అభివృద్ధి అంటే ఇది.. జగనన్నను చూసి తెలుసుకోండి!
posted on Jul 9, 2021 @ 10:07AM
అభివృద్ధి అంటే ఏంటో తెలుసుకోండి. అభివృద్ధి అంటే మౌలిక సదుపాయాలు కల్పించడం అని అనుకోకండి. అభివృద్ధి అంటే ఏవేవో కంపెనీలు వచ్చి పెట్టుబడులు పెట్టడం కాదు ..సరిగా తెలుసుకోండి. అభివృద్ధి అంటే రాష్ట్రానికి ఆదాయం పెంచేలా చర్యలు తీసుకోవడం కాదు.. అర్ధం చేసుకోండి. ఇప్పటివరకు పాపం చాలామంది నేతలు, ప్రముఖులు, ఆర్ధిక నిపుణులు రకరకాలుగా అనుకుంటున్నారు. వారందరూ ఒకసారి ఏపీ వస్తే అసలు అభివృద్ధి అంటే ఏంటో తెలిసిపోతుంది. వారు రాసిన పుస్తకాలను తగలబెట్టేసి కొత్త పుస్తకాలు రాయొచ్చు. పాపం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది విని అసలు అభివృద్ధి అంటే ఏంటో తెలుసుకోండి.
బాస్..రైతు దినోత్సవంలో మాట్లాడుతూ గిట్టనివాళ్లు ఏదో చెబుతూ ఉంటారు.. ఒక్కసారి గ్రామాలకు వెళ్లి చూడండి (పట్టణాల సంగతి అడక్కండే) అభివృద్ధి ఏంటో కనపడుతుంది. నాలుగడుగులు వేస్తే ప్రభుత్వ పాఠశాల కనపడుతుంది.. అక్కడ ప్రైవేటు పాఠశాల కన్నాబెటర్ గా ఇంగ్లీషు మీడియంలో పాఠాలు చెబుతుంటారు.. ఇంకో నాలుగడుగులు వేస్తే విలేజ్ క్లినిక్ ఉంటుంది..అక్కడ వైద్య సిబ్బంది అన్ని రకాల మందులతో ఉంటారు. అన్నిటికి రిపేర్లుచేసి కొత్త రంగులు కూడా వేశాం. ఇలా చెప్పుకుంటూ పోయారు జగన్మోహన్ రెడ్డి. అదీ అభివృద్ధి అంటూ ముగించారు.
అంటే మనం అర్ధం చేసుకోవలసింది ఏంటంటే పాత భవనాలకు రిపేర్లు చేసి రంగులు వేస్తే చాలు.. అభివృద్ధి జరిగినట్లే. అంగన్ వాడీ సెంటర్లను చంద్రబాబునాయుడు టైములోనే డెవలప్ చేశారు. వాటికి ప్రీ ప్రైమరీ స్కూల్స్ అని పేరు మారిస్తే చాలు అభివృద్ధి జరిగినట్లే.. అలాగే టించర్, టీటీ వేయడానికి నర్సు ఉంటే చాలు అభివృద్ధి జరిగినట్లే.. అదీ సంగతి. స్కూళ్లు, ఆస్పత్రులు రిపేర్లు చేయడంలో తప్పు లేదు.. వాటిని మెరుగుపర్చడంలో తప్పే లేదు.. కాని అదే అభివృద్ధి అని చెప్పుకోవడమే మరీ ఎబ్బెట్టుగా ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి అంత గర్వంగా వాటి గురించి చెప్పుకుని అదే అభివృద్ధి అని చెప్పుకోవడమే ఇప్పుడు హాస్యాస్పదంగా మారింది.
ఇప్పటివరకు అందరూ పాపం ఇన్ ఫ్రా అభివృద్ధి చేస్తే పెట్టుబడులు వస్తాయని..తద్వారా ఉద్యోగాలు వస్తాయని..దాని వల్ల ప్రజల్లో కొనుగోలు శక్తి పెరుగుతుందని.. దాని వల్ల మార్కెట్ పెరుగుతుందని.. దాని వల్ల ప్రభుత్వ ఆదాయం పెరుగుతుందని.. దాని వల్ల ప్రజలకు మెరుగైనసేవలు అందించొచ్చని .. అదే అభివృద్ధి అనుకునేవారు.ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ చక్రాన్ని విరగ్గొట్టేశారు. ప్రజలకు బ్యాంకుల్లో డబ్బులు వేస్తే చాలు.. రిపేర్లు చేసి రంగులు వేస్తే చాలు.. అప్పులు చేసి డబ్బులు తెస్తే చాలు... ఇవే అభివృద్ధి అనుకోవాలని చెబుతున్నారు.. కాదని చెప్పేవాళ్లు గిట్టనివాళ్లు అంటున్నారు.
ఇంకా నయం... తెలుగుదేశం మీద, చంద్రబాబునాయుడిపైన పగతో అమరావతిని నాశనం చేయడం.. మూడు రాజధానుల పేరుతో కుంపటి పెట్టి అన్ని చోట్ల అనిశ్చితి వచ్చేలా చేయటం..రియల్ఎస్టేట్ వ్యాపారాన్ని పడేయటం.. ఇసుక పాలసీ పేరుతో భవన నిర్మాణ రంగాన్ని కూల్చేయటం.. రివర్స్ టెండరింగ్ పేరుతో ప్రాజెక్టుల పనులు లేటు చేయడం ..ఇవన్నీ కూడా అభివృద్ధిలో భాగమే అని చెప్పలేదు. పాపం మర్చిపోయారేమో ఈ విషయాలు చెప్పడం.. మనం మాత్రం బాస్ దగ్గర కొత్త ఆర్ధిక పాఠాలు నేర్చేసుకోవడం బెటర్..లేదంటే మనకు ఏదో ఒక పేరు పెట్టేస్తారు సార్.