జల వివాదంపై జగన్ షాకింగ్ కామెంట్స్..
posted on Jul 8, 2021 @ 3:58PM
తెలుగు రాష్ట్రాల మధ్య సాగుతున్న జల వివాదంపై ఏపీ సీఎం జగన్ స్పందించారు. కృష్ణాలో తమకు కేటాయించిన నీళ్లను వాడుకుంటే తప్పేంటన్నారు. నీటి కేటాయింపులపై సంతకాలు కూడా చేశారని గుర్తు చేశారు. 881 అడుగులు చేరితే తప్ప పోతిరెడ్డిపాడు నుంచి రాయలసీమకు నీళ్లు రావని, శ్రీశైలంలో 885 అడుగుల మేర నీరు ఎన్నిరోజులు ఉందన్నారు. నీటి విషయంలో రాజకీయాలు చేయడం సరికాదని, కర్ణాటక, తమిళనాడు రాజకీయాల్లో నేనెప్పుడూ వేలు పెట్టలేదన్నారు. రాష్ట్రాల మధ్య సఖ్యత ఉండాలన్నదే తన అభిమతమన్నారు. పాలకుల మధ్య కూడా సఖ్యత ఉండాలని కోరుకుంటున్నానని సీఎ జగన్ అన్నారు. కాని తెలంగాణ నేతలు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని అన్నారు.
అనంతపురం జిల్లా రాయదుర్గం సభలో మాట్లాడిన జగన్.. కృష్ణా నీటి వివాదంపై ప్రతిపక్షనేత చంద్రబాబును ఉద్దేశించి తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు గాడిదలు కాశారా? అని ప్రశ్నించారు. తెలంగాణతో జల వివాదాలు అందరికీ తెలిసిన విషయమేనని, అయితే టీడీపీ అధినేత చంద్రబాబు ఓ నాలుగైదు రోజులు ఈ అంశంపై మౌనంగా ఉండి, ఇప్పుడిప్పుడే దీనిపై మాట్లాడుతున్నాడని అన్నారు. ఈ సందర్భంగా తాను చంద్రబాబుకు, ఇష్టంవచ్చినట్టుగా మాట్లాడుతున్న తెలంగాణ మంత్రులకు కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నానంటూ కొన్ని విషయాలు చెప్పారు జగన్.
"దశాబ్దాల తరబడి ఆంధ్ర రాష్ట్రం కలిసి ఉంది. రాయలసీమ, కోస్తాంధ్ర, తెలంగాణ... ఈ మూడూ కలిసిందే ఆంధ్ర రాష్ట్రం. కృష్ణా నదీ జలాలు కోస్తాంధ్రకు ఎంత, తెలంగాణకు ఎంత, రాయలసీమకు ఎంత అనే విభజన ప్రకారమే మొదటి నుంచి కేటాయింపులు జరుగుతూ వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలుగా విడిపోయాక 2015 జూన్ 19వ తేదీన రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కేంద్రం కూడా ఈ నీటి కేటాయింపులపై సంతకాలు చేసింది. ఏపీ, తెలంగాణ, కేంద్రం... ఈ మూడూ సంతకాలు చేసిన ప్రకారం... రాయలసీమకు 144 టీఎంసీలు, కోస్తాకు 367టీఎంసీలు, తెలంగాణకు 298 టీఎంసీలు.
పోతిరెడ్డిపాడు నుంచి రాయలసీమకు నీళ్లు పోవాలంటే నీటిమట్టం 881 అడుగులు చేరాలి. శ్రీశైలం డ్యామ్ పూర్తి సామర్థ్యం 885 అడుగులు. గత రెండేళ్లు వర్షాలు బాగా పడ్డాయి. ఆ రెండేళ్లను వదిలేస్తే, అంతకుముందు 20 ఏళ్లుగా శ్రీశైలం డ్యామ్ లో 881 అడుగుల పైచిలుకు నీటిమట్టం ఎన్నిరోజులు ఉందన్న విషయం పరిశీలిస్తే, 20-25 రోజులు మాత్రమే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో పోతిరెడ్డిపాడు నుంచి పూర్తి సామర్థ్యం మేరకు నీటిని విడుదల చేసే అవకాశం లేదు. అటు తెలంగాణలో మాత్రం పాలమూరు-రంగారెడ్డి, డిండి, కల్వకుర్తి సామర్థ్యం పెంచి వాడుకుంటున్నారు. వాటన్నింటి నుంచి 800 అడుగుల లోపే నీటిని తీసుకునే వెసులుబాటు ఉంది. 796 అడుగుల్లోపే తెలంగాణకు విద్యుదుత్పాదన చేసే సౌకర్యం ఉంది. 800 అడుగుల లోపే తెలంగాణ నీటిని వాడుకున్నప్పుడు.. ఏపీలో రాయలసీమ ప్రాజెక్టుకు లిఫ్ట్ ఏర్పాటు చేస్తే తప్పేంటి అని జగన్ అన్నారు.