బీజేపీ జనసేన బంధం .. ఉన్నట్లా .. లేనట్లా ?
భారతీయ జనతా పార్టీ, ఆంధ్ర ప్రదేశ్’పై ఆశలు వదిలేసుకుందా?ఏమి చేసినా,ఎన్ని రకాలుగా వ్యుహాలు మార్చినా ఫలితం లేకపోవడంతో ఏపీని కమలదళం పక్కన పెట్టేసిందా? అందుకేనా, కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో ఇరుగుపొరుగు రాష్ట్రాలకు ఇచ్చిన కొద్దిపాటి ప్రాధాన్యత కూడా ఏపీకి ఇవ్వలేదా? అంటే,అవుననే సమాధానమే వస్తోంది.
నిజానికి, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్’లో కూడా బీజేపీకి ఆంధ్ర ప్రాంతం (ప్రస్తుత ఏపీ)లో చెప్పుకోదగ్గ బలం, బలగం ఎప్పుడూ లేదు. ఎప్పుడో ఒకటి రెండు సందర్భాలలో, ఒంటరిగా పోటీ చేసి కొంత బలాన్ని పుంజుకున్నా,అది ప్రామాణికంగా తీసుకోలేము. (1998 ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగాపోటీ చేసిన బీజేపీ 18 శాతం ఓట్లతో, కాకినాడ, రాజమండ్రి లోక్ సభ స్థానాలను గెలుచుకుంది) అయినా అదంతా గతం. గతానికి ప్రస్తుతానికి మధ్య చాలా చాలా రాజకీయ మురికి సముద్రంలో కలిసిపోయింది. చివరకు రాష్ట్రమే విడిపోయింది.
ఇక ప్రస్తుతానికి వస్తే, 2014 సార్వత్రిక ఎన్నికలలో తెలుగు దేశం పార్టీతో కలిసి, జనసేన సహకారంతో పోటీ చేసిన కమల దళం, 4.13 శాతం ఓట్లతో రెండు ఎంపీ సీట్లు, నాలుగు ఎమ్మెల్యే సీట్లు గెలుచుకుంది.అయితే, 2019 ఎన్నికల నాటికి సీన్ మారిపోయింది. బీజేపీ, టీడీపీ, జనసేన విడిపోయాయి.ఎవరి దారిన వారు పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి నోటా కంటే తక్కువ శాతం ఓట్లు పోలయ్యాయి. ఒక్క సీటు రాలేదు.సరే, ఆఎన్నికల్లొ తెలుగు దేశం పార్టీ కూడా మూల్యం చెల్లించింది. అధికారం కోల్పోయింది.అలాగే, కమ్యూనిస్టులతో కలిసి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ కూడా ఓటమి చవిచూశారు. వైసీపీ అధికారంలోకి వచ్చింది. జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు.
అదలా ఉంటే ఇక అప్పటి నుంచి బీజేపీ ఒంటరిగా ఎదుగుతామంటూనే, పొత్తుల ప్రయత్నాలు చేస్తోంది. వ్యుహాలు మారుస్తూ రాష్ట్రంలో బలపడేందుకు ఏవేవో ప్రయోగాలు చేస్తోంది. పవన్ కళ్యాణ్ పార్టీ, జనసేనతో ప్రత్యక్షంగా పొత్తు పెట్టుకుంది. మరోవంక వైసీపీతో లోపాయికారి బంధం ఏదో బలపడుతున్నసంకేతాలు స్పష్టమవుతున్నాయి.
అయితే, వైసీపీ వ్యవహరానై కాసేపు పక్కన పెట్టినా, బీజేపీ, జనసేన పొత్తు కూడా ఉండీ లేనట్లుగా, తుమ్మితే ఊడిపోయే ముక్కులా ఉగిసలాడుతోంది. నిజానికి 2019లో రెండు పార్టీలమధ్య పొత్తు కుదిరిన సమయంలో, అప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారయణ, పవన్ కళ్యాణ్ సంయుక్త ‘గర్జన’ చేశారు. ఇక పై ప్రతి కార్యక్రమం రెండు పార్టీలు కలిసే చేస్తాయని, వైసీపీ ప్రభుత్వంఫై ఉమ్మడి పోరాటం సాగిస్తామని, పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు పొత్తు ఉంటుందని ప్రకటించారు. ఇక అంతే ఆ తర్వాత కన్నా స్థానంలో సోము వీర్రాజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత కూడా, రెండు పార్టీలు కలిసి చేసిన పోరాటాలు లేవు. అఫ్కోర్స్, ఒంటరిగా చేసిన పోరాటాలు లేవు, వీధి పోరాటాలు చేసే పరిస్థితులు లేవనుకోండి,అది వేరే విషయం. ఒక్క తిరుపతి ఉపఎన్నిక సందర్భంలో తప్పించి, మరెక్కడా రెండు పార్టీల నాయకులు,కార్యకర్తలు కలసి పనిచేసిన సందర్భం, చేపట్టిన కార్యక్రమం ఒక్కటీ లేదు. తిరుపతి ఫలితం ఏమిటో వేరే చెప్పనక్కర లేదు.
అదలా ఉంటే మొన్నటి మంత్రి వర్గ విస్తరణ సమయంలో పవన్ కళ్యాణ్’కు బెర్త్ ఖాయం అన్న వార్తలు అయితే వచ్చాయి కానీ, అవి గాలి వార్తలని తేలిపోయింది. బెర్త్ ఇవ్వక పొతే పోయారు, ఇతర మిత్ర పక్షాలకు పంపినట్లు ఒక ఆహ్వానం అయినా, పవన్ కళ్యాణ్’కు అందిదో లేదో కూడా అనుమానమే. రెండు పార్టీల మధ్య బీజేపే జాతీయ అధ్యక్షుడు నడ్డా సమక్షంలో పొత్తు కుదిరిన తర్వాత ప్రధాని మోడీని పవన్ కళ్యాణ్ ఇంతవరకు ఒక్కసారి కూడా కలవలేదు. ఒకే ఒక్కసారి, అమిత్ షాతో అది కూడా విశాఖ ఉక్కు విషయంపై సమావేశమయ్యారు. ఆ సమావేశంలో ఆయన ఏమి హామీ ఇచ్చారో ఏమో కానీ, ఇప్పుడు విశాఖ ఉక్కు విక్రయానికి నిర్ణయం జరిగిపోయింది. టెండర్లకు తేదీలు ఖరారై పోయాయి. అంటే, పవన్ కళ్యాణ్’కు రాష్ట్ర నాయకులు ఎంత గౌరవం ఇస్తున్నారో బీజేపీ జాతీయ నాయకులు కూడా అంతే గౌరవం ఇస్తున్నారు అనేందుకు ఇదే నిదర్శనం.
అదలా ఉంటే, పొరుగు రాష్ట్రం తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఇరు పార్టీల మధ్య సంబంధాలు బెడిసి కొట్టాయియి. చివరకు, పవన్ కళ్యాణ్, తెరాస అభ్యర్ది పీవీ కుమార్తె వాణీ దేవికి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగానే పవన్ కళ్యాణ్ తనకు బీజేపీ జాతీయ నాయకులు గౌరవం ఇస్తున్నా, రాష్ట్ర నాయకులు తను పట్టించుకోవడం లేదని ఇవ్వవలసిన గౌరవం ఇవ్వడం లేదని వాపోయారు.
ఇదలా ఉంటే,చాలాకాలం తర్వాత ఇటీవల రాష్ర్వనికి వచ్చిన పవన్ కళ్యాణ్, రాష్ట్రంలో నిరుద్యోగులు, రైతులు ఇతర వర్గాల సమస్యలపై ఉద్యమించేందుకు సిద్డంవుతున్నారు. అయితే, ఈ ఉద్యమాలు ఒంటరిగా చేయాలనే ధోరణి కనిపిస్తోంది. ఈ పరిణామాలను గమనిస్తే, పవన్ కళ్యాణ్, బీజేపీ బంధం తెగిపోనుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదలా ఉంటే, పార్టీ నిర్మాణం కాస్ట్లీ ఎఫైర్’గా మారిందని పవన్ కళ్యాణ్ చేసిన తాజా వ్యాఖ్యలు చివరకు బ్రదర్ బాటలో పవన్ కూడా జెండా పీకే’స్తారా అన్న అనుమానాలు కూడా వ్యక్త మవుతున్నాయి. అన్న చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్’లో కలిపేసినట్లు పవన్ కళ్యాణ్ జనసేనను బీజేపీలో కలిపెస్తారా? అనే అనుమాలు సైతం వినవస్తున్నాయి. బీజేపీ కూడ అదే కోరుకుంటోంది. చివరకు ఏమవుతుందో.. చూడవలసి ఉందని అంటున్నారు.