రేవంత్.. పవన్.. ఎన్టీఆర్.. ముగ్గురి ముచ్చటేంటి?
posted on Jul 8, 2021 @ 2:10PM
రేవంత్‌రెడ్డి. టీపీసీసీ అధ్యక్షులు. తెలంగాణలో పవర్‌ఫుల్ లీడర్. ఎప్పటికైనా సీఎం అవుతాడని.. కుదిరితే ఈసారే ముఖ్యమంత్రి పీఠం అధిరోహిస్తారని అంటున్నారు. రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ కొత్త ఉత్సాహంతో ఉరకలేస్తోంది. రేవంత్ దూకుడు మామూలుగా లేదిప్పుడు.
పవన్ కల్యాణ్. జనసేన అధినేత అలియాస్ పవర్‌స్టార్. ఫుల్‌టైమ్ పాలిటిక్స్, పార్ట్‌టైమ్ మూవీస్. ప్రస్తుతానికైతే రెండు పడవుల మీద కాళ్ల ప్రయాణం కంటిన్యూ చేస్తున్నారు. తెలుగునాట పిచ్చ ఫ్యాన్ ఫాలోయింగ్. ఆయన అడుగేస్తే.. నోరు తెరిస్తే.. ఈలలు, కేకలు. అది సినిమానైనా.. రాజకీయమైనా. అయితే, బీభత్సమైన క్రేజ్ అయితే ఉంది కానీ.. అది ఓట్ల రూపంలోకి మాత్రం మారడం లేదు. అభిమానులు ఫుల్లు. ఓట్లు నిల్లు. టీడీపీతో తెగదెంపులు చేసుకొని రాజకీయంగా పెద్ద తప్పే చేశారంటారు. మళ్లీ ఆ రెండు పార్టీలు కలిస్తేనే.. ఏపీకి మంచి భవిష్యత్తని చర్చించుకుంటున్నారు. ఏనాటికైనా సీఎం అవుతానని.. రాజకీయాలను మార్చేస్తాననేది పవన్ ధీమ. అందుకే, అన్నీ పరాజయాలే అయినా.. ఎప్పటికైనా ఒక్క ఛాన్స్ వస్తుందనే నమ్మకంతోనే పాలిటిక్స్‌లో కమిటిమెంట్‌తో పని చేస్తున్నారు.
జూనియర్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ మనవడిగా జూనియర్‌కు ఫుల్ క్రేజ్. నందమూరి వారసత్వం అదనపు అడ్వాంటేజ్. ఓసారి రాజకీయాల్లో వేలుపెట్టి.. చేయి కాల్చుకున్నారు. ఇప్పుడు ఆకులు పట్టుకుంటున్నారు. ఏనాటికైనా ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని.. వస్తారని.. సీఎం అవుతారనేది.. ఆయన అభిమానులు ఆకాంక్ష.
ఇప్పుడు ఈ ముగ్గురి ప్రస్తావన తీసుకురావడానికి కారణం లేకపోలేదు. ఓ అంశంలో ఈ ముగ్గురి ప్రవర్తన, ప్రతిస్పందనపై చర్చ నడుస్తోంది. తాజాగా, టీపీసీసీ అధ్యక్ష పదవి స్వీకరించాక.. రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడుతున్న సమయంలో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. అభిమానులు ఉత్సాహంతో సీఎం..సీఎం..సీఎం.. అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆ పరిణామం రేవంత్‌రెడ్డికి తీవ్ర అసహనం, ఆగ్రహం తెప్పించింది. అలాంటి నినాదాలు వద్దని.. అందరం సమష్టిగా కలిసి పని చేస్తామని... అధిష్ఠానం నిర్ణయాలకు కట్టుబడి ఉంటామంటూ.. ఎవరూ అలాంటి నినాదాలు చేయొద్దంటూ కాస్త గట్టిగానే హెచ్చరించారు. ఈ రోజు నుంచి జై సోనియా, జై రాహుల్ గాంధీ నినాదాలు మాత్రమే వినిపించాలని, ఎవరైనా వ్యక్తిగత నినాదాలు ఇస్తే పార్టీ నుంచి బహిష్కరిస్తానని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి. ఆయన ఇచ్చిన వార్నింగ్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్. సీఎం..సీఎం.. అంటూ నినాదాలు చేయడం రేవంత్‌కు లాభం కంటే నష్టమే ఎక్కువ చేస్తుందనేది ఆయన అంచనాలా ఉంది. కాంగ్రెస్‌లో ఎవరైనా పైకొస్తున్నారంటే తొక్కేసే ప్రయత్నాలు పెరుగుతుంటాయి. అందులోనూ, అధిష్టానం చెప్పే వరకూ ఎవరూ సీఎం అభ్యర్థి కానేకారు. ఫ్యాన్స్ ఇప్పటినుంచే రేవంత్‌రెడ్డిని కాబోయే సీఎంగా ప్రమోట్ చేస్తే.. అది పార్టీ లైన్‌ను విభేదించినట్టు అవుతుందని.. అది తనను ఇరకాటంలో పడేస్తుందనేది రేవంత్ భావనలా ఉంది. అందుకే, మనసులో తనకు సీఎం కావాలని ఉన్నా.. తానే కాబోయే సీఎంనని ధీమాగా ఉన్నా.. అభిమానులను మాత్రం గట్టిగా హెచ్చరించి.. ఇలాంటి నినాదాలు వద్దంటూ వార్నింగ్ ఇవ్వడం ఆసక్తికరం.
అదే, పవన్‌కల్యాణ్ అలా కాదు. ఆయన స్టైలే వేరు. పీకే కనిపిస్తే చాలు సీఎం..సీఎం.. అంటూ ఒకటే గోల. ఆ నినాదాలను పవన్ సైతం బాగా ఎంజాయ్ చేస్తుంటారు. ప్రసంగాలకు ఎంతగా డిస్టర్బ్ అవుతున్నా.. ఎక్కడా వారిని స్లోగన్స్ వద్దంటూ గట్టిగా వారించింది లేదు. వారి అభిమానం వారిది అంటుంటారు. తాను సీఎం అయితే తప్పేంటి? ఎందుకు కాకూడదు? ఏనాటికైనా తాను సీఎం కావొచ్చునని.. ఆయనే స్వయంగా పలు సందర్భాల్లో అన్నారు కూడా. అందుకే, తాను సీఎం అవుతానంటూ ఆయన అనుకోవడంతో పాటు.. అభిమానులను సైతం అలాంటి నినాదాలు చేస్తుంటే తెగ ఎంజాయ్ చేస్తుంటారు.
ఇక, జూనియర్ ఎన్టీఆర్. ప్రస్తుతం సినిమాలతో ఫుల్‌బిజీ. టీడీపీ కాస్త ఇబ్బందుల్లో ఉండటంతో జూనియర్ రావాలంటూ ఈ మధ్య అభిమానులు హడావుడి మొదలుపెట్టారు. ఇటీవల ఓ సినిమా ఫంక్షన్‌లో ఎన్టీఆర్ మాట్లాడుతుండగా.. ఫ్యాన్స్ సీఎం..సీఎం..అంటూ స్లోగన్స్ ఇవ్వడంతో జూనియర్‌కు చిర్రెత్తుకొచ్చింది. ఆగండి..బ్రదర్.. అంటూ కాస్త గట్టిగానే వారిని కంట్రోల్ చేశారు. తనకు ఇప్పట్లో రాజకీయాల్లోకి వచ్చే ఇంట్రెస్ట్ లేదంటూ పరోక్షంగా స్పష్టం చేశారు.
ఇలా.. అభిమానుల నుంచి సీఎం..సీఎం..సీఎం... అంటూ వచ్చే నినాదాలపై ఈ ముగ్గురు నేతల స్పందన మూడు రకాలుగా ఉండటం ఆసక్తికరం. అందరికీ సీఎం కావాలనే ఉంటుంది. కానీ, ఓపెన్ అయ్యారు.. ఇంకెకరు ఓపెన్ కాకుండా ఉన్నారు.. ఇంకొకరు సైలెన్స్ మెయిన్‌టెయిన్ చేస్తున్నారు. ఇలా.. ఎవరి దారులు వారివే. ఎవరి స్టైల్ వారిదే.