కారెక్కనున్న ఎల్ రమణ? రేవంత్ రాకతో పొలిటికల్ హీట్..
posted on Jul 8, 2021 @ 2:18PM
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డిని నియమించడంతో కాంగ్రెస్ లో పుల్ జోష్ కనిపిస్తోంది. కొంత కాలంకా దూకుడు మీదున్న బీజేపీ కూడా వేగంగా పావులు కదుపుతోంది. ఇప్పటివరకు కేంద్ర సహాయమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి... కేబినెట్ బెర్త్ దక్కడంతో కమలనాధుల్లోనూ కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఇక ప్రత్యర్థి పార్టీలకు ధీటుగానే అధికార టీఆర్ఎస్ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. ఇతర పార్టీల్లోని కీలక నేతలు కారెక్కేలా ప్రయత్నాలు చేస్తోంది.
కేసీఆర్ ఆకర్ష్ లో భాగంగానే టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్.రమణ టీఆర్ఎస్‌లో చేరడానికి ముహుర్తం ఖారారైందని తెలుస్తోంది. రమణ గులాబీ గూటికి చేరుతారని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఖాయమైందని ఊహాగానాలు వినిపించాయి. తాజాగా గురువారం సీఎం కేసీఆర్‌తో సమావేశం రమణ కానున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌తో కలిసి ఆయన సీఎం కేసీఆర్‌ను కలవనున్నట్లు సమాచారం. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో ఇప్పటి వరకే ఓసారి మంతనాలు జరిపారు ఎల్.రమణ . ఎమ్మెల్సీ పదవి ఇప్పించే బాధ్యత తనదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హామీ ఇచ్చినట్లు సమాచారం. రాజకీయ భవిష్యత్‌ను దృష్ట్యా టీఆర్ఎస్‌లో చేరాలని ఆయన నిర్ణయించుకున్నారట.
బీసీ నాయకునిగా ఎలగందుల రమణకు గుర్తింపు ఉంది . ఈ నినాదంతోనే కరీంనగర్ పార్లమెంటు నుంచి సీనియర్ అయిన చొక్కారావును ఓడించి సంచలనం సృష్టించారు . జగిత్యాలలో జీవన్ రెడ్డిని మట్టి కరిపించి చంద్రబాబు హయాంలో రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. జగిత్యాల నియోజకవర్గంలో మంచి పట్టున్న నాయకుడు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలుగుదేశం నుంచి చాలా మంది నాయకులు బయటకు వెళ్లినా రమణ మాత్రం అలాగే ఉండిపోయారు. 2014 నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.