జగనన్న అంటే అంత అలర్జీనా! జల జగడంపై క్లారిటీ ఇచ్చిన షర్మిలక్క..
posted on Jul 8, 2021 @ 7:32PM
షర్మిల పార్టీ ఆవిర్భావం అనగానే.. రెండు రాష్ట్రాల జల వివాదంపై ఆ పార్టీ వైఖరి ఏంటనే ఆసక్తి నెలకొంది. ఏపీ, తెలంగాణల మధ్య ప్రస్తుతం నెలకొన్న జలజగడంపై షర్మిల ఏమంటారనే ఇంట్రెస్ట్ పెరిగింది. వైఎస్సార్‌టీపీని ప్రారంభిస్తూ.. షర్మిల మాట్లాడటం స్టార్ట్ చేశాక.. మిగతా విషయాలకంటే కూడా వాటర్ ఎపిసోడ్‌లో ఆమె స్పందనపైనే అంతా ఫోకస్ పెట్టారు. కొన్ని రోజులుగా ఇరు రాష్ట్రాల వాటర్ వార్‌లో ఆమె వ్యూహాత్మక మౌనం పాటిస్తూ వచ్చినా.. ఎట్టకేళకు ఆమె మౌనం వీడక తప్పలేదు. కృష్ణా, గోదావరి జలాలు, ప్రాజెక్టులపై వైఎస్సార్‌టీపీ అనుసరించబోయే వైఖరిని షర్మిల తేటతెల్లం చేశారు.
ఏపీ సీఎం జగన్ స్వయానా షర్మిలకు అన్న కావడంతో.. ఆమె రియాక్షన్ ఎలా ఉంటుందోనని అంతా అటెన్షన్‌గా ఆమె స్పీచ్ విన్నారు. ఆ టాపిక్ రాగానే అలర్ట్ అయ్యారు. ఏపీని విమర్శిస్తుందా? జగనన్నను తప్పుబడుతుందా? కేసీఆర్‌పైన ఎలాగూ అటాక్ చేస్తారని తెలిసిందే కానీ, ఏపీ, జగన్‌ల వైఖరిపై షర్మిల కౌంటర్ ఎలా ఉండనుందోననే ఆసక్తి పెరిగింది. అంతలా ఉత్కంఠ నెలకొన్న నీటి విషయంలో ఏం మాట్లాడాలి అనే దానిపై షర్మిల బాగానే కసరత్తు చేసి వచ్చినట్టుంది. తానెక్కడా బుక్ కాకుండా.. తనపై ఎలాంటి విమర్శలు రాకుండా.. చాలా వ్యూహాత్మకంగా.. ఎలాంటి స్టాండ్ తీసుకోకుండా.. తన స్టాండ్ ఇదంటూ మాటల గారడీ చేశారని అంటున్నారు. స్పష్టంగా ఇదీఅదీ అని చెప్పకుండా.. అసలే మాత్రం స్పష్టత లేకుండా.. సమన్యాయం జరగాలంటూ సూక్తులు మాత్రం చెప్పారు.
ఎక్కడా జగనన్న పేరు కూడా ప్రస్తావించలేదు. బహుషా ఆయన పేరు పలకడమూ ఆమెకు ఇష్టం లేదేమో. అందుకే, పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి అంటూ సంబోధించడం ఆసక్తికర పరిణామం. ఇద్దరు ముఖ్యమంత్రులు కౌగిలించుకుంటారు.. కలిసి భోజనం చేస్తారు.. కలిసి ఉమ్మడి శత్రువును ఓడిస్తారు.. అలాంటిది.. నీటి సమస్యపై కనీసం రెండు నిమిషాలు కలిసి మాట్లాడుకోలేరా? అంటూ ప్రశ్నించారు షర్మిల. ప్రస్తుత జలవివాదంలో కేంద్ర ప్రభుత్వానిదీ తప్పు ఉందని.. ఉదాసీనంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు జల వివాదాలను పరిష్కరించుకోడానికి ఎలాంటి ప్రయత్నమూ చేయకపోతే వారి చిత్తశుద్ధిని ఎలా నమ్మాలంటూ నిలదీశారు. అది వారి చేతగాని తనమని అనుకోవాలా? అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.
జల వివాదాలపై వైఎస్సార్‌టీపీ వైఖరి ఏంటో ప్రకటించారు షర్మిల. తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన ఒక్క చుక్క నీటిబొట్టూ వదులుకోం.. పక్క రాష్ట్రాలకు చెందాల్సిన ఒక్క చుక్క నీటిబొట్టూ అడ్డుకోబోం.. నీటి విషయంలో రెండు రాష్ట్రాలకు సమన్యాయం జరగాలని కోరుకుంటున్నాం.. అంటూ కర్ర విరగకుండా.. పాము చావకుండా.. చాకచక్యంగా తప్పించుకున్నారు షర్మిల.
జల వివాదంపై షర్మిల ఇచ్చిన క్లారిటీ కంటే కూడా.. ఆ సందర్భంగా ఆమె నోటి నుంచి జగన్ పేరు రాకుండా చాలా జాగ్రత్తగా మాట్లాడటం చూస్తుంటే.. రెండు రకాల అనుమానాలు కలుగుతున్నాయి. షర్మిల కూడా జగన్ మనిషేనని.. అందుకే అన్నను ఇరికించడం, అన్నపై విమర్శలు చేయడం ఇష్టం లేకే ఆయన పేరు ప్రస్తావించలేదని అంటున్నారు. ఇక మరో యాంగిల్.. జగన్‌తో షర్మిలకు పూర్తి స్థాయిలో తేడాలొచ్చాయని.. అందుకే తన నోటి నుంచి జగన్ పేరు పలకడానికి సైతం ఆమె ఇష్టపడలేదని అంటున్నారు. ఈ రెండు వర్షన్‌లలో ఏది కరెక్టో వారిద్దరికే తెలియాలి. అయితే, నీళ్ల లొల్లిపై వైఎస్సార్‌టీపీ వైఖరిలో ఎలాంటి స్పష్టత లేదని.. వదులుకోం.. అడ్డుకోం.. అంటూ క్లారిటీ లేని కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారని అంటున్నారు తెలంగాణవాదులు.