బీజేపీకి రేవంత్ తొలి పంజా! కాంగ్రెస్ గూటికి ఖమ్మం నేతలు..
posted on Jul 8, 2021 @ 6:58PM
పీసీసీ చీఫ్ గా ఎంపీ రేవంత్ రెడ్డి నియామకంతో కాంగ్రెస్ లో ఫుల్ జోష్ కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ కేడర్ లో కదలిక వచ్చింది. ఇంతకాలం స్తబ్ధుగా ఉన్న నేతలు కూడా యాక్టివ్ అయ్యారు. రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న వెంటనే కార్యాచరణ మొదలు పెట్టారు. గాంధీభవన్ లో వరుస సమావేశాలు నిర్వహించారు. భవిష్యత్ గమనంపై చర్చించారు. దశల వారీగా ప్రజా సమస్యలపై చర్చించాలని నిర్ణయించారు. రేవంత్ రెడ్డి రాకతో గాంధీభవన్ కూడా చాలా కాలం తర్వాత కళకళలాడుతోందని చెబుతున్నారు.
పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి నియామకంతో పార్టీకి బూస్ట్ రావడమే కాదు వలసలు కూడా మొదలయ్యాయి. రేవంత్ రెడ్డి తొలి పంజా బీజేపీపై పడింది. ఖమ్మం జిల్లాకు చెందిన కమలం నేతలు రేవంత్ రెడ్డి సమక్షంలో గాంధీభవన్ లో కాంగ్రెస్ గూటికి చేరారు. సత్తుపల్లికి చెందిన బిజెపి నేతలు కిష్టారం మాజీ సొసైటీ ఛైర్మన్ రావి నాగేశ్వరరావు, కిష్టారం మాజీ సర్పంచ్ ప్రత్తిపాటి భిక్షపతి, యువజన నేత పుచ్చకాయల లక్ష్మారెడ్డి లు బిజెపి పార్టీ నుండి కాంగ్రెస్ లో చేరారు. టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి కండవాలు కప్పి వారిని కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు.రేవంత్ రెడ్డిపై నమ్మకంతో పార్టీలో చేరుతున్నట్లు సత్తుపల్లి నేతలు చెప్పారు. రేవంత్ రెడ్డికి ప్రధాన అనుచరుడిగా ఉన్న మానవతరాయ్ నేతృత్వంలోనే ఈ చేరికలు జరిగాయి.
ఇతర పార్టీల్లో చేరిన కాంగ్రెస్ నేతలంతా సొంత గూటికి చేరాలని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి పిలుపిచ్చారు. తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేయబోతున్నామని చెప్పారు. త్వరలోనే నిరుద్యోగుల సమస్యలపై పాదయాత్ర చేయాలని కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు. త్వరలోనే మరికొందరు నేతలు కాంగ్రెస్ లో చేరనున్నారని తెలుస్తోంది. అన్ని జిల్లాల నుంచి వలసలు ఉంటాయని అంటున్నారు. కాంగ్రెస్ నుంచి ఇతర పార్టీల్లో చేరిన చాలా మంది నేతలు రేవంత్ రెడ్డితో టచ్ లోకి వచ్చారని చెబుతున్నారు. టీడీపీలో రేవంత్ తో కలిసి పని చేసిన ప్రస్తుతం వివిధ పార్టీల్లో ఉన్న నేతలు కూడా హస్తం గూటికి వస్తారని అంటున్నారు.