జగన్, షర్మిల గజ దొంగలా? విజయమ్మ భావోద్వేగం..
posted on Jul 8, 2021 @ 6:58PM
తెలంగాణలో కొత్త పార్టీ ప్రారంభించింది వైఎస్ షర్మిల. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ జయంతి సందర్భంగా పార్టీ పేరును అధికారికంగా ప్రకటించింది. వైఎస్సార్ టీపీ లోగోతో పాటు జెండాను ఆవిష్కరించింది. షర్మిల పార్టీ ఆవిర్భావ వేడుకను జూబ్లీహిల్స్ లోని కన్వెషన్ హాల్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వైఎస్ విజయమ్మ భావోద్వేగ ప్రసంగం చేశారు. తన బిడ్డను ఖమ్మంలోనే తెలంగాణ ప్రజలకు అప్పగించానని చెప్పారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు షర్మిలపై ఎన్నో విమర్శలు చేశారన్నారు. షర్మిల పార్టీ పెడితే అధికార పార్టీ నేతలు, ఇతర పార్టీల నాయకులు ఎందుకు తమ వైఖరిని, తమ వ్యూహాలను మార్చుకున్నారో సమాధానం చెప్పాలని విజయమ్మ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ వైఎస్సార్ ను తమ సొత్తు అని భావిస్తున్నారని, ఇన్ని రోజులు ఎందుకు పట్టించుకోలేదో సమాధానం చెప్పాలన్నారు. వైఎస్సార్ పై ఎఫ్ఐఆర్ పెట్టిన కాంగ్రెస్.. ఇప్పుడు ఆయన జపం విజయమ్మ చేస్తోందని విమర్శలు చేశారు.
ప్రజల సమస్యలు పరిష్కరించే వాడే అసలైన నాయకుడని, అన్ని వర్గాలకు దగ్గరైన నేత వైఎస్సార్ అని విజయమ్మ గుర్తు చేశారు. వైఎస్ సీఎం అయ్యాక తెలంగాణ ప్రాంతానికి సంక్షేమంలో, అభివృద్ధిలో, జలయజ్ఞం వంటి పథకాలతో పెద్ద పీట వేశారన్నారు. ఆయన హఠాన్మరణంతో ఎంతో మంది తెలంగాణ ప్రజలు చనిపోయారని, తెలంగాణ సశ్యశ్యామలం కావాలనేది ఆయన సంకల్పమని, వైఎస్సార్ మరణంతో ఆయన కల అసంపూర్ణంగా మిగిలిపోయిందన్నారు. ఆయన రక్తాన్ని పుణికి పుచ్చుకున్నది జగన్, షర్మిల లని, వారు నేడు వేర్వేరు రాష్ట్రాలకు ప్రతినిధులుగా పనిచేస్తున్నారన్నారు. జగనన్న బాణంగా 3 వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి రికార్డు సృష్టించిందన్నారు. ఎండ, వాన, చలి ఆమె పాదయాత్ర ఆపలేకపోయాయని చెప్పారు. ఆమెలో ఉన్న సంకల్పం, చిత్తశుద్ధి.. ఆమెను నడిపించిందనన్నారు విజయమ్మ.
తెలంగాణ షర్మిల మెట్టినిల్లు అన్న విజయమ్మ.. ప్రజల మంచి కోసమే పార్టీ పెట్టిందన్నారు. తన తండ్రి కలలను నెరవేర్చడం కోసమే రాజకీయాల్లోకి వచ్చిందని తెలిపారు. తెలంగాణ బిడ్డలకు బంగారు భవిష్యత్తు కోసం షర్మిల ముందుకు వస్తోందన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు మనవే.. రాష్ట్రాల మధ్య వనరుల విషయంలో వివాదాలు రావొచ్చు కానీ పరిష్కార మార్గాలున్నాయన్నారు. వైఎస్సార్ కానీ, ఆయన బిడ్డలు కానీ, దొంగలు, గజదొంగలు కాదన్నారు విజయమ్మ. తమ కుటుంబానికి దాచుకోవడం, దోచుకోవడం తెలియదు.. అభివృద్ధి పంచడం మాత్రమే తెలుసునన్నారు.