వైఎస్సార్‌టీపీ వర్సెస్ వైఎస్సార్‌పార్టీ.. రంజుగా వైఎస్ రాజకీయం!
posted on Jul 8, 2021 @ 6:44PM
వైఎస్ రాజశేఖర్‌రెడ్డి. దివంగత ముఖ్యమంత్రి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌పై చెరగని ముద్ర. ఎప్పుడో 11ఏళ్ల క్రితం చనిపోయిన నాయకుడు.. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ యాక్టివ్ రోల్ ప్లే చేస్తుండటం ఆశ్చర్యకరమే. వైఎస్సార్ బొమ్మ చూపించి.. ఆయన కొడుకు జగన్మోహన్‌రెడ్డి ఏపీలో అధికారంలోకి వచ్చారు. అన్నను చూసి.. సేమ్ టూ సేమ్ అలానే తానూ ముఖ్యమంత్రి కావాలంటూ తెలంగాణలో కొత్త జెండా ఎత్తారు షర్మిల. అన్న వాడిన కలర్లే వాడి.. జెండాలో వైఎస్సార్ బొమ్మ పెట్టి.. పార్టీకీ వైఎస్సార్ పేరుపెట్టి.. రాజన్న రాజ్యం తీసుకొస్తానంటూ.. అట్టహాసంగా..హంగామాగా.. సినిమా ఫంక్షన్ మాదిరి.. అదిరిపోయే ఎంట్రీ ఇచ్చారు వైఎస్ షర్మిల. ఓ మీడియా సహకారంతో ఆ ఈవెంట్‌ను గ్రాండ్ సక్సెస్ చేశారు.
షర్మిల ఆశ, ఆశయం ఒక్కటే. తండ్రి పేరు చెప్పి.. రాజకీయ ఫలాలు పొందాలనేదే ఆమె వ్యూహం. అందుకే, వైఎస్సార్ పేరును పదే పదే ఉచ్చరిస్తూ.. తెలంగాణవాదులు ఎప్పుడో మర్చిపోయిన వైఎస్సార్‌ను పదే పదే గుర్తు చేస్తూ.. తన వ్యూహం, తన బలం, తన బలగం ఏమిటో సూటిగానే స్పష్టం చేశారు వైఎస్ షర్మిల. త్రి పాయింట్ ఎజెండా అంటూ.. సంక్షేమం, స్వయంసమృద్ధి, సమానత్వం.. అంటూ ఏవేవో ఆశయాలు చెప్పినా.. వైఎస్సార్‌ను చూసి, ఆయన పనితీరును చూసి.. ఆయన బిడ్డనైన తనకు ఓటేయమంటూ నేరుగానే అడిగారు షర్మిల. అక్కడ ఏపీలో జగన్‌రెడ్డి సైతం అంతే.. వైఎస్సార్ పాలన తీసుకొస్తా.. తనకు ఒక్క ఛాన్స్ ఇవ్వండంటూ అందలమెక్కారు. అన్న లానే తననూ నమ్మేస్తారని.. అన్నలానే తననూ సీఎం చేసేస్తారనేది ఆమె ఆశ. అది అడియాశా కాదా అనేది ముందుముందు తేలుతుంది.
అయితే.. ఏపీలో వైఎస్సార్ బొమ్మ చూపించి ఓట్లు దండుకున్నంత ఈజీగా తెలంగాణలో ఓట్లు రాలవనేది ఇక్కడి వారి మాట. తెలంగాణలో రాజకీయ చైతన్యం ఎక్కువ. సెంటిమెంట్ మరింత ఎక్కువ. వైఎస్సార్‌ను కాంగ్రెస్ నేతగానే చూస్తారు తెలంగాణవాదులు. ఆయన అమలు చేసిన ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ ఇళ్లు, ఫీ రీయింబర్స్‌మెంట్‌లాంటి పథకాల లబ్దిదారులు ఇప్పటికీ ఆయన్ను తలుచుకుంటారు. తెలంగాణలో వైఎస్సార్ అభిమానులు ఎక్కువే అయినా.. వారంతా కాంగ్రెస్‌వాదులుగానే ఉన్నారు. అయితే, వైఎస్సార్ మీద తెలంగాణ వ్యతిరేకి అనే ముద్ర కూడా బలంగా ఉంది. తాను తెలంగాణకు అడ్డు కాదు, పొడవు కాదు అంటూనే.. ఆయన బతికున్నంత కాలం తెలంగాణను అడ్డుకున్న వైనం అందరికీ తెలిసిందే. అలాంటి.. తెలంగాణ వ్యతిరేకి పేరు మీదుగానే పార్టీ పెట్టడం.. ఆయన బొమ్మ పెట్టుకొని మరీ ప్రజల ముందుకు వస్తుండటం.. షర్మిలకు సవాలే. అయితే, తెలంగాణవాదులు వైఎస్సార్‌ను సంక్షేమకర్తగా గుర్తుపెట్టుకున్నారా? లేక, తెలంగాణ ద్రోహిగా గుర్తుపెట్టుకున్నారా? అనే దానిపైనే ఆమె రాజకీయ భవిష్యత్తు డిపెండ్ అయి ఉంటుంది.
ఏపీలో వైఎస్సార్‌ను చూసి జగన్ వెంట నడిచినట్టు.. ఇక్కడ వైఎస్సార్ కూతురు అయినంత మాత్రాన షర్మిలకు ఆయన అభిమానులంతా సపోర్ట్ చేస్తారని చెప్పలేం. ఎందుకంటే, వైఎస్సార్.. కాంగ్రెస్ లీడర్‌గానే ఇక్కడ పాపులర్. వైఎస్సార్ అభిమానులు కాంగ్రెస్ వెంటే ఉన్నారు. ఒకవేళ షర్మిల వైపు వెళ్దామనుకున్నా.. ఇప్పుడు రేవంత్‌రెడ్డి ఎంట్రీతో ఆ ఛాన్స్ కూడా లేకుండా పోయినట్టైంది. రేవంత్ సైతం వ్యూహాత్మకంగా పదే పదే వైఎస్సార్ నామస్మరణ చేస్తున్నారు. వైఎస్సార్‌ను తిడితే కుష్టురోగం వస్తుందని కూడా శాపనార్థాలు పెట్టారు. మునుపెన్నడూ లేనివిధంగా వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతిని కాంగ్రెస్ పార్టీ ఘనంగా జరిపింది. ఇదంతా షర్మిల పార్టీ ఎఫెక్ట్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇలా.. వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుడేననే విషయం మరోసారి బలవంతంగా ప్రజలకు గుర్తు చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణలో వైఎస్సార్ రాజకీయ వారసత్వం కాంగ్రెస్‌కే సొంతమన్నట్టు రేవంత్‌రెడ్డి వైఎస్సార్ విషయంలో సెంటిమెంట్ రాజేస్తున్నారు.
ఇలా.. ఇటు షర్మిల, అటు రేవంత్‌రెడ్డిలు.. తెలంగాణ రాకముందే చనిపోయిన వైఎస్సార్‌ను.. తెలంగాణలోనే ఆదర్శ నేతగా కీర్తిస్తూ.. ఎవరికి వారే ప్రయోజనం పొందాలని ప్రయత్నిస్తుండటంతో తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు వైఎస్సార్ నామజపంతో ఆసక్తికరంగా మారాయి.