రూ.41 వేల కోట్ల తప్పుడు లెక్కలు.. అంతా జగన్మాయ!
posted on Jul 9, 2021 9:22AM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది. ఉద్యోగులకు వేతనాలు ఇవ్వడానికి కూడా అప్పు తేవాల్సిన పరిస్థితి. ప్రతి నెలా పెన్షనర్లకు ఎప్పుడు తమ డబ్బులు వస్తాయో తెలియని గందరగోళ పరిస్థితి. అప్పుల్లో దేశంలోనే మూడో స్థానంలో ఉంది ఏపీ. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చూసి కేంద్ర ఆర్థికశాఖ వర్గాలే అవాక్కవుతున్నాయంటే ఎంతగా దివాళ తీసిందో అర్థం చేసుకోవచ్చు. ఏపీ ఇంతగా అప్పుల్లో కూరుకుపోవడానికి జగన్ రెడ్డి సర్కార్ అస్తవ్యస్థ, అనాలోచిత విధానాలే కారణమనే ఆరోపణలు వస్తుండగా.. తాజాగా మరో సంచలన విషయం వెలుగు చూసింది. ఏకంగా 41 వేల కోట్ల రూపాయలకు లెక్కలే లేవని తెలుస్తోంది.
రాష్ట్రప్రభుత్వం జమ ఖర్చుల నిర్వహణపై సంచలన ఆరోపణలు చేశారు పిఏసి చైర్మన్ పయ్యావుల కేశవ్. జమఖర్చుల నిర్వహణపై గవర్నర్ కలిసి పిర్యాదు చేశారు. నలభైవేల కోట్లకు సరియైన లెక్కలు లేవని పయ్యావుల ఆరోపించారు. ట్రెజరీ కోడ్ ప్రకారం ప్రభుత్వం లోని ఏ శాఖ అయినా ట్రెజరీ నుండి డబ్బు తీసుకునేటప్పుడు అది ఎందుకు తీసుకుంటున్నామో, దేనికి ఖర్చు పెడుతున్నామో బిల్లులో పేర్కొనాలి. కానీ అలాంటిదేమీ చూపించకుండా జగన్ రెడ్డి ప్రభుత్వంలోని వివిధ శాఖలు ప్రత్యేక బిల్లు అంటూ 10,806 బిల్లుల కింద రూ.41,043 కోట్లను విత్ డ్రా చేశాయి. ఈ బాగోతాన్ని పక్కా ఆధారాలతో పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ బయటపెట్టారు.
ఏడాది క్రితమే ఇది తప్పని ప్రభుత్వాన్ని హెచ్చరించారు పయ్యావుల కేశవ్. అయినా ప్రభుత్వ తీరు మారకపోవడంతో... రాష్ట్రప్రభుత్వ ఆర్ధిక నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందని, ఆర్ధిక అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలిసి ఫిర్యాదు చేసారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 161, 151/2 లను ప్రస్తావిస్తూ... రాష్ట్రప్రభుత్వ కార్యనిర్వాహక అధిపతిగా రాష్ట్ర ఆర్థిక, జమ ఖర్చుల నిర్వహణపై దృష్టి పెట్టాలని... గత రెండు ఆర్ధిక సంవత్సరాలకు సంబందించిన లెక్కలపై కాగ్ తో స్పెషల్ ఆడిట్ జరిపించాలని గవర్నర్ ను కోరారు పయ్యావుల కేశవ్. ఇదే విషయమై రాష్ట్ర ప్రభుత్వానికి కాగ్ రాసిన లేఖలను వినతి పత్రానికి జత చేసారు.
ఇప్పటికే జగన్ రెడ్డిపై అక్రమాస్తుల కేసులున్నాయి. గతంలో షెల్ కంపెనీలు, సూట్ కేసు కంపెనీలు పెట్టి, దొంగలెక్కలు చూపించి ఆస్తులను పెంచుకున్నారనే అభియోగాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి దివాళా దిశగా ఉన్నా .. జగన్ & కో లకు చెందిన కంపెనీలు ఆర్ధిక లాభాలతో దూసుకుపోతున్నాయి. సెబీ ఇచ్చిన సమాచారం మేరకు వైసీపీ ఎంపీ అయోధ్యరామిరెడ్డికి చెందిన రాంకీ సంస్థల పై ఐటీ దర్యాప్తు జరుగుతోంది. ఇదే సమయంలో ప్రభుత్వ పద్దుల్లో రూ.41 వేల కోట్ల తప్పుడు లెక్కలు ఉండటం ఎన్నో అనుమానాలకు తావిస్తోంది. ఆ రూ.41 వేల కోట్లు ఏమైనట్టు అనే చర్చ జనాల్లో సాగుతోంది. తప్పుడు లెక్కలతో పక్కాగా దర్యాప్తు చేస్తే అసలు దొంగలెవరో తేలుతుందని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.