తల్లి, చెల్లినే బెటర్!.. వాళ్లను చూసి నేర్చుకో జగన్...
posted on Jul 8, 2021 @ 10:54PM
వైఎస్ జగన్మోహన్‌రెడ్డి. ఏపీ ముఖ్యమంత్రి. అంతటివాడిని పట్టుకొని గజదొంగ అని తిడుతున్నారు. జగన్‌నే కాదు ఆయన తండ్రి దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని సైతం నీళ్లదొంగ అంటూ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలను రాక్షసులు అంటున్నారు. తెలంగాణ మంత్రులు అంతేసి మాటలంటున్నా.. నోరు మూసుకొని పడుతున్నారు జగన్. ఎందుకు? సహనమా? సామరస్యమా? చేతగానితనమా?
వైఎస్ షర్మిల. జగన్ సోదరి. అన్నలానే తానూ సీఎం అవుదామని.. తాను తెలంగాణ కోడలినంటూ అక్కడ జెండా ఎత్తారు. అజెండా కూడా ప్రకటించారు. జగన్‌లా భయపడకుండా కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. ప్రజాసమస్యలతో పాటు తన తండ్రి వైఎస్సార్‌పై చేసిన వ్యాఖ్యలపైనా ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. జగన్‌లా ఊ-ఆ అనకుండా.. ఆడ సివంగిలా చెలరేగిపోయారు. వైఎస్సార్‌ను ఎవరైనా కించపరిస్తే ఉరికించి ఉరికించి కొడతామంటూ ఖతర్నాక్ వార్నింగ్ ఇచ్చారు షర్మిల. కాంగ్రెస్‌ను సైతం ఏకిపారేశారు. వైఎస్సార్‌ను టీఆర్ఎస్ పార్టీ నాయకులు తిడుతుంటే కాంగ్రెస్ వాళ్లు చేతికి గాజులు వేసుకుని కూర్చున్నారా? అంటూ ఇజ్జత్ తీసేశారు. జగన్‌కంటే చిన్నదైనా.. మహిళైనా.. సీమ బిడ్డ అనిపించుకున్నారు. కడప పౌరుషం చూపించారు. కనీసం, షర్మిలకు వచ్చిన కోపం, ఆవేశంలో సగం వంతైనా జగన్‌కు వచ్చుంటే.. ఆయనలా నీళ్లు నమిలేవారు కాదు. నీతి సూత్రాలు చెప్పేవారు కాదంటున్నారు.
అంతెందుకు.. షర్మిల వరకు ఎందుకు. వైఎస్ విజయమ్మనే తీసుకుందాం. తన భర్తను తిడితే.. ఆ వయసులోనూ ఆమెకు ఒళ్లు మండింది. తన పెనిమిటి గానీ, తన బిడ్డలు కానీ.. దొంగలు, గజదొంగలు కాదంటూ.. దోచుకోవడం, దాచుకోవడం తెలీదంటూ.. తన స్థాయిలో గట్టిగానే కౌంటర్ ఇచ్చారు విజయమ్మ. కనీసం.. ఆ అమ్మకు వచ్చినంత కోపమన్నా జగన్‌కు రావడం లేదా? తల్లి, చెల్లిలు అంత స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయితే.. వైఎస్సార్‌ను దొంగ అన్నందుకు తెలంగాణ మంత్రులను ఏకిపారేస్తే.. ఇక సీమ బిడ్డగా చెప్పుకునే జగన్‌రెడ్డి మాత్రం చాలా సాదాసీదా స్టేట్‌మెంట్స్ ఇస్తూ కవర్ చేసుకుంటున్నారని తప్పుబడుతున్నారు.
తాజాగా, సీఎం జగన్ జల వివాదంపై స్పందించారు. కొందరు తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని అన్నారు. కృష్ణాలో తమకు కేటాయించిన నీళ్లను వాడుకుంటే తప్పేంటన్నారు. నీటి కేటాయింపులపై సంతకాలు చేశారని గుర్తు చేశారు. నీటి విషయంలో రాజకీయాలు చేయడం సరికాదని, రాష్ట్రాల మధ్య సఖ్యత ఉండాలన్నదే తన అభిమతమన్నారు. పాలకుల మధ్య కూడా సఖ్యత ఉండాలని కోరుకుంటున్నానని చెప్పారు. అంతే. ఇంతకు మించి గట్టిగా మాట్లాడింది లేదు. తనను గజదొంగ అని, తన తండ్రిని నీళ్లదొంగ అని అన్నందుకు తెలంగాణ మంత్రులకు ఎలాంటి వార్నింగ్ ఇవ్వలేదు. కనీసం వారి మాటలను ఖండించనూ లేదు. తప్పుబట్టనూ లేదు. ఇదేం తీరు? బహుషా ఆ విమర్శలను ఆయన అంగీకరిస్తున్నారేమో అంటున్నారు.
షర్మిల హెచ్చరించినట్టు వైఎస్సార్‌ను కించపరిస్తే ఉరికించి కొడతామని గానీ.. తన భర్త మంచోడని విజయమ్మ అన్నట్టు గానీ.. కనీసం వాళ్ల స్థాయిలో కూడా రియాక్ట్ అవలేదు జగన్. జస్ట్.. కొందరు తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని మాత్రమే అన్నారు. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టు.. రాజకీయ ప్రయోజనాల కోసమో.. లేక, హైదరాబాద్‌లో ఆస్తుల రక్షణ కోసమో.. కారణమేంటో తెలీదు కానీ మరీ ఈస్థాయిలో జగన్ దిగజారడాన్ని ఆయన అభిమానులే జీర్ణించుకోలేకపోతున్నారు. తనను, తన తండ్రిని తిట్టినందుకు పడితే పడ్డారు గానీ, కనీసం ఏపీ ప్రజలను రాక్షసులతో పోల్చినందుకైనా తెలంగాణ మంత్రులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చుంటే.. ఆంధ్రుల ఆత్మాభిమానం నిలబడేదంటూ సీఎం జగన్ తీరుపై మండిపడుతున్నారు ఏపీ ప్రజలు. తల్లి, చెల్లిని చూసైనా రోషం తెచ్చుకొని.. పౌరుషం చూపించాలని డిమాండ్ చేస్తున్నారు.