షర్మిల పార్టీ వెనకున్నది ఎవరో తెలుసా..?
posted on Jul 8, 2021 @ 3:30PM
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ పెట్టారు. పార్టీ పేరును వైఎస్సార్ టీపీగా అధికారికంగా ప్రకటించారు. పార్టీ జెండా, అజెండాను వెల్లడించారు. అయితే ఏపీ సీఎం సోదరి తెలంగాణలో పార్టీ పెట్టడంపై మొదటి నుంచి అనుమానాలున్నాయి. ఆమె వెనక ఎవరో ఉండి ఇదంతా నడిపిస్తున్నారనే ప్రచారం ఉంది. అన్న జగన్ డైరెక్షన్ లోనే షర్మిల కొత్త పార్టీ పెట్టారని కొందరు వాదిస్తే... జగన్ తో విభేదాలు రావడం వల్లే చెల్లె సొంత దారి చూసుకుందని మరికొందరు చెప్పారు. విజయమ్మతో పాటు గతంలో వైసీపీలో చేసిన నేతలే షర్మిల వెంట ఉండటంతో కుటుంబ సభ్యుల సపోర్ట్ ఆమెకు ఉందనే అభిప్రాయమే మెజార్టీ వర్గాల్లో వ్యక్తమైంది.
షర్మిల పార్టీపై రాజకీయ రగడ కూడా జరిగింది. ప్రభుత్వ వ్యతిరేకత ఓట్లు చీల్చేందుకు కేసీఆరే.. జగన్ తో కలిసి షర్మిలతో తెలంగాణలో పార్టీ పెట్టించారని కొన్ని సంఘాలు ఆరోపించాయి. కాంగ్రెస్ కు బలమైన వర్గంగా ఉన్న రెడ్డి సామాజిక వర్గాన్ని చీల్చే కుట్ర ఇందులో ఉందనే చర్చ జరిగింది. బీజేపీనే షర్మిల వెనకుండి కొత్త పార్టీని నడిపిస్తుందనే వాదన వచ్చింది. షర్మిలకు పడే ఓట్లలో ఎక్కువగా ముస్లిం, క్రిస్టయన్ మద్దతుదారులే ఉంటారనే అంచనా ఉంది. అవన్ని బీజేపీకి దూరంగా ఉండే వర్గాలే. సో.. తమ వ్యతిరేక ఓటు బ్యాంకు చీలేలా కమలం పార్టీ షర్మిలతో గేమ్ ఆడిస్తుందని , ఇందుకు జగన్ సపోర్ట్ ఉందని కొందరు చెప్పారు. కాంగ్రెస్ ఓట్లు బ్యాంక్ లక్ష్యంగానే బీజేపీ స్కెచ్ వేసిందని కొందరు హస్తం నేతలు కూడా కామెంట్ చేశారు.
తాజాగా షర్మిల పార్టీ అధికారిక ప్రకటన రోజునే .. కాంగ్రెస్ సీనియర్ నేత, తెలంగాణ పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ , మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ సంచలన విషయాలు చెప్పారు. కాంగ్రెస్ కు ఓటు బ్యాంకుగా ఉన్న ముస్లిం, క్రిస్టియన్ ఓట్లను చీల్చడానికే బీజేపీనే.. షర్మిలతో పార్టీ పెట్టించిందని ఆయన ఆరోపించారు. ఢిల్లీలో కూర్చుని అమిత్ షానే ఇదంతా నడిపిస్తున్నారని చెప్పారు. ఏపీ సీఎం జగన్ కు కూడా ఇందులో పాత్ర ఉందన్నారు మధుయాష్కీ. రాష్ట్రంలో కాంగ్రెస్ బలపడకుండా ఉండేందుకు కేసీఆర్ కూడా వీళ్లకు సహకరిస్తున్నారని ఆరోపించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా, ఎన్ని కొత్త పార్టీలు వచ్చనా తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా ఎవరూ ఆపలేరన్నారు మధుయాష్కీ.
కాంగ్రెస్ యువ నేత రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితంగా ఉండే, ఢిల్లీ రాజకీయ వర్గాలతో మంచి సంబంధాలున్న మధుయాష్కీ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారాయి. కాంగ్రెస్ లక్ష్యంగానే షర్మిల పార్టీ వచ్చిందనే అభిప్రాయమే రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపిస్తోంది. అయితే షర్మిలతో పార్టీని కేసీఆర్ పెట్టించారా.. మధుయాష్కీ ఆరోపించినట్లు బీజేపీ ఉందా.. లేక షర్మిలే సొంతంగా అడుగులు వేస్తుందా అన్నది తేలాలంటే మరికొంత సమయం ఆగాల్సిందే..