద్యోగి కుటుంబంలో ఒకరికి ఆ ఉద్యోగం ఇప్పించాలని కూడా నేను కోరుతున్నాను.
భవదీయుడు
కె.రఘురామకృష్ణంరాజు