విశాఖ స్టీల్ ప్లాంట్ పై వైసీపీ డ్రామాలు ఇన్నిన్ని కావయా!
posted on Jul 8, 2021 @ 3:07PM
ముందు తేలుకుట్టిన దొంగలా ఊరుకున్నారు. మంట మండుతుంటే భయమేసి వాళ్లూ ఓ కట్టె వెలిగించారు. డ్రామా నడిపించారు. పైవోళ్లకి మాత్రం కన్నుకొట్టారు. కింద ఉద్యమానికీ జై కొట్టారు. ఈలోపు ఎన్నికలు అయిపోయాయి. హమ్మయ్య అనుకున్నారు. ఇక దాని సంగతి వదిలేశారు. ఇదేనా ఉద్యమం అంటే.. ఇదేనా బంద్ చేయటం అంటే అంటూ నడిరోడ్డు మీద జబర్దస్త్ లెవెల్లో స్కిట్లు వేసిన ఎంపీ.. ఆ తర్వాత ఆ విషయం పట్టించుకోవడం మానేశారు. ఇప్పుడు అదే పనిని పైవోళ్లు వేగంగా నడిపించేస్తుంటే.. ఈసారి కనీసం అటువైపు చూడను కూడా చూడటం లేదు.
విశాఖ ఉక్కును ప్రైవేటీకరిస్తున్నారనగానే అంతా భగ్గుమన్నారు. పార్టీలకతీతంగా కార్మికులు, ఉద్యోగులు రోడ్డెక్కారు. ఎట్టిపరిస్ధితుల్లో ఆపాల్సిందేనని నినదించారు. అదే ప్రాంతంలో రాజధాని పెట్టి ఏలుదామనుకునే ఏలినవారికి ఈ పరిస్ధితి రుచించలేదు. అందుకే తన సహచర నిందితుడు విజయసాయిరెడ్డిని రంగంలోకి దింపారు. అసలు విశాఖ ఉక్కు కోసం ఏమైనా సమర్పిస్తాం అనే రేంజ్లో విజయసాయిరెడ్డి మంత్రి అవంతి శ్రీనివాస్ ను వెంటబెట్టుకుని ఉద్యమకారుల దగ్గరకెళ్లి మాట్లాడారు. ఉద్యోగసంఘాలు బంద్ కు పిలుపిస్తే.. ఆ బంద్ లో హైడ్రామా నడిపించారు. బంద్ ఇలా జరుపుతారా అంటూ వామపక్షాల కార్యకర్తలనే మీడియా లైవ్ లో ఎగతాళి చేశారు. ఏదో స్కిట్ చేస్తున్నట్లు ప్రశ్నలు, సమాధానాలు నడిపించి.. చివరకు వామపక్ష కార్యకర్తల చేతిలో చీవాట్లు తిన్నారు. అయినా తుడిపేసుకుని కథ ముందుకే నడిపించారు.
మరోవైపు వీరంతా ముందే కేంద్రానికి ఓకె చెప్పేశారని.. ఆ స్టీల్ ఫ్యాక్టరీ కొనడానికి వచ్చిన కంపెనీ ప్రతినిధులతో మీటింగులు పెట్టారని... వైసీపీ ఎంపీలే పార్లమెంటులో వేసిన ప్రశ్నలకు కేంద్రం ఎప్పుడో ప్రవైటీకరణపై క్లారిటీ ఇచ్చిందని..వీరికి విషయం ఎప్పుడో తెలుసని అందరికీ అర్ధమైపోయింది. దీని మీద జగన్మోహన్ రెడ్డి సైతం విశాఖ వచ్చి ఉద్యమ నేతలతో మీటింగ్ మమ అనిపించి.. అసలు స్టీల్ ఫ్యాక్టరీ ఎవరూ కొనడం లేదని.. ఆ కంపెనీ వాళ్లేదో పాపం వస్తే కడపలో పెట్టమని అడిగామని.. విశాఖ వైపు వారు చూడలేనది చిన్న పిల్లలు అబద్ధమాడినంత తియ్యగా చెప్పుకొచ్చారు. ఇన్ని రకాల డ్రామాలు నడిపించారు... చివరకు విశాఖ మున్సిపల్ ఎన్నికలయ్యేవరకు అదే ఊపు కొనసాగించారు. అవి అయిపోయాయి.. ఇక అంతే విశాఖ స్టీల్ ను పట్టించుకోవడమే మానేశారు.
కరోనా వేళ కాస్త మందగించిన ప్రైవేటీకరణ ప్రాసెస్ ను కేంద్రం ఇప్పుడు స్పీడప్ చేసింది.ఇక ప్రయివేటీకరణ తప్పదనే సంకేతాలు వచ్చేస్తున్నాయి. మహా అయితే రెండు, మూడు నెలల్లో అమ్మేస్తారని అర్ధమవుతోంది. అందుకే కార్మికులు,ఉద్యోగులు మళ్లీ రోడ్డెక్కారు. ఇప్పటికీ న్యాయం దక్కని నిర్వాసితులు సైతం వారితో జతకట్టారు. అయినా వైసీపీ నేతలు అటు వైపు చూడటం లేదు. పైగా ప్రయివేటీకరణను అడ్డుకుంటామని..అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వమే విశాఖ స్టీల్ ప్లాంట్ ను తీసుకుంటుందని బీరాలు పలికిన వైసీపీ ఎంపీలు, మంత్రులు ఇప్పుడు పత్తా లేరు. అవన్నీ అప్పటికప్పుడు ఎగసిపడ్డ జ్వాలను చల్లార్చడానికే చేశారని ఇప్పుడు అర్ధమవుతుంది. కేంద్రంలోని బిజెపికి ఎదురెళ్లి.. విశాఖ స్టీల్ ప్లాంట్ పై తాడో పేడో తేల్చుకునే పరిస్ధితి వైసీపీకి.. దాని అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేనే లేదు. ఇక ప్రతిపక్షాలు రంగంలోకి దిగి.. కార్మికులకు మద్దతుగా నిలబడి..విశాఖ ప్రయివేటీకరణను అడ్డుకోవాలని అందరూ కోరుతున్నారు