రేవంత్ రెడ్డి గేమ్ స్టార్ట్.. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి లీగల్ నోటీస్.. 

తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నంత పని చేస్తున్నారు. కాంగ్రెస్ లో గెలిచి టిఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేలను వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పిన రేవంత్ రెడ్డి.. ఆ దిశగా కార్యాచరణ ప్రారంభించారు.  మొదటగా ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని టార్గెట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సుధీర్ రెడ్డికి లీగల్ నోటీసు జారీ చేసింది. పార్టీ తెలంగాణ ఇన్ఛార్జ్ మనిక్కమ్ ఠాగూర్ నుంచి సుధీర్ రెడ్డికి లీగల్ నోటీసు అందింది.  రేవంత్ రెడ్డి సూచన మేరకు ఏఐసిసి ఈ నోటీసు మనిక్కం ఠాగూర్ ద్వారా పంపినట్లు తెలుస్తోంది. జులై 3వ తేదీన టిఆర్ఎస్ ఎల్పీ లో  మీడియాతో మాట్లాడిన సుధీర్ రెడ్డి.. టీపీసీసీ అధ్యక్ష నియామకంలో మనిక్కమ్ ఠాగూర్ 25 కోట్లు తీసుకున్నారని ఆరోపించారు. దీనిపైనే తన న్యాయవాది ఆర్. అరవిందన్ ద్వారా మానిక్కమ్ ఠాగూర్..  ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి లీగల్ నోటీస్ జారీ చేశారు. తనపై నిరాధార, అసత్య ఆరోపణలు చేశాని, ఎంతో నిజాయితీగా రాజకీయాలలో  ప్రతిష్ట పెంచుకున్న తనకు ఆ అబద్ధపు ప్రకటనతో పరువు దెబ్బతిన్నదని నోటీసులో పేర్కోన్నారు ఠాగూర్.  ఈ విషయంలో వారం రోజులలో బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేకపోతే కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుందని లీగల్ నోటీసుల్లో పొందుపరిచారు.లీగల్ నోటీసుకు సుధార్ రెడ్డి ఇచ్చే జవాబును బట్టి న్యాయస్థానాల్లో కేసు ఫైల్ చేసే అవకాశం ఉంది. కాంగ్రెస్ లో గెలిచి టిఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేల విషయంలో కొత్త పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి చాలా కఠినమైన అభిప్రాయంతో ఉన్నారు. తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీనుంచి బయటకు వెళ్లిపోయిన వారిని రాళ్లతో కొట్టి చంపండి అని ఆయన పిలుపునిచ్చారు. రేవంత్ ప్రకటనపై పార్టీ మారిన ఎమ్మెల్యేలు కూడా తీవ్రంగానే స్పందించారు. ఆ వివాదం కొనసాగుతుండగానే  లీగల్ నోటీస్ రావడం మరింత కాక రేపుతోంది. ఈ లీగల్ నోటీసుల అంశం సుధీర్ రెడ్డితోనే ఆగిపోతుందా లేద  మంత్రి సబితారెడ్డి తో సహా ఇతర ఎమ్మెల్యేలకు సైతం ఇస్తరా అన్నది చర్చగా మారింది. 

హుజురాబాద్ లో దొంగ ఓట్ల కలకలం! 

తెలంగాణ రాజకీయాలకు కేంద్రంగా మారిన హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో రోజుకో కీలక పరిణామం చోటు చేసుకుంటుంది. గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామా చేయడంతో త్వరలో ఇక్కడ ఉప ఎన్నిక జరగనుంది. సొంత నియోజకవర్గంలో గెలిచి టీఆర్ఎస్ కు షాకివ్వాలని  ఈటల రాజేందర్ పట్టుదలతో ఉన్నారు. ఇప్పటికే గ్రామాల్లో తిరుగుతున్న రాజేందర్.. జూలై 13, 14 తేదీల్లో పాదయాత్ర చేయబోతున్నారు. ఉప ఎన్నికలో గెలవడం ద్వారా తమకు తిరుగులేదనే సంకేతాలను ప్రజల్లోకి పంపించాలని టీఆర్ఎస్ భావిస్తోంది. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డికి హుజురాబాద్ ఉప ఎన్నిక తొలి పరీక్ష కాబోతోంది. అన్ని పార్టీలు ఉప ఎన్నికను సవాల్ గా తీసుకోవడంతో ఎన్నికల వేడి రాజుకుంది.  టీఆర్ఎస్ ప్రభుత్వంపై తాజాగా ఈటల రాజేందర్ సంచలన ఆరోపణలు చేశారు. హుజురాబాద్ మున్సిపల్ ఛైర్ పర్సన్ రాధిక ఇంటి నెంబర్ లో 34 ఓట్లు నమోదు చేసారంటూ జాబితా విడుదల చేశారు. హుజూరాబాద్ ప్రజలను టీఆర్ఎస్ నేతలు ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఈటల మండిపడ్డారు. ఇతర ప్రాంతాల ఓటర్లను ఇక్కడి ఓటర్ల జాబితాలో చేర్చుతున్నారని, దొంగ ఓట్లను సృష్టిస్తున్నారని అన్నారు. ఒక్కో ఇంట్లో 30 నుంచి 40 డొంగ ఓట్లను కూడా నమోదు చేస్తున్నారని విమర్శించారు. ఆర్డీఓ నేతృత్వంలో దొంగ ఓట్లు నమోదవుతున్నాయన్నారు  ఈటల రాజేందర్ , మున్సిపాల్టీలు, పెద్ద గ్రామాల్లో దొంగ ఓట్లు నమోదు చేయిస్తున్నారన్నారు. తమకు ఓట్లు వేయరనుకున్న వాళ్ల ఓట్లను టీఆర్ఎస్ నేతలు తీసేస్తున్నారని ఆరోపించారు. హుజురాబాద్ మున్సిపల్ ఛైర్మన్ రాధిక ఇంట్లో 34 ఓట్లు ఉన్నాయంటూ ఆధారాలు చూపెట్టారు ఈటల. దొంగ ఓట్లపై కార్యకర్తలతో కలిసి ఉద్యమిస్తామన్నారు రాజేందర్. సర్కార్ అధికార దుర్వినియోగం ఎక్కువైందన్నారు. టీఆర్ఎస్ చేస్తున్న చట్ట విరుద్ధమైన పనులకు సహకరిస్తున్న అధికారులపై ఈసీకి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. అధికారులు అధికార పార్టీకి బానిసల్లా పనిచేయవద్దని ఆయన హితవు పలికారు. పోల్ మేనేజ్మెంట్‌ను పోలీసులు చూసుకుంటున్నారన్నారు. మఫ్టీ పోలీసులు టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఉంటున్నారన్నారు. తాను ఒంటరిగా బరిలో దిగనని... ప్రజాస్వామికవాదుల అండతో పోటీ చేస్తున్నానన్నారు. ఈ ఎన్నికలు కేసీఆర్‌కు, ఈటలకు మధ్య, అన్యాయానికి, న్యాయానికి మధ్య జరుగుతున్నాయి. ఓటుకు టీఆర్ఎస్ లక్ష ఇచ్చినా.. తనకే వేస్తాం అంటున్నారని ఈటల చెప్పారు.  ఈటల రాజేందర్ చేసిన దొంగ ఓట్ల ఆరోపణలు సంచలనంగా మారాయి.అయితే ఈటలకు వెంటనే కౌంటరిచ్చారు హుజురాబాద్ టీఆర్ఎస్ నేతలు. తన ఇంట్లో దొంగ ఓట్లు నమోదు చేయించారన్న ఈటల ఆరోపణలను హుజురాబాద్ మున్సిపల్ చైర్మన్ రాధిక తీవ్రంగా ఖండించారు. 36 ఓట్లు ఒక్క ఇంటి నెంబర్ పై అంటున్న ఈటెలా...  ఈ రిపోర్ట్ కార్డు ఎవ్వరిదంటూ ప్రశ్నించారు. 2018లో నమోదైన ఓటర్ల జాబితాలోనే ఈ ఓట్లన్ని ఉన్నాయన్నారు. తన కుటుంబ సభ్యులతో పాటు ఇంట్లో కిరాయికి ఉన్నవారికి ఓట్లు ఉన్నాయన్నారు. 2018లో వీళ్లందరి ఓట్ల కోసం వచ్చిన విషయం గుర్తు లేదా ఈటల అంటూ రాధిక నిలదీశారు. ఇవన్ని దొంగ ఓట్లు అయితే నీవు 2018లో గెలిచింది దొంగ ఓట్లతోనేనని అంగీకరిస్తున్నావా అని మున్సిపల్ చైర్మన్ ప్రశ్నించారు. ఓటమి భయంతోనే రాజేందర్ అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ఆమె మండిపడ్డారు. 

జడ్జిలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాజశేఖర్ రెడ్డి అరెస్ట్ 

న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కడప జిల్లాకు చెందిన లింగారెడ్డి రాజశేఖర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ అంశంపై హైకోర్టు సుమోటగా కేసు స్వీకరించి సీబీఐకి విచారణకు అప్పగించింది. రాజశేఖరరెడ్డిని గుంటూరు 4వ అదనపు జూనియర్ సివిల్ కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. ఈ నెల 23 వరకు న్యాయస్థానం రిమాండ్ విధించింది. దీంతో రాజశేఖరరెడ్డిని జిల్లా జైలుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. గతేడాది న్యాయస్థానాలు కొన్ని కేసుల్లో ప్రభుత్వ వ్యతిరేక తీర్పులు ఇవ్వగా, న్యాయమూర్తులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు దర్శనమిచ్చాయి. దీనిపై తీవ్రంగా స్పందించిన ఏపీ హైకోర్టు జడ్జిలపై అవమానకర రీతిలో వ్యాఖ్యలు చేసేవారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సీబీఐని ఆదేశించింది. ఈ దర్యాప్తుకు సహకారం అందించాలంటూ ఏపీ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే తాజా అరెస్ట్ జరిగినట్టు తెలుస్తోంది.  

జగనేంటీ.. దేవుడితోనైనా కొట్లాడతాం! జల వివాదంపై కేటీఆర్ సంచలనం..

తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం కొనసాగుతూనే ఉంది. రెండు రాష్ట్రాల మంత్రులు, నేతల మధ్య మాటల యుద్దం ఆగడం లేదు. తాజాగా జల వివాదంపై తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. కృష్ణా జలాలపై ఏపీతోనే కాదు అవసరమైతే దేవుడితో కూడా కొట్లాడతామని చెప్పారు. కృష్ణా జలాలపై ఎట్టి పరిస్థితిల్లోనూ రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. చట్ట ప్రకారం రావాల్సిన నీటి వాటాను సాధించుకుంటామన్నారు కేటీఆర్. నారాయణపేట జిల్లాలో పర్యటించిన మంత్రి కేటీఆర్.. జిల్లా ఆస్పత్రిలో చిన్నపిల్లల ఐసీయూ వార్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మాట్లాడిన కేటీఆర్.. నారాయణపేటకు జలాలు రావాలంటే ప్రజాభిప్రాయ సేకరణకు రావాలన్నారు. ఎవరెన్ని రకాలుగా అడ్డుకున్నా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను కంప్లీట్ చేస్తామని స్పష్టం చేశారు. నారాయణపేటకు 10 కి.మీ. దూరంలోనే కర్నాటక ఉందని, ఆ రాష్ట్రంలో తెలంగాణలో అమలవుతోన్న ఏ ఒక్క పథకమైనా అమలవుతుందా? అని ప్రశ్నించారు. రైతుబంధు, కేసీఆర్ కిట్ లాంటి పథకాలు కర్నాటకలో ఉన్నాయో లేవో చెప్పాలన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని పథకాలు తెలంగాణలో అమలు చేస్తున్నామని కేటీఆర్ చెప్పారు.  ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ నంబర్‌వన్‌ స్థానంలో ఉందని వివరించారు.  ఊహించని విధంగా వరి పంట పండింది.. రైతుల దగ్గర పంట కొన్నాము అని తెలిపారు. వ్య‌వ‌సాయ అనుబంధ ప‌రిశ్రమలు నెల‌కొల్పుతామ‌న్నారు. నారాయణపేటలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. 3,400 తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చింది టీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని గుర్తుచేశారు. రాజ‌కీయాల‌కు అతీతంగా పంచాయ‌తీల‌కు, మున్సిపాలిటీల‌కు నిధులు విడుద‌ల చేస్తున్నామ‌ని వెల్లడించారు. ప్ర‌తి ఒక్క‌రూ చెట్ల‌ను పెంచి ముందు త‌రాల‌కు మంచి భ‌విష్య‌త్‌ను అందివ్వాలి అని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు.

జగన్మాయతో ఆర్థిక వ్యవస్థ దివాలా? పశ్చాతాపంలో పీకే.. మోసపోయామంటున్న జనం.. 

జీతాల విషయంలో ప్రభుత్వ ఉద్యోగులకున్న భరోసా ప్రైవేటు ఉద్యోగులకు ఉండదు.ముఖ్యంగా సకాలంలో జీతాలు వస్తాయనే భరోసా ప్రైవేటు ఉద్యోగులకు ఉండదు. అయితే ఇప్పుడు, ఏపీలో, ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఆ భరోసా లేకుండా పోయింది. చివరకు పెన్షనర్ల పెన్షన్’ కూడా దైవాధీనం, పెన్షనర్ల ప్రాప్తం అన్నట్లుగా మారిపోయిందని, ఉద్యోగులు, పెన్షనర్లు వాపోతున్నారు. అవును గతంలోనూ ఒకటి రెండు సందర్భాలలో జీతాలు లేటయ్యాయి,కానీ, ఇలా ఏ నెలకానెల జీతాలు వస్తాయో రావో అనే ఆందోళన గతంలో ఎప్పుడూ లేదని ఉద్యోగులు అంటున్నారు.  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, సంక్షేమ పథకాల పేరిట ఖజానా మొత్తాన్ని ఎప్పటికప్పుడు తుడిచేస్తున్నారన్న విమర్శలున్నాయి. అలాగే అందిన కాడికి అప్పుతెచ్చి కూడా పందేరాలు సాగిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఏది ఏమైనా, అప్పులే కాదు, ఇంకేదైనా, (బెగ్, బారో ఓర స్టీల్) చేసైనా, సంక్షేమ పథకాలు అమలు చేయాలని,తద్వారా అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలనే ఆలోచనతో ఉన్నారనేది, అందరికీ తెలిసిన విషయమే. అలాగే, రాష్ట్ర విభజనతో ఆదాయం పడిపోయి లోటులో కూరుకుపోయిన రాష్ట్ర  ఆర్థిక వ్యవస్థ, జగన్ రెడ్డి రెండేళ్ళ పందారాలతో పూర్తిగా ఊబిలో కూరుకుపోయింది.  అందుకే ఏపీలో ఉద్యోగుల జీతాలకు నెలనెలా దిక్కులు చూడవలసిన పరిస్థితి ఎదురవుతోంది. దీంతో ఒక‌టో తేదీక‌ల్లా ఉద్యోగుల బ్యాంక్ ఖాతాలలో జమ కావలసిన జీతాలు.. వారం  పది రోజులకు కూడా  జమ  కావడం లేదు. ఖ‌జానాలో డ‌బ్బు వెస‌లుబాటు అనుగుణంగా విడ‌త‌ల వారీగా ప్ర‌భుత్వం ఉద్యోగులకు వేత‌నాలు చెల్లిస్తోంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వ ఉపాధ్యాయుల‌కు జూలై ఒకటవ తేదీన జమ కావలసిన జూన్ నెల జీతాలు జులై ఎనిదవ తేదీన జమయ్యాయి. ఒక్కఉపాధ్యాయులకే కాదు, ప్రభుత్వ ఉద్యోగుల అందరిదీ కూడా ఇదే దయనీయ పరిస్థితి.  ఈ విధంగా ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని దౌర్భాగ్య స్థితికి చేరుకుంటే,అభివృద్ధి అనేది పూర్తిగా అడుగంటి పోతుంది. నిజానికి ఇప్పటికే పోలవరం వంటి ప్రాజెక్టులు నత్త నడకన నడుస్తున్నాయి. చాలా వరకు అభివృద్ది కార్యక్రమాలు స్తంభించి పోయాయి. కాంట్రాక్టర్లకు ఇవ్వవలసిన బకాయిలు కొండలా పెరిగిపోయాయని అధికారులే ఆందోళన చెందుతున్నారు. ఇక ఇప్పుడు జీతాలు కూడా ఇవ్వలేని స్థితికి చేరుకుంటే, రాష్ట్రానికి  పెట్టుబడులు రావు సరికదా, ఉన్న పరిశ్రమలు వెనక్కి వెళ్లి పోతాయి. జీతాలు సకాలంలో రాకపొతే, ఉద్యోగుల నైతిక స్థైర్యం దెబ్బతింటుంది. ఉద్యోగుల నైతిక స్థైర్యం దెబ్బతింటే పరిపాలన కుంటుపడుతుంది.పడకేస్తుంది. ఇదొక విషచక్రం. రాష్ట్రం ఈ విషయ చక్రంలో చిక్కుకుంటే, ఇక రాష్ట్రాన్ని రక్షించడం ఎవరి తరం కాదు.  నిజానికి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఆందోళన కరంగా ఉందని, రాష్ట్రం దివాలా అంచులలో ఉందని ఆర్థిక నిపుణులు ఎప్పటినుంచో హెచ్చరిస్తున్నారు. అయినా జగన్ రెడ్డి పరభుత్వం పట్టించుకోలేదు. అందుకు ఇప్పుడు మూల్యం చెల్లిస్తోంది. ఇక ముందు పరిస్థితి మరింత అధ్వాన్న స్థితికి  చేరుకుంటుంది. ఒక్క ఛాన్స్ ఇచ్చి చూద్దామని అనుకున్నందుకు  ప్రజలు చెల్లిస్తున్న మూల్యం ఇది. అందుకే, 2019 ఎన్నికల్లో జగన్ రెడ్డిని గెలిపించిన ఎన్నికల వ్యూహకర్త  ప్రశాంత కిషోర్ కూడా జగన్ రెడ్డిని గెలిపించి తప్పు చేశానని పశ్చాతాపం వ్యక్త పరిచారు.ప్రజలకు కూడ అదే అనుభవం త్వరలో వస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

చంద్రబాబును దీవించాలని జనాలను కోరిన మంత్రి.. 

తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేరే ఎక్కువగా వినిపిస్తోంది. కృష్ణ జలాల వివాదంలో వైఎస్సార్  లక్ష్యంగా తెలంగాణ మంత్రులు, టీఆర్ఎస్ నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఖండించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి నియామకం తర్వాత చంద్రబాబుకు లింక్ పెడుతూ ప్రకటన చేస్తున్నారు. చంద్రబాబు వల్లే రేవంత్ కు పీసీసీ పదవి వచ్చిందని టీఆర్ఎస్, బీజేపీ నేతలు కామెంట్ చేస్తుండగా.. కాంగ్రెస్ నేతలు కౌంటరిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రి  చంద్రబాబును దీవించాలని జనాన్ని కోరారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.  వివరాల్లోకి వెళితే తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కరీంనగర్ జిల్లాలో జరిగిన పల్లె ప్రగతి కార్యక్రమంలో గంగుల పాల్గొన్నారు. ఈ సభలో ప్రసంగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్లతో వృద్ధులు సంతోషంగా ఉన్నారని చెప్పారు గంగుల . ఇంత మంచి పథకాన్ని అందించిన చంద్రబాబుకు దీవెనలు అందించాలా? వద్దా? అని ప్రశ్నించారు. ఆయన కడుపు చల్లగా ఉండాలని కోరుకోవాలా? వద్దా? అని అడిగారు మంత్రి కమలాకర్. అయితే  వెంటనే తాను చేసి తప్పును ఆయన గ్రహించారు. కేసీఆర్ అని చెప్పబోయి చంద్రబాబు అన్నట్టు గుర్తించారు. వెంటనే తన తప్పును సరిదిద్దుకుని ప్రసంగాన్ని కొనసాగించారు. అయితే గంగుల కమలాకర్ పొరపాటున చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. గంగుల కమలాకర్ ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ నుంచి కరీంనగర్ ఎమ్మెల్యేగా గెలిచారు. 

అన్న ఆడ.. చెల్లెలు ఈడ.. ఏంటి ఈ నాటకాలు?

తెలంగాణలో పార్టీని ఏర్పాటు చేసిన ఏపీ ముఖ్యమంత్రి జగన్ సోదరి వైఎస్ షర్మిల త్వరలో పాదయాత్రకు సిద్ధమవుతున్నారు.  పార్టీ ఆవిర్బావ సభలో కేసీఆర్ ప్రభుత్వంతో పాటు కాంగ్రెస్ పై పలు విమర్శలు చేశారు షర్మిల. వైఎస్సార్ విషయంలో కాంగ్రెస్ మోసం చేసిందని ఆరోపించారు. ప్రజా సమస్యలపై మాట్లాడిన ఎక్కడా కేంద్రం పేరు మాత్రం ఎత్తలేదు. మోడీ సర్కార్ పై ఒక్క విమర్శ కూడా చేయలేదు. దీంతో షర్మిలపై తెలంణ కాంగ్రెస్ నేతలు ఫైరవుతున్నారు.    షర్మిల పార్టీపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే  జగ్గారెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ సోదరి షర్మిల తెలంగాణలో పార్టీ అంటూ కొత్త డ్రామాకు తెర లేపారని ఆయన ఆరోపించారు. షర్మిల తెలంగాణ కోడలే అయినా.. ఆమె రాయలసీమ రక్తమే కదా? అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. ‘అన్న ఆడ.. చెల్లెలు ఈడ.. ఏంటి ఈ నాటకాలు’ అంటూ నిప్పులు చెరిగారు. అన్నా చెల్లెళ్లు ఇద్దరూ లోటస్ పాండ్‌లో అంతా కలిసే ఉంటారని, బయటకు మాత్రం తమ మధ్య విభేదాలు ఉన్నట్లు నటిస్తున్నారని దుయ్యబట్టారు.  షర్మిల పార్టీ వెనుక బీజేపీ హస్తం ఉందని జగ్గారెడ్డి ఆరోపించారు. బీజేపీ ప్రోత్బలంతోనే వైఎస్ షర్మిల తెలంగాణలో రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిందన్నారు. ఇప్పటికే జగన్ ఏ అంశంలోనూ బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు చేయలేదని జగ్గారెడ్డి  గుర్తు చేశారు. అన్న బాటలోనే షర్మిల కూడా బీజేపీ జోలికి వెళ్లడం లేదన్నారు జగ్గారెడ్డి. వంద రూపాయలు దాటిన పెట్రోల్ రేట్లు, పెరిగిన గ్యాస్ ధరలు షర్మిలకు కనిపించడం లేదా అని మండి పడ్డారు జగ్గారెడ్డి. షర్మిల పార్టీకి తెలంగాణలో మనుడ లేదన్నారు. వారి ఆటలు ఇక్కడ సాగబోవని తేల్చి చెప్పారు.  తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ మధ్య నెలకొన్న జల వివాదంపైనా జగ్గారెడ్డి స్పందించారు.  కేసీఆర్, జగన్‌ లు రెండు రాష్ట్రాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. జల వివాదంపై మంత్రులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. చిన్న ఇష్యూను పెద్దగా చేస్తున్నారని విమర్శించారు. తిరుమల శ్రీవారి దర్శనానికి తెలంగాణ ప్రజాప్రతినిధులు జారీ చేసే సిఫారసు లేఖలకు అనుమతి లేదని జీఈఓ చెప్పడంపై జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల వెంకటేశ్వర స్వామి అందరి వాడు అని, తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను అనుమతి లేదని జీఈఓ చెప్పడం సరికాదన్నారు. దేవుడి దర్శనంలోనూ రాజకీయాలు చేయడం సరైంది కాదన్నారు. తెలంగాణ భక్తులు తిరుమలకు రావొద్దా? అని ప్రశ్నించారు జగ్గారెడ్డి. 

పక్క నియోజకవర్గ ఎమ్మెల్యేతో రివ్యూ.. పాలకొల్లు అధికారులకు నిమ్మల క్లాస్ 

ఆంధ్రప్రదేశ్ లో రివర్స్ పాలన సాగుతుందనే ఆరోపణలు మొదటి నుంచి ఉన్నాయి. దేశ వ్యాప్తంగా ఒకలా ఉంటే జగన్ రెడ్డి ప్రభుత్వంలో మరోలా ఉంటుందనే విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వ నిర్ణయాలు కూడా చాలా వరకు రివర్స్ అయ్యాయి. పాలకుల తీరులానే అధికారులు కూడా అంతా రివర్సుగానే వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో అలాంటి ఘటనే జరిగింది.  ఎక్కడైనా ప్రజా ప్రతినిధి వస్తున్నారంటే అధికారులు హడావుడి చేస్తారు. కానీ పాలకొల్లులో మాత్రం సీన్ రివర్స్. ప్రభుత్వ కార్యాలయానికి స్థానిక ఎమ్మెల్యే వస్తుంటే.. అధికారులు మాత్రం  పక్క నియోజకవర్గ ఎమ్మెల్యేతో సమావేశమయ్యారు. ఇదే ఇప్పుడు తీవ్ర వివాదంగా మారింది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఎమ్మెల్యేగా నిమ్మల రామానాయడు ఉన్నారు. ఆయన టీడీపీ నుంచి గెలిచారు. టీడీపీ ఎమ్మెల్యే ఉండటంతో అధికారులు ఆయనకంటే వైసీపీ నేతల డైరెక్షన్ లోనే పని చేస్తున్నారని చెబుతున్నారు. గత రెండేళ్లుగా పాలకొల్లు మున్సిపల్ పరిధిలో పేరుకుపోయిన సమస్యలను మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్‌కు విన్నవించేందుకు కార్యాలయానికి వచ్చారు రామానాయడు. అయితే ఆఫీసులో మున్సిపల్ కమీషనర్, ఇంజనీరింగ్ అధికారులు ఎవరు కనిపించలేదు.  అధికారుల ఎక్కడని ఎమ్మెల్యే రామానాయుడు ఆరా తీయగా... స్థానిక ఎయంసీ కార్యాలయం వద్ధ పక్క  నియోజకవర్గమైన నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు, వైసీపీ నాయకులు ఏర్పాటు చేసిన మున్సిపల్ రివ్యూలో పాల్గొన్నట్లు తెలింది. దీంతో ఎమ్మెల్యే రామానాయుడుకు చిర్రెత్తుకొచ్చింది. వెంటనే రావల్సిందిగా అధికారులకు సమాచారం పంపించారు. కమిషనర్, ఇంజినీరింగ్ అధికారులు మున్సిపల్ కార్యాలయానికి వచ్చేంత వరకూ వేచి చూశారు ఎమ్మెల్యే నిమ్మల. వారు ఆఫీసుకి వచ్చాక తీవ్రస్థాయిలో వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గ సమస్యలపై స్పష్టమైన అవగాహన ఉన్న స్థానిక ఎమ్మెల్యేను కాదని, పొరుగు నియోజకవర్గ శాసనసభ్యునితో రివ్యూ పెట్టుకోవడమేంటని నిలదీశారు. ప్రజల కష్టార్జితంతో పన్నులు కట్టిన నిధులను స్వప్రయోజనాలకు వినియోగించవద్దంటూ అధికారులను హెచ్చరించారు. నెల రోజుల గడువులో త్రాగునీరు, ఇళ్ల స్వాధీనం, రోడ్డు, డ్రైనేజ్ వంటి మౌలిక సదుపాయాలు, అంబేద్కర్ భవన్, స్మశానవాటిక, హెల్త్ పార్క్, ఎన్టీఆర్ కళాక్షేత్రం, రామగుండం పార్క్ వంటి పనులు పూర్తి చేయకపోతే ప్రజలతో, మహిళలతో పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగుతామని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుుడు హెచ్చరించారు.    పాలకొల్లు మున్సిపల్ అధికారుల తీరు హాట్ టాపిక్ గా మారింది. స్థానిక ఎమ్మెల్యేను పట్టించుకోకుండా పక్క నియోజకవర్గ ఎమ్మెల్యేతో సమావేశం కావడం ఏంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.  అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ఉన్న విలువ ప్రతిపక్ష ప్రజాప్రతినిధులకు ఉండదా అని చర్చించుకుంటున్నారు.  

మోడీ టీంలో 42 శాతంపై క్రిమినల్ కేసులు.. 

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, దేశమంతా గాలించి, శోదించి ఆణిముత్యాలను ఏరుకొచ్చి, మంత్రివర్గాన్ని ఏర్చికూర్చారని, మీడియాలో, సోషల్ మీడియాలో పేరు మోసిన పెద్దలు చాలా మంది చాలా రకాల విశ్లేషణలు చేశారు. అయితే, పొట్ట విప్పి చూస్తే..అసలు గుట్టు బయట పడిందని, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్, ఏడీఅర్, సంస్థ, మోడీ కాబినెట్ రియల్ కలర్స్  బయట పెట్టింది.  భారీ విస్తరణ తర్వాత మోడీ మంత్రివర్గంలో మొత్తం సభ్యుల సంఖ్య 78కి చేరింది. ఇందలో 42 శాతం మంది ఫై క్రిమినల్ కేసులున్నాయని ఏడీఆర్ తాజా నివేదిక తేల్చి చెప్పింది. ఇందులో నలుగురి మీద హత్యాయత్నం కేసులున్నాయని, ఏడీఆర్ నివేదిక పేర్కొంది.అంతే, కాదు, ఈ నివేదికకు ఆధారం, ఇక్కడా అక్కడా పోగేసిన గాలి కబుర్లు కాదు. ఆ మంత్రులు  ఎన్నికల సందర్భంగా ఎన్నికల సంఘానికి సమర్పించిన ఆఫిడవిట్’లో స్వయంగా స్వహస్తాలతో  పొందుపరిచిన వివరాల ఆధారంగా ఏడీఆర్ నివేదికను రూపొందించింది.  ఏడీఆర్ విశ్లేషణ ప్రకారం, మోడీ నూతన మంత్రివర్గంలో 78 మందిలో 33మంది (42శాతం) తమపై క్రిమినల్ కేసులు ఉన్న విషయన్ని అఫిడవిట్’లో పేర్కొన్నారు, అందులో 24 మంది (మొత్తం సభ్యులలో 31 శాతం)తమ మీద ’సీరియస్’ క్రిమినల్ కేసులున్నాయని పేర్కొన్నారు. అందులో, హత్య, హత్యా యత్నం, దొంగతనం వంటి హేయమైన కేసులు కూడా ఉన్నాయి.  ఎన్నికల హక్కుల పరిరక్షణ కోసం పనిచేసే ఏడీఆర్ సంస్థ ఎన్నికల ముందు తర్వాత కూడ పోటీలో ఉన్న అభ్యర్ధుల నేర చరిత్ర, ఆర్థిక స్థితిగతులు,విద్యార్హతలు,వ్యాపారలావాదేవీలు వంటి సమాచారాన్ని నివేదికల రూపంలో పబ్లిష్ చేస్తుంది.  మోడీ కాబినెట్ నేరచరిత అలా ఉంటే ఆయన మంత్రులలో కుబేరులకు కొదవ లేదు. మొత్తం  78 మందిలో 70 మంది కోటీశ్వరులు. ఇందులో ఇటీవల కాంగ్రెస్ నుంచి వచ్చి బీజేపీలో చేరిన జ్యోతిరాదిత్య సింధియా కాబినెట్ మొత్తానికి కుబేరుడు. అయన ప్రకటిత ఆస్తులే రూ. 379 కోట్లు, ఆయన తర్వాత పీయూష్ గోయెల్ రూ.95 కోట్ల సంపన్నుడు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఇప్పుడు మోడీ మంత్రివర్గంలో కాబినెట్ మంత్రి నారయణ రాణే ఆస్తుల విలువ రూ.87కోట్లు. అలాగే, రాజీవ్ చంద్రశేఖర్ ప్రకటిత ఆస్తులు రూ.64కోట్లు. ఈ నలుగురు అతి సంపన్నులు. అయితే మిగిలినవారిలోనూ కోట్లకు పడగలెత్తిన కుబేరులే ఎక్కువ. సగటున చూస్తే ఒక్కొక్క మంత్రి ఆస్తుల విలువ రూ.16.24 కోట్లని ఏడీఆర్ నివేదిక పేర్కొంది. అందరికంటే తక్కువ ఆస్తులు ఉన్న మంత్రి ప్రతిమ భౌమిక. త్రిపురకు చెందిన ఈమె చరస్థిర ఆస్తుల విలువ కేవలం రూ .6 లక్షలు. అలాగే, కేంద్ర మంత్రి వర్గంలోస్థానం సంపాదించుకున్న పశ్చిమ బెంగాల్ బడిపంతులు జాన్ బార్లా ఆస్తులు 14 లక్షలు. అలాగే,ఇంకో ముగ్గురు నలుగురు మంత్రుల ఆస్తులు కూడా  లక్షల్లోనే ఉన్నా, కుబేరులకు కొదువలేదు.

రేవంత్ టార్గెట్ గా కేసీఆర్ బిగ్ స్కెచ్.. కారెక్కనున్న పొన్నం ప్రభాకర్? 

గులాబీ గూటికి గుడ్ బై చెప్పేసి బీజేపీకి జై కొట్టిన ఈటల రాజేందర్.. కేసీఆర్ పై తీవ్ర ఆరోపణలతో రెచ్చిపోతున్నారు. బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఆగస్టు9 నుంచి పాదయాత్ర చేయబోతున్నారు. కేసీఆర్ లక్ష్యంగానే ఆయన యాత్ర సాగనుంది. తెలంగాణలో కొత్త పార్టీ పెట్టిన వైఎస్ షర్మిల కూడా త్వరలో పాదయాత్ర చేయబోతోంది. దొర పాలనకు చరమగీతం పాడుతానంటూ ఆమె హాట్ కామెంట్స్ చేస్తోంది . ఇక ఫైర్ బ్రాండ్ లీడర్ ఎంపీ రేవంత్ రెడ్డి.. పీసీసీ చీఫ్ గా మరింత దూకుడు పెంచారు. టీఆర్ఎస్ సర్కార్, సీఎం కేసీఆర్ పై విరుచుకుపడుతున్నారు. రోజుకో సంచలన ప్రకటనతో బాంబులు పేల్చుతున్నారు. వరుసగా జరుగుతున్న పరిణామాలతో తెలంగాణ రాజకీయాలు హీటెక్కాయి. విపక్షాలన్ని యాక్టివ్ కావడంతో గులాబీ పార్టీలో గుబులు కనిపిస్తోందని తెలుస్తోంది. గత ఏడేళ్లుగా సరైన ప్రతిపక్షం లేకపోవడంతో కేసీఆర్ ఆడిందే ఆటగా మారింది. కాని ఇప్పుడు సీన్ మారడంతో కేసీఆర్ కూడా అలర్టైనట్లు కనిపిస్తోంది. అందుకే ఆయన రూట్ మార్చుకుని జనంలో వెళుతున్నారు. తాజాగా ఆయన రాజకీయ వ్యూహాలకు పదును పెట్టారని, విపక్షాలను వీక్ చేసే వ్యూహాలు రచిస్తున్నారని  అంటున్నారు. అందులో భాగంగానే మళ్లీ ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపారని చెబుతున్నారు. కేసీఆర్ యాక్షన్ తో వలసలు కూడా మొదలయ్యాయి. తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన రమణ త్వరలోనే కారెక్కనున్నారు. ఆయన బాటలోనే మరికొందరు టీడీపీ నేతలు గులాబీ కండువా కప్పుకుంటారనే ప్రచారం జరుగుతోంది.  రేవంత్ రెడ్డి రాకతో జోష్ మీదున్న కాంగ్రెస్ పై కేసీఆర్ స్పెషల్ ఫోకస్ చేశారని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలోని కొందరు సీనియర్లను కారెక్కించి రేవంత్ రెడ్డికి ఆదిలోనే షాక్ ఇవ్వాలని ఆయన ప్లాన్ చేస్తున్నారట. ఉత్తర తెలంగాణకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేతను  టీఆర్ఎస్ లో చేర్చుకునేలా పావులు కదుపుతున్నారని సమాచారం. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉన్న కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ను గులాబీ గూటికి రావాలని ఆహ్వానించినట్లు, ఆ చర్చలు ఫలించినట్లు చెబుతున్నారు. మొన్నటి వరకు టీపీసీసీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న పొన్నం... రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ బాధ్యతలు ఇచ్చాకా కొంత సైలెంట్ అయ్యారని అంటున్నారు. రేవంత్ రెడ్డితో మొదటి నుంచి పొన్నంకు సఖ్యత లేదంటారు. ఇదే అదనుగా రంగంలోకి దిగిన గులాబీ లీడర్లు.. అతనితో మాట్లాడి కారు పార్టీలోకి రమ్మని ఆహ్వానించారని తెలుస్తోంది. పొన్నం కూడా మంత్రి కేటీఆర్ తో రెండు సార్లు చర్చించారని చెబుతున్నారు.  పొన్నం ప్రభాకర్ బీసీ నేతగా కాంగ్రెస్ లో కీలక పదవులు దక్కించుకున్నారు. దివంగత వైఎస్సార్ కు సన్నిహితుడిగా పేరున్న పొన్నంకు పార్టీలోని మరో బలమైన బీసీ నేత మధుయాష్కి గౌడ్ తో మొదటి నుంచి విభేదాలున్నాయి. పొన్నం వైఎస్సార్ వర్గంలో ఉండగా.. యాష్కి మాత్రం వైఎస్ వ్యతిరేక వర్గంలో ఉన్నారు. ప్రస్తుత కమిటీలో  పొన్నంకు ఏ పదవి రాకపోగా.. మధుయాష్కికి మాత్రం ప్రచార కమిటి చైర్మన్ పోస్టు దక్కింది. అటు రేవంత్ రెడ్డితోనూ పొన్నంకు మంచి సంబంధాలు లేవు. అందుకే ప్రతి విషయంపైనా వెంటనే స్పందించే పొన్నం... కొన్ని రోజులుగా మాట్లాడటం లేదు. పార్టీలో అసంతృప్తిగా ఉన్న పొన్నం.. దీంతో టీఆర్ఎస్  ఆహ్వానానికి  సానుకూలంగానే స్పందించారని చెబుతున్నారు. త్వరలోనే పొన్నం కారు పార్టీ గూటికి చేరవచ్చని కాంగ్రెస్ లోని కొన్ని వర్గాలు కూడా చెబుతున్నాయి. టీఆర్ఎస్ నేతలైతే పొన్నం గులాబీ గూటికి చేరడం ఖాయమంటున్నారు.  ఈటల రాజేందర్ రాజీనామా చేసిన హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి త్వరలో ఉప ఎన్నిక జరగనుంది. ఇది కరీంనగర్ లోక్ సభ పరిధిలోనే ఉంది. కరీంనగర్ ఎంపీగా పని చేసిన పొన్నంకు హుజురాబాద్ తోనూ మంచి సంబంధాలున్నాయి. ఉప ఎన్నికలో ఇది తమకు కలిసివస్తుందని కేసీఆర్ భావిస్తున్నారని తెలుస్తోంది. మరోవైపు హుజురాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ నుంచి పొన్నం ప్రభాకర్ అభ్యర్థి అయినా ఆశ్చర్యం లేదనే టాక్ వినిపిస్తోంది. బీసీ నేతగా గుర్తింపు ఉన్న ఈటలను ఎదుర్కొవడానికి మరో బలమైన బీసీ నేత బాగుంటుందనే యోచనలో గులాబీ పెద్దలు ఉన్నారని అంటున్నారు.  మొత్తానికి పొన్నం ప్రభాకర్ టీఆర్ఎస్ లో చేరితే తెలంగాణ రాజకీయాల్లో అదో కీలక పరిణామంగా మారుతుందని  రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.  

అప్పు చేయ్.. తప్పు చేయ్..  జగనన్న సూపర్ స్కీమ్! 

కింగ్ ఫిషర్ విజయ్ మాల్యా తెలుసుగా. గురుడు మాంచి టేస్ట్ ఉన్నోడు. అసలు కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ స్టార్ట్ చేసినప్పడు.. ఆ కలర్స్..కలర్ ఫుల్ ఎయిర్ హోస్టెస్ లు... పెట్టే ఫుడ్ ..ఒకటేమిటీ అన్నీటెంప్టింగే. అప్పట్లోనే ప్రతి సీటుకు స్క్రీన్ పెట్టి టీవీ చూపించేశాడు మనోడు. ప్యాసింజర్స్ ఎగబడి మరీ ఆ ఫ్లయిట్స్ ఎక్కేవాళ్లు. అది చాలక.. నేను అది కొనేస్తా..ఇది కొనేస్తానని ఎగిరాడు. ఈలోపు ఉన్న ఫ్లైట్ కూలిపోయింది. ఎందుకంటే ఆ సోకులన్నీ అప్పులతోను.. ఒక పద్ధతి లేకుండా డబ్బులు వాడేసి..చివరకు లోన్లు తిరిగి కట్టాల్సిన టైమ్ దాటిపోవడంతో.. చేతికి సొమ్ము దొరక్క.. కుప్పకూలిపోయింది గురుడి సామ్రాజ్యం. ఇంత చేసినా ఆ సొమ్ముల్లోంచి తనకంటూ తీసుకోవడం మర్చిపోలేదండోయ్.. అవి పక్కన పెట్టాడు. వాటి కోసమే ఇప్పుడు బ్యాంకులన్నీ పాపం పోరాడుతున్నాయ్.  ఇదంతా ఎందుకంటే.. అప్పు చేసి పప్పు కూడు.. లోన్ తీసుకుని బిర్యానీ తినడం.. క్రెడిట్ కార్డుతో మందు పార్టీ..ఇవన్నీ అందరూ చూసేసినవే. కాకపోతే ఎప్పటికప్పుడు అప్ డేట్ గా కొత్తగా చూపిస్తుంటారు. ఇప్పుడు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా అదే రూటులో వెళుతున్నారు. ప్రజలకు సంక్షేమం అందివ్వడం తన లక్ష్యమని.. చెబుతూ అనుకున్నది అనుకున్నట్లుగా రకరకాల పేర్లతో జనాలకు డబ్బులు వేయటం.. వారంతా ఇక తనతోనే ఉంటారని.. తనకు అధికారం శాశ్వతమని.. జైలుశిక్ష పడినాకూడా ఫరక్ పడనది జగన్ కాన్సెప్ట్. కాని అన్ని డబ్బులు కూడేయటం కష్టంకదా..అందుకే ఏ డబ్బులు పడితే ఆ డబ్బులు..లాగేసి..పాతవి, కేంద్ర పథకాలను సైతం ఆఫేసి.. ఆ డబ్బులన్నీ తాను కొత్తగా పేర్లు పెట్టిన సంక్షేమ పథకాలకు తరలించేశారు. అటు నుంచి డబ్బులు పంపుతూ..కష్టకాలంలో కూడా తాను అనుకున్నట్లు ఇస్తున్నానని చెప్పుకుంటున్నాడు. పయ్యావుల కేశవ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్. ప్రతిపక్ష నేతకే ఈ పదవి ఇస్తారు. ఆయన లెక్కలన్నీ ఏదో తవ్వుదామని అనుకున్నాడు. కాని ఆయనకు ఆ కష్టం లేకుండానే కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) ఓ రిపోర్టు ఇచ్చింది. అది చదివితే.. ఆయనకు దిమ్మ తిరిగినట్లుంది. తాము అనుకున్నదాని కంటే ఘోరంగా పరిస్ధితి ఉందని అర్ధమైంది. ఒకటి కాదు రెండుకాదు..ఏకంగా 41వేల కోట్లకు లెక్కా పత్రం లేదని కాగ్ తేల్చింది. ఎస్సీఎస్టీ నిధులేమో అమ్మ ఒడికి పంపించేశారు. కార్పొరేషన్ల నిధులు చేయూత, కాపు నేస్తం లాంటి పథకాలకు లాగేశారు. అక్కడ అప్పటికే శాంక్షన్ అయినవాటికి మాత్రం అన్నీ ఆపేశారు. ఉపాధి హామీ పనులకు గతంలో చేసినవాటికి పేమెంట్ పెండింగ్ పెట్టేశారు... ఆ డబ్బులు కేంద్రం నుంచి వచ్చినా..వాటిని కొత్త పనులకు వాడేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం కళ్లు గప్పికూడా లోన్లు పరిధిని మించి తీసేసుకున్నారు. ఏ ప్రాపర్టీ పడితే ఆ ప్రాపర్టీ తాకట్టు పెడతాం డబ్బులివ్వమని బ్యాంకుల వెంట పడుతున్నారు. ఆఖరికి తాము వద్దనుకునే అమరావతి ప్రాజెక్టును సైతం పెండింగ్ పనుల పూర్తిగా లోను కావాలంటూ హడావుడి చేసి..ఆ లోను డబ్బులను వేరేదానికి వాడుకోవడానికి కూడా ప్లాన్ చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయని ప్రభుత్వం మీద విమర్శలు చేసేవారు అంటున్నారు. మొత్తం మీద 41 వేల కోట్లకు లెక్కలు లేవని..ఈ డబ్బులన్నీ పోయాయని కాదని..అసలు ఇవి సక్రమంగా వాడారాలేదా అనేది తేల్చడానికి కూడా వీల్లేకుండా చేశారని పయ్యావుల కేశవ్ ఆరోపించారు. రాష్ట్ర ఆర్ధిక శాఖ మాత్రం అలాంటిదేమీ లేదని.. ఖండించింది. అంతే ఏ సలహాదారుడు, ఏ మంత్రి కూడా దీనిపై నోరు మెదపటం లేదు. అసలే కోవిడ్ సంక్షోభం.. దేశంలో ఆర్ధిక పరిస్ధితి కూడా బాగోలేదు. ఈ రెండేళ్లు ఇచ్చినట్లు ఇవ్వలేమని వారికి కూడా అర్ధమైంది. అందుకే లబ్ధిదారులను తగ్గించే పని కూడా రీసెంట్ గా మొదలెట్టారు. తర్వాత తర్వాత.. గ్యాస్ సబ్సిడీలాగా...స్వచ్చంధంగా పథకాల నుంచి తప్పుకునేవారు తప్పుకోవాలనే రిక్వెస్టులు కూడా రావొచ్చు

జగన్ బ్యాటింగ్ పై జబర్దస్ రీమిక్స్.. ఫుల్లుగా ఆడుకుంటున్నారు.. 

సెలెబ్రిటీస్ ఏ చిన్న పని చేసినా హైలెట్ అవడం కామనే. చిరంజీవి లాక్ డౌన్ లో వంట చేసినా.. హైలెటే.. ఇంకేం జరిగినా హైలెట్ అవుతుంది. ఎందుకంటే వారేం చేసినా.. అది చూపిస్తే జనం చూస్తారు. ఇది మీడియా ఫార్ములా. అందుకే అలాంటివి జరిగినప్పుడు తెగ చూపించేస్తారు. ఇది కూడా ఒక న్యూసేనా అంటూ తిట్టుకునేవాళ్లు కూడా దానిని రెండు మూడు సార్లు చూస్తారు. అది హ్యుమన్ సైకాలజీ.. అంతే మరి. అప్పట్లో చంద్రబాబునాయుడు నల్ల కళ్లద్దాలు పెట్టుకుని ఎయిర్ షో చూస్తే.. అది కూడా బాగా హైలెట్ అయింది.  ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి క్రికెట్ ఆడితే.. అది మరీ హైలెట్ అయిపోయింది. మామూలు మీడియాలో ఆకాశానికెత్తేస్తే.. సోషల్ మీడియాలో కామెడీ చేసేస్తున్నారు. ఇప్పుడు ఆ వీడియో ట్రెండింగ్ అయిపోయింది. ఒక నెంబర్ వన్ చానెల్ లో అయితే ... మామూలుగా పొగడలేదు. వారికి జగన్ క్రికెట్ ఆడుతున్న దృశ్యం అద్భుత దృశ్యంగా కనిపించిందంట. చూడటానికి రెండు కళ్లు కూడా సరిపోలేదంట. అసలు రెండు బాల్స్ ఆడినందుకే జగన్ ను ఇంత ఎత్తేస్తే.. ఒక మ్యాచ్ ఆడుంటే ఇంకేం చేసేవారో. దాని గురించి ఒక ప్రోగ్రామ్ కాదు.. రెండు మూడు ప్రోగ్రామ్ లలో ఐదేసి నిముషాల పాటు తెగ చూపించేశారు.ఆయన కొట్టింది రెండు సార్లు అయితే..వీరు దాదాపు వంద బాల్స్ కొట్టించారు. నిజంగా అది జగన్మోహన్ రెడ్డి చూస్తే మాత్రం..ఆ స్క్రిప్టు రాసినోళ్లకి కూడా ఏదో ఒక పథకం అందేలా చేసేస్తాడు. నిజం ఆ రేంజ్ లో రాశారు మరి. జనానికి ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని..చూపించొచ్చు గాని..మరీ ఇంత ఓవర్ యాక్షన్ అవసరమా? ఇక సోషల్ మీడియాలో అయితే రివర్స్ లో నడుస్తోంది. వైసీపీ మద్దతుదారులు అయితే జగన్ బ్యాటింగ్  చేస్తే అంతే మరి..బాల్ అయినా బాబు అయినా అంటూ సెటైర్లు వేశారు. ఇక కొందరు యూ ట్యూబర్స్ ఓ స్కూప్ లా తయారు చేసేశారు. 7జీ బృందావన కాలనీలో హీరో హీరోయిన్ చూస్తుందని బిల్డప్ ఇస్తూ క్రికెట్ ఆడిన సీన్ ని..జగన్ బ్యాటింగ్ వీడియోతో రీమిక్స్ చేసేసి పెట్టేశారు. అది ఫుల్ ట్రెండింగ్ అయిపోయి.. ఫుల్ కామెడీ చేసేస్తోంది. ఫేస్ బుక్ లో వైసీపీ మద్దతుదారులు పెట్టిన వీడియోకి.. కౌంటర్ గా ఈ వీడియోను కొందరు అదే వాల్ పై పోస్టు చేస్తున్నారు. దీంతో కామెంట్ల యుద్ధం నడుస్తోంది దీని మీద.  

శానిటైజర్ ఫైర్.. బాలుడు మృతి.. 

పిల్లలు అన్నతర్వాత ఆటలు సహజం. కొన్నిసారు ఎంత చెప్పిన వినకుండా.. పెద్దల మాటలు పట్టించుకోకుండా.. గేమ్స్ ఆడుతుంటారు..ఇక ఆ ఆటల మీద పడితే తిండి నిద్రలు ఉండవు వాళ్ళకి. అలా సరదాగా ఆదుకునే ఆటలే కొన్నిసార్లు ప్రాణాల మీదికి వస్తుంటాయి.. ఆలా ప్రమదాహానికి గురై చనిపోయిన పిల్లల వీడియోలు మనం నిత్యం సోషల్ మీడియాలో చూస్తుంటాం.. అయితే తాజాగా సరదా ఆట ఓ బాలుడి ప్రాణం తీసింది. శానిటైజర్ మంటలకు పసివాడు బలైపోయాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరుచ్చిలోని ఈబి రోడ్‌లోని భారతినగర్‌లో నివాసం ఉంటున్న బాలమురుగన్ చిన్న కొడుకు శ్రీరామ్. 8వ తరగతి చదువుతున్నారు.  శ్రీరామ్  తన స్నేహితులతో కలిసి ఆడుకునేందుకు బయటకు వెళ్లాడు. ఈ ఆటలో భాగంగా తన సహచర మిత్రులకు జాక్ ఫ్రూట్ విత్తనాలను ఉడకబెట్టి ఇవ్వాలని అనుకున్నాడు. ఇందుకోసం పొయ్యి ఏర్పాటు చేసేందుకు కట్టెలు, రాళ్లను సేకరించాడు. కింద మీద పది చివరికి కట్టెల పొయ్యిని ఏర్పాటు చేశాడు. మిగతా స్నేహితులు ఇతర పదార్థాలు తీసుకురాగా.. శ్రీరామ్ పొయ్యిని వెలిగించే పనిలో పడ్డాడు. అయితే, చెక్కలకు మంటలు అంటుకోకపోవడంతో.. శ్రీరామ్ తన ఇంటి నుంచి శానిటైజర్ బాటిల్ తీసుకువచ్చాడు. కట్టెలపై పోసి నిప్పు పెట్టాడు. అప్పుడు చిన్నగా మంట అంటుకోవడంతో ఆ మంటను మరింత పెంచేందుకు శ్రీరామ్ ఆ శానిటైజర్‌ను నేరుగా మంటలపై స్ప్రే చేశాడు. ఇంకేముంది ఒక్కరిగా  ప్రమాదవశాత్తు ఆ మంటలు శానిటైజర్ బాటిల్‌కు అంటుకున్నాయి. దాంతో  శ్రీరామ్ చేతిలో ఉన్న ఆ శానిటైజర్ బాటిల్ పేలింది. ఈ పేలుడు ధాటికి శ్రీరామ్‌కు మంటలు అంటుకున్నాయి. మంటల్లో చిక్కుకున్న శ్రీరామ్‌ని గమనించిన స్థానికులు.. వెంటనే అతనిపై నీరు పోసి మంటలను ఆర్పేశారు. పక్కవాళ్ళు ఎప్పుడు చూశారో ఏమో అప్పటికే కాలిపోయిన శ్రీరామ్ ని  తిరుచ్చిలోని ఎంజిఎంజిహెచ్ ఆస్పత్రికి తరలించారు. మంటల తీవ్రత అధికంగా ఉండటంతో.. శ్రీరామ్ ఆస్పత్రిలో చికిత్స పోందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పిల్లలకు శానిటైజర్‌ను దూరంగా ఉంచాలని వైద్యులు సూచిస్తున్నారు. కాగా, బాలుడు మృతిలో అతని కుటుంబంలో పెను విషాదం నెలకొంది. బాలుడు చనిపోవడంతో అతని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని తిరుచ్చిలో చోటు చేసుకుంది.

దేవుళ్లతో కన్నీళ్లు పెట్టిస్తారా.. కేసీఆర్ ను కడిగిపారేసిన రేవంత్ రెడ్డి...

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. ప్రజా సమస్యలపై తనదైన శైలిలో స్పందిస్తున్నారు. శుక్రవారం ప్రగతి భవన్ ముందు ధర్నాకు దిగిన స్టాఫ్ నర్సుల సమస్యపై సీఎం కేసీఆర్ ను కడిగిపారేశారు రేవంత్ రెడ్డి. తెలంగాణ పిసిసి చీఫ్ గా సిఎం కేసిఆర్ కు తొలి బహిరంగల లేఖ రాశారు రేవంత్ రెడ్డి. నర్సులకు ఉద్యోగాలు తొలగించిన అంశంపై ప్రభుత్వాన్ని నిలదీశారు. కరోనా సమయంలో స్టాఫ్ నర్సులను దేవుళ్లు అని కేసీఆరే పొగిడారని.. ఇప్పుడు వాళ్లంతా  ప్రగతి భవన్ ముందు కన్నీళ్లు పెట్టుకుంటున్నారని చెప్పారు. దేవుళ్లతో కన్నీళ్లు పెట్టిస్తారా అంటూ ప్రశ్నించారు. క‌రోనా వేళ ప్రాణాల‌ను సైతం ఫణంగా పెట్టి క‌రోనా రోగుల‌కు 24 గంట‌ల పాటు సేవ‌లు అందించిన కాంట్రాక్ట్‌, అవుట్ సోర్సింగ్ న‌ర్సుల‌ను  ఉద్యోగాల నుంచి తొల‌గించ‌డం హేయ‌మైన చ‌ర్య‌ని మండిపడ్డారు.  ఉన్నపళంగా ఉద్యోగాలు తొలగించి 1640 కుటుంబాలను రోడ్డున పడేశారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రగతి భవన్ కు వస్తే ఐదు నిముషాలు వాళ్ల గోడు వినే తీరిక మీకు లేదా? ప్రగతి భవన్ అనేది ప్రజల కష్టాలు విని, కన్నీళ్లు తుడవాల్సిన సీఎం కార్యాలయమా లేక కల్వకుంట్ల ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ కార్యాలయమా? చెప్పండని నిలదీశారు. 2018 లో ఎంపికైన ఎఎన్ఎంలకు ఇప్పటికీ పోస్టింగులు ఎందుకు ఇవ్వడం లేదని రేవంత్ ప్రశ్నించారు.స్టాఫ్ నర్సులను యథాతథంగా విధుల్లో కొనసాగించాలి. 2018 ఎఎన్ఎం అభ్యర్థులకు తక్షణం పోస్టింగులు ఇవ్వాలని పీసీసీ చీఫ్ డిమాండ్ చేశారు.  50 వేల ఉద్యోగాల భర్తీ పై కేసీఆర్ చేసిన ప్రకటన చీటింగ్ “వన్స్ మోర్” లాగా ఉందన్నారు రేవంత్ రెడ్డి. ప్రభుత్వంలో 1.91 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని బిశ్వాల్ కమిటీ నివేదిక ఇస్తే 50 వేలు మాత్రమే భర్తీ చేస్తామనడం ఏంటన్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని కార్పొరేషన్లలో ఉద్యోగ ఖాళీల భర్తీ సంగతి స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వంలోని 1.91 లక్షల ఉద్యోగ ఖాళీలతో పాటు, కార్పొరేషన్ల లోని ఖాళీల భర్తీకి తక్షణం షెడ్యూల్ ప్రకటించాలి. లేని పక్షంలో అతి త్వరలో నిరుద్యోగ యువత తరఫున టీపీసీసీ కార్యచరణ ఉంటుందని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. 

ఏపీకి కొత్త గవర్నర్ ఎవరో తెలుసా ? 

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంత్రివర్గ విస్తరణలో సహచర మంత్రులు, పార్టీ నాయకులు, రాష్ట్రాల ముఖ్య మంత్రులకు ఎవరికి ఇవ్వవలసిన సందేశం వారికి ఇచ్చారు. ఏకంగా 12 మంది మంత్రులకు ఉద్వాసన పలికారు. రాష్ట్రాలలో పార్టీ విస్తరణ అవకాశాలు,అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఏడుగురికి కాబినెట్ మంత్రులుగా ప్రమోషన్ ఇచ్చారు. కొత్తగా తీసుకున్న 36 మందిలోమహిళలు,ఎస్సీ,ఎస్టీ, బీసీ, ఓబీసీలకు ఇలా అన్ని వర్గాలకు సముచిత ప్రాధాన్యత ఇచ్చారు. అదేసమయంలో అన్ని వర్గాలనుంచి యువతకు ఎత్తు పీట వేశారు. అలాగే, ముఖ్యమంత్రులకు కూడా స్థానచలనం తప్పదన్న సంకేతాలు ఇచ్చారు. ఒక విధంగా కమల దళంలో తరం మార్పుకు మోడీ శ్రీకారం చుట్టారు.    అలా సంకేతాలు అందుకున్న ముఖ్యమంత్రులలో, కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప ముందువరసలో ఉన్నారని పార్టీ వర్గాల సమాచారం. నిజానికి, యడ్యూరప్పను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించే ప్రయత్నాలు చాలా కాలంగా సాగుతున్నాయి. కేంద్ర నాయకత్వం కూడా అందుకు సుముఖంగా ఉందన్న వార్తలు  చాలా కాలంగా మీడియాలో  చక్కర్లు కొడుతున్నాయి. కేంద్ర మంత్రివర్గ విస్తరణను అవకాశంగా తీసుకుని యడ్డీనిని తప్పించేందుకు అగ్రత్రయం పావులు కదిపిందని సమాచారం. ఇందులో భాగంగానే రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, సదానంద గౌడ్ కేంద్ర మంత్రి వర్గం నుంచి తప్పించి సొంత రాష్ట్రానికి పంపారు, యడియూరప్ప వర్గానికి చెందిన శోభా కరంర్లాజేకి కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పించారు. అలాగే, మరో ఇద్దరు యడ్డీవర్గం ఎంపీలకు కూడా మంత్రి వర్గంలో స్థానం కల్పించారు. ఇక, మిగిలింది, యద్యూరప్పను తప్పించి ఆయన స్థానంలో ఆయన సన్నిహితుడు సదానంద గౌడను ముఖ్యంత్రినే చేయడం మాత్రమే అని పార్టీ వర్గాల సమాచారం. ముఖ్యమంత్రి పీఠం నుంచి తప్పుకున్న వెంటనే యద్యూరప్పను ఆంద్ర ప్రదేశ్ గవర్నర్’గా నియమించేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. గవర్నర్’గా వెళ్లేందుకు యడ్యూరప్పకు ఇష్టం లేక పోయినా, ఒప్పుకోక తప్పని విధంగా అమిత్ షా వ్యూహాత్మకంగా పావులు కదిపినట్లు తెలుస్తోంది. అలాగే, అలా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన వెంటనే ఆయన  చేతిలో ఏపీ గవర్నర్ నియామక పత్రాలు ఉంచేలా ఏర్పట్లు చేసినట్లు తెలుస్తోంది . మరో వైపు ఆంధ్ర ప్రదేశ్ ప్రస్తుత గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పదవీ కాలం ఈనెల 23వ తేదీతో ముగియనుంది. కాబట్టి ఆయన స్థానంలో యడ్యూరప్పను నియమించాలని మోడీ, షా, నడ్డా త్రయం నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.నిజానికి బిశ్వభూషణ్ హరిచందన్’ను గవర్నర్ పదవి నుంచి తప్పిస్తారని, ఇటీవల ఆయన ఢిల్లీ వెళ్ళిన సమయంలోనే పుకార్లు షికారు చేసాయి. అలాగే ఇటీవల నామినేటెడ్  ఎమ్మెల్సీల నియామకం విషయంలో గవర్నర్ వ్యవహరించిన తీరుపట్ల ప్రతిపక్ష టీడీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏపీ గవర్నర్’ గా యడ్యూరప్ప నియామకం విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి అభ్యంతరం ఉండక పోవచ్చుని న్తున్నారు. అంతేకాదు, గాలి జనార్ధన్ రెడ్డి, జగన్ రెడ్డి  యడియూరప్ప ఇద్దరికీ కావలసిన వ్యక్తి,  కామన్ ఫ్రెండ్ కావడంతో యడ్యూరప్ప నియామకం జగన్ రెడ్డి కోసం, ఆయన కోరిక మేరకు జరుగుతోందా  అన్న అనుమానాలు కూడా లేక పోలేదు. అదే జరిగితే తెలుగు దేశం పార్టీ, చంద్రబాబు నాయుడు ఇతర ప్రతిపక్షాలు ఎలా స్పందిస్తాయో  చూడాలి..  

పరిమితికి మించి 17 వేల కోట్ల అప్పు.. జగన్ సర్కార్ కు కేంద్రం చివాట్లు...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చూసి కేంద్ర ఆర్థికశాఖ వర్గాలే అవాక్కవుతున్నాయంటే ఎంతగా దివాళ తీసిందో అర్థం చేసుకోవచ్చు. ఏపీ ఇంతగా అప్పుల్లో కూరుకుపోవడానికి జగన్ రెడ్డి సర్కార్ అస్తవ్యస్థ, అనాలోచిత విధానాలే కారణమనే ఆరోపణలు వస్తుండగా.. మరో సంచలన విషయం వెలుగు చూసింది.  ఏకంగా 41 వేల కోట్ల రూపాయలకు లెక్కలే లేవని తెలుస్తోంది. ఇదే విషయమై రాష్ట్ర ప్రభుత్వానికి కాగ్ లేఖ కూడా రాసింది.   ఏపీ ఆర్థిక పరిస్థితిపై తాజాగా మరో విషయం బయటపడింది. పరిధికి మించి ఏపీ సర్కార్  రూ.17,923.94 కోట్లు అప్పులు చేసిందని తేలింది. దీనికి సంబంధించి ఏపీ ఆర్ధిక శాఖకు కేంద్రం రాసిన మరో లేఖను పీఏసీ ఛైర్మన్ పయ్యావుల విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తోన్న రుణాల విషయంలో అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ ఆర్ధిక శాఖకు కేంద్రం రాసిన లేఖను బయటపెట్టారు. రూ.17,923.94 కోట్లను పరిధికి మించి అప్పులు చేశారంటూ లేఖలో కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిపారు. రుణాలు.. కేంద్ర అభ్యంతరాలపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని పయ్యావుల డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ఆర్ధిక శాఖ వివరణ కోరడంపై ఆర్ధిక శాఖ స్పందించాలన్నారు. రాష్ట్ర ఆర్ధిక వ్యవహారాలు అస్తవ్యస్తంగా ఉన్నాయని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లేఖతో స్పష్టమైందని పేర్కొన్నారు. రాష్ట్రం చేసే ఆర్ధిక తప్పిదాలపై కేందమైనా సమాధానం చెప్పాల్సిందే అని పయ్యావుల స్పష్టం చేశారు.  రాష్ట్రప్రభుత్వం జమ ఖర్చుల నిర్వహణపై గురువారం గవర్నర్ కలిసి పిర్యాదు చేశారు పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్.  నలభైవేల కోట్లకు సరియైన లెక్కలు లేవని ఆరోపించారు. ట్రెజరీ కోడ్ ప్రకారం ప్రభుత్వం లోని ఏ శాఖ అయినా ట్రెజరీ నుండి డబ్బు తీసుకునేటప్పుడు అది ఎందుకు తీసుకుంటున్నామో, దేనికి ఖర్చు పెడుతున్నామో బిల్లులో పేర్కొనాలి. కానీ అలాంటిదేమీ చూపించకుండా జగన్ రెడ్డి ప్రభుత్వంలోని వివిధ శాఖలు ప్రత్యేక బిల్లు అంటూ 10,806 బిల్లుల కింద  రూ.41,043 కోట్లను విత్ డ్రా చేశాయి. ఈ బాగోతాన్ని పక్కా ఆధారాలతో పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ బయటపెట్టారు.  రాష్ట్రప్రభుత్వ ఆర్ధిక నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందని, ఆర్ధిక అవకతవకలు జరిగాయని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు వివరించారు కేశవ్. రాజ్యాంగంలోని ఆర్టికల్ 161, 151/2 లను ప్రస్తావిస్తూ... రాష్ట్రప్రభుత్వ కార్యనిర్వాహక అధిపతిగా రాష్ట్ర ఆర్థిక, జమ ఖర్చుల నిర్వహణపై దృష్టి పెట్టాలని... గత రెండు ఆర్ధిక సంవత్సరాలకు సంబందించిన లెక్కలపై కాగ్ తో స్పెషల్ ఆడిట్ జరిపించాలని గవర్నర్ ను కోరారు. ప్రభుత్వ పద్దుల్లో రూ.41 వేల కోట్ల తప్పుడు లెక్కలు ఉండటం ఎన్నో అనుమానాలకు తావిస్తోంది. పరిధికి మించి తెస్తున్న అప్పులను దారి మళ్లిస్తున్నారనే ఆరోపణలు విపక్షాల నుంచి వస్తున్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కేంద్ర సంస్థలతో సమగ్ర దర్యాప్తు జరిపించాలనే డిమాండ్ వస్తోంది.  

ముందస్తు ఎన్నికలు ఖాయమేనా? కేసీఆర్ జనం బాట అందుకేనా? 

ఫాంహౌజ్ ముఖ్యమంత్రి.. ప్రగతి భవన్ ముఖ్యమంత్రి... జనాలకు అసలు అందుబాటులో ఉండని ముఖ్యమంత్రి.. ఇదీ  కేసీఆర్ పై చాలా రోజులుగా ఉన్న విమర్శ. విపక్షాల నుంచి కాదు జనాల్లోనూ ఇదే అభిప్రాయం వ్యక్తమైంది. ఇందుకు కేసీఆర్ వ్యవహార శైలి కూడా కారణమైంది. రెండోసారి అధికారంలోకి వచ్చాకా గత రెండున్నర ఏండ్లలో ఆయన జనాల్లో తిరిగింది లేనే లేదు. ఉంటే ప్రగతి భవన్ లేదంటే ఫామ్ హౌజ్. సచివాలయంకు వెళ్లే అలవాటు లేని కేసీఆర్.. కొన్ని సార్లు మూడు, నాలుగు వారాల పాటు ఫాంహౌజ్ లోనే ఉన్న సందర్భాలు ఉన్నాయి. జనాలకు కాదు సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఇంకా చెప్పాలంటే మంత్రులకు కూడా ఆయన కలిసే భాగ్యం దక్కలేదని చెబుతారు. ఇటీవలే గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పిన ఈటల రాజేందర్ కూడా ఇవే ఆరోపణలు చేశారు. కేసీఆర్ ను కలిసేందుకు వెళ్లి అపాయింట్ మెంట్ దొరక్క ఎన్నోసార్లు అవమానంతో తలదించుకుని వచ్చామని చెప్పారు ఈటల. ఫాంహౌజ్ ముఖ్యమంత్రిగా ఆరోపణలు ఎదుర్కొన్న కేసీఆర్.. ఇప్పుడు ఒక్కసారిగా రూట్ మార్చారు. ప్రగతి భవన్ నుంచి బయటికి వచ్చి ప్రజల బాట పట్టారు. జూన్ లో నాలుగైదు జిల్లాలు తిరిగారు. కొత్త కలెక్టరేట్లను ప్రారంభిస్తూనే అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ షో చేశారు. యాదాద్రి భవనగిరి జిల్లాలోని వాసాలమర్రిని దత్తత తీసుకుని ఆ గ్రామంలో పర్యటించారు. ప్రగతి భవన్ లోనూ స్పీడ్ పెంచారు కేసీఆర్. వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. నాలుగేండ్లుగా పెండింగులో ఉన్న కొత్త రేషన్ కార్డుల పంపిణికి ఓకె చెప్పారు. రెండేండ్లుగా హామీగానే ఉన్న 57 ఏళ్ల వారికి పెన్షన్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. టీఆర్ఎస్ సర్కార్ కు అతిపెద్ద సమస్యగా ఉన్న ఉద్యోగ కల్పనపైనా కేసీఆర్ ఫోకస్ చేశారు. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 50 వేల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని ఆదేశించారు. దళితుల అభివృద్ధి కోసమంటూ కొత్త పథకాన్ని తీసుకొచ్చారు.  కేసీఆర్ రూట్ మార్చి జనంలోకి వెళ్లడంపై రాజకీయ వర్గాల్లో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ప్రజాగ్రహం పెరిగిందన్న నివేదికల ఆధారంగానే కేసీఆర్ దిగొచ్చారని కొందరు చెబుతుంటే.. త్వరలో జరగనున్న హుజురాబాద్ ఉప ఎన్నిక కోసమే కొత్త ఎత్తులు వేస్తున్నారని మరికొందరు విమర్శిస్తున్నారు. హుజురాబాద్ లో ఓడిపోతే వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం చూపిస్తుందనే భయంలో టీఆర్ఎస్ అధినేత ఉన్నారని అంటున్నారు. ఇక పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాత్రం తనకు పదవి వస్తుందన్న సమాచారంతో కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి బయటికి వచ్చారని చెబుతున్నారు. దాంతో పాటు తాజా మరో బాంబ్ పేల్చారు రేవంత్ రెడ్డి. తెలంగాణలో మరోసారి ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయంటూ సంచలన ప్రకటన చేశారు.  రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కేసీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేస్తారని చెప్పారు రేవంత్ రెడ్డి. 2022 ఆగష్టు 15 తర్వాత కేసీఆర్ ముందస్తు ఎన్నికల కు వెళ్తారన్నారు. అందుకోసమే కేసీఆర్ పర్యటనలతో పేరుతో హంగామా చేస్తున్నారని తెలిపారు. రేవంత్ రెడ్డి ముందస్తు ప్రకటన తెలంగాణ రాజకీయాల్లో మరింత హీట్ పెంచింది. ఇప్పుడంతా దీనిపైనే చర్చ జరుగుతోంది. ఎందుకంటే కేసీఆర్ వ్యూహాలు అలానే ఉంటాయి మరీ. తనపై వ్యతిరేకత పెరిగిందని గుర్తించినా.. ప్రత్యర్థుల ఎత్తులకు అనుగుణంగా ఆయన కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లడం కూడా ఆయనకు బాగా కలిసొచ్చింది. మోడీ క్రేజీ బాగా ఉండటంతో లోక్ సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీకి వెళితే బీజేపీకి ప్లస్ అవుతుందని అంచనా వేసిన కేసీఆర్.. ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. ఆయన అనుకున్నట్లుగానే రెండోసారి అధికారంలోకి వచ్చారు. తర్వాత జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ అనూహ్య ఫలితాలు సాధించింది.  కేసీఆర్ రాజకీయ ఎత్తుగడలు తెలిసినవారంతా ఇప్పుడు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన నిజమే కావచ్చనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంపై రోజు రోజుకు వ్యతిరేకత పెరుగుతుండటం, విపక్షాలు దూకుడుగా వెళుతుండటంతో కేసీఆర్ కూడా వ్యూహాలు మార్చుతున్నారని అంటున్నారు. ఆగస్టులో బండి సంజయ్ పాదయాత్ర చేయబోతున్నారు. రేవంత్ రెడ్డి కూడా పాదయాత్రకు ప్లాన్ చేస్తున్నారు. వైఎస్సార్ టీపీని ఏర్పాటు చేసిన షర్మిల కూడా త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని ప్రకటించారు. ఈ నేపథ్యంలో విపక్షాలకు ఎక్కువ సమయం ఉండకుండా చూసేందుకు కేసీఆర్ ముందస్తు ప్లాన్ చేస్తూ ఉండవచ్చనే అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల నుంచి వస్తోంది. కేసీఆర్ జనంలోకి వెళుతుండటం కూడా ఇందుకు బలాన్నిస్తోందని వాళ్లు చెబుతున్నారు.  తెలుగు రాష్ట్రాల మధ్య ముదురుతున్న కృష్ణా జలాల వివాదం కూడా ఇందులో భాగం కావచ్చనే చర్చ జరుగుతోంది. ఎందుకంటే గత రెండేళ్లుగా ఏపీ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పనులు చేస్తూనే ఉంది. కాని దాని గురించి ఎప్పుడు మాట్లాడని కేసీఆర్.. సడెన్ గా రెచ్చిపోయారు. ఏపీ ప్రాజెక్టులను అడ్డుకోవాలని కేంద్రానికి లేఖలు రాయడంతో పాటు... పవర్ జనరేషన్ చేపట్టారు. శ్రీశైలం ,  సాగర్ లో సరిపడా నీళ్లు లేకున్నా విద్యుత్ ఉత్పత్తి చేయిస్తున్నారు. దీంతో ఇప్పటికే మూడు టీఎంసీలకు పైగా కృష్ణా జలాలు సముద్రం పాలయ్యాయి. కేసీఆర్ అంత మొండిగా ముందుకు వెళ్లడానికి సెంటిమెంట్ రాజకీయాలే కారణమనే ఆరోపణలు వస్తున్నాయి. నీళ్ల సెంటిమెంట్ ను రలిగించి ఎన్నికల్లో లబ్ది పొందాలనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారనే విమర్శలు వస్తున్నాయి. 

మణికొండలో.. మర్డర్.. 

ఒకప్పుడు కోడికూతతో మొదలయ్యే రోజు.. నేటి రోజుల్లో సెల్ ఫోన్ అల్లారం తో తెల్లారుతుంది.. ఒక వ్యక్తి రోజు లాగే మార్నింగ్ వాకింగ్‌ వెళ్ళాడు. అలా నడుస్తూ వెళ్తున్న వ్యక్తి పై ఒక్కసారిగా వెనక నుండు గొడ్డలి వేటు పడింది.. తను వెంటనే అక్కడికక్కడే కుప్పకూలి పడిపోయాడు.. వ్యక్తిని గుర్తు తెలియ‌ని వ్యక్తులు అత్యంత దారుణంగా గొడ్డలితో న‌రికి చంపారు. వాళ్ళు ఎప్పటి నిండి అతన్ని ఫాలో అయ్యారో గాని పధకం వేసి అతని మట్టిలో కలిపేశారు. ఈ దారుణ ఘ‌ట‌న వరంగల్ అర్బన్ జిల్లా కాజిపేట్ మండలం మడికొండ శివారులో శ‌నివారం ఉద‌యం జ‌రిగింది. మడికొండ గ్రామానికి చెందిన వేల్పుల సమ్మయ్య(అల్లం సేట్) అనే వ్యక్తి రాంపేట్ వైపు వాకింగ్‌కు వెళ్లాడు. ఈ స‌మ‌యంలోనే అత‌ని త‌ల‌పై గొడ్డలితో వేటు వేసి దారుణంగా హ‌త్య చేశారు. సమాచారం అందుకున్న మడికొండ పోలీసులు ఘట‌న స్థలాన్ని చేరుకున్నారు. క్లూస్ టీంను రంగంలోకి దింపి.. హత్యకు సంబంధించిన ఆధారాలను సేకరించే ప‌నిలో ఉన్నారు. మృతుని కుటుంబ స‌భ్యుల నుంచి వివ‌రాలు సేక‌రిస్తున్నారు. స‌మ్మయ్య హ‌త్యకు గ‌ల కార‌ణాల‌పై ఆరా తీస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మనుషులు రోజురోజుకి మరి రాక్షసుల్లా మారుతున్నారు..కరోనా వంటి వైరస్ వల్ల ఎప్పుడో పోతామో తెలియని జీవితాన్ని గడుపుతున్న . ఇంకా జనాలకు బుద్ది రావడం లేదు.. పగలు ప్రతీకారాలు మనుసులో పెట్టుకుని పక్క వాళ్ళను చంపుతున్నారు.. ఒక మనిషిని చంపితే అతని పగ ప్రతీకారాలు తీరుతాయా.. ఐన ఒక మనిషిని ఇంకో మనిషి చంపే హక్కు ఎవరు ఇచ్చారు. బతకడం అంటే పగతో ప్రతీకారం తో బతకడం కాదు.. శత్రువు తో కూడా స్నేహంగా ప్రేమ గా బతకడం అని ఈ సమాజం ఎప్పుడు తెలుసుకుంటుందో..   

మరో కొత్త  వైరస్.. పేరు జికా.. మదర్ టంగ్ ఉగాండా.. 

ఒకవైపు కరోనా సెకండ్‌వేవ్‌ శాంతించలేదు ఇంకా తగ్గనే లేదు. మరోవైపు థర్డ్ వేవ్ ముప్పు విరుచుకుపడనుందని నిపుణుల వార్నింగ్ బెల్స్ ఇస్తున్నారు. ఇప్పటికే ప్రపంచాన్ని, దేశాన్ని గుల్ల గుల్ల చేసిన నేపథ్యంలో ఇవి చాలదు అన్నట్లు.. తాజాగా మరో మహమ్మారి పురుడుపోసుకుంది. కేరళలో జికా వైరస్‌ కలకలం సృష్టిస్తోంది. కేరళ ప్రజలను వణికిస్తున్నది.. తిరువనంతపురంలో జికా వైరస్ కేసులు దాదాపు 15 కేసులు  వెలుగులోకి వచ్చాయి. అది కేరళలోని తిరువనంతపురం జిల్లా.  పరస్సలైన్ ప్రాంతానికి చెందిన గర్భిణి. జూన్ 28న జ్వరం, తలనొప్పి, దద్దుర్లతో ఆస్పత్రిలో చేరింది.అక్కడి డాక్టర్స్ కు అంతు పట్టలేదు. ఆమె శాంపిల్స్‌ను పుణెలోని ఎన్‌ఐవీకి పంపించిన తర్వాత.. శాంపిల్ రిపోర్ట్స్ వచ్నిన తర్వాత ఆమెకు జికా వైరస్ సోకినట్టుగా నిర్ధారణ అయింది. అంతే కాదు జూలై 7వ తేదీన ఆ మహిళ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే, ప్రస్తుతం మహిళ పరిస్థితి నిలకడగా ఉందని, ప్రస్తుతానికి ప్రమాదం ఏమిలేదని  వైద్యులు తెలిపారు. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నట్టుగా వైద్యులు చెప్పారు. అయితే వారం రోజుల క్రితం ఆమె తల్లికి కూడా ఇలాంటి లక్షణాలే కనిపించినట్టుగా ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కాగా, బాధితురాలు స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జికా వైరస్ కలకలంతో వెంటనే కేరళ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. తిరువనంతపురం జిల్లాలో జికా వైరస్ కేసులను గుర్తించినట్లు కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ ధ్రువీకరించారు. వైరస్‌ నియంత్రణకు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ మాట్లాడుతూ.. ఆరోగ్య శాఖ, జిల్లా అధికారులు ఈ సమస్యను తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఈడెస్ జాతుల దోమల నమూనాలను సేకరించి చర్యలు తీసుకున్నారు. ఇది దోమ కాటు ద్వారా ప్రజలకు వ్యాపిస్తోంది. దీని గురించి అన్ని జిల్లాలను అప్రమత్తం చేశామన్నారు. కేరళ ప్రజలకు అవగాహనా పరుస్తున్నారు.  కాగా, కేరళ ప్రభుత్వం  అన్ని జిల్లాలకు హెచ్చరికలు జారీ చేశారు. అధికారులు  రంగంలోకి దిగి బాధితుల ట్రావెల్‌ హిస్టరీపై ఆరా తీస్తున్నారు. వారి కాంట్రాక్ట్‌ను ఛేదించే పనిలో పడ్డారు. ఇదిలావుంటే, తిరువనంతపురం జిల్లాలో అనుమానంగా ఉన్న మరో 19 శాంపిల్స్‌కు టెస్టులు నిర్వహించారు. వాటిలో 15 కేసులు జికా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యాయి. అప్పటితో ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. కోవిడ్ -19 రెండవ వేవ్‌తో పోరాడుతున్న కేరళకు ఇప్పుడు అదనపు ఆందోళన కలిగిస్తోంది. కొత్తగా వెలుగుచూసిన జికా వైరస్‌తో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆరుగురు సభ్యుల బృందాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతుగా పంపినట్లు ఉమ్మడి ఆరోగ్య కార్యదర్శి లావ్ అగర్వాల్ శుక్రవారం తెలిపారు. ఇంతకుముందు 2016-17లో గుజరాత్‌లో జికా వైరస్ కేసులు గుర్తించారు. జికా వైరస్ అంటే ఏమిటి? జికా వైరస్ అనేది దోమల ద్వారా పుట్టుకొచ్చే ఫ్లేవి వైరస్ అని , దీనిని ఉగాండాలో 1947 లో కోతులలో గుర్తించారు. ఇది తరువాత 1952 లో ఉగాండాతో పాటు యునైటెడ్ రిపబ్లిక్ ఆఫ్ టాంజానియాలో మానవులలో గుర్తించబడింది. ఆఫ్రికా, అమెరికా, ఆసియా, పసిఫిక్ దేశాలలో జికా వైరస్ వ్యాప్తి చెందింది. 1960 నుండి 1980 వరకు, ఆఫ్రికా, ఆసియా అంతటా మానవ అంటువ్యాధుల అరుదైన కేసులుగా గుర్తించారు. దోమల ద్వారా వ్యాపించే ఈ వైరస్ వల్ల పిల్లల్లో మెదడు పరిమాణం తగ్గిపోవడంతో పాటు గిలన్ బరె సిండ్రోమ్ అనే ఆటో ఇమ్యూన్(రోగ నిరోధక వ్యవస్థ శరీరంలోని కణాలపైనే దాడి చేయడం) వ్యాధి వచ్చే అవకాశమూ ఉంటుంది. పగటిపూట సంచరించే ఈడెస్ దోమల నుంచి ఈ వ్యాధి వ్యాపిస్తుంది. ఈ వ్యాధి కక్షణాలు  జ్వరం, దద్దుర్లు, కండ్లకలక, కండరాలు, కీళ్ల నొప్పులు, అనారోగ్యం, తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు సాధారణంగా 2నుంచి 7 రోజుల పాటు ఉంటాయి. దోమ కాటు ద్వారానే ఈ వైరస్ ఎక్కువగా వ్యాపిస్తుంది. ఐతే ఈ వైరస్ వాళ్ళ ఎక్కవ ప్రమాదం ఏం ఉండదని. ఈ జికా వైరస్‌తో సాధారణంగా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉండవని..విశ్రాంతి తీసుకుంటే ఈ వ్యాధి పూర్తిగా నయమవుతుందని అంటున్నారు వైద్యులు. అయితే, వైరస్ లో కొత్త చిక్కు ఉంది అది ఏంటంటే  గర్భిణీ స్త్రీలకు సోకితే, పుట్టే పిల్లలపై ప్రభావం చూపిస్తుందని..వారిలో అనేక లోపాలకు దారితీయవచ్చని చెబుతున్నారు.