రేవంత్ రెడ్డా.. కోవర్ట్ రెడ్డా? ఎమ్మెల్యే రోజా హాట్ కామెంట్స్..
posted on Jul 9, 2021 @ 3:09PM
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నీటి వివాదం కొనసాగుతోంది. ఇరు రాష్ట్రాల మంత్రులతో పాటు వివిధ పార్టీల నేతలు ఘాటు వ్యాఖ్యలు చేస్తూ కాక రేపుతున్నారు. తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కేసీఆర్, జగన్ ను టార్గెట్ చేస్తూ ఆరోపణలు చేశారు. జల వివాదం పేరుతో రాజకీయ డ్రామా ఆడుతున్నారని మండిపడ్డారు. రోజా ఇంట్లో కేసీఆర్, జగన్ చర్చలు జరిపారని అన్నారు. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా కౌంటరిచ్చారు. ’మా ఇంట్లో సీఎం కేసీఆర్, జగన్ ల మంతనాలు జరిగాయని రేవంత్ రెడ్డి అంటున్నారనీ, జగన్ మా ఇంటికి ఎప్పుడు వచ్చాడో రేవంత్ రెడ్డి నిరూపించాలని’ ఎమ్మెల్యే రోజా సవాల్ విసిరారు.
కేసీఆర్ దైవ దర్శనం కోసం తమిళనాడుకు వెళ్తూ మార్గం మధ్యలో ఉన్న మా ఇంటికి వచ్చారే తప్ప ఎలాంటి మంతనాలు జరగలేదని రోజా స్పష్టం చేశారు. ఆయన రేవంత్ రెడ్డా, కోవర్ట్ రెడ్డో ముందు చెప్పాలని అన్నారు. రేవంత్ రెడ్డి చేస్తున్న రాజకీయం చూస్తుంటే రేవంత్ రెడ్డి ఒక కోవర్ట్ రెడ్డి అని అర్థమవుతోందన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడాల్సింది కేంద్ర ప్రభుత్వమేననీ, జలవివాదం పరిష్కరించాల్సింది కేంద్రమే కాబట్టి సీఎం జగన్ ప్రధాని మోడీకి, జలశక్తి మంత్రికి లేఖ రాశారని చెప్పారు.
దేశంలోనే వెనుకబడిన ప్రాంతానికి నీళ్లు రాకుండా అడ్డుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని ఎమ్మెల్యే రోజా ఆవేదన వ్యక్తం చేశారు. జల వివాదంలో అనవసరంగా వాగుతున్నవారి విజ్ఞతకే ఆ విషయాన్ని వదిలేస్తున్నానని అన్నారు. తమ హయాంలో నీటి వివాదాలే లేవని చంద్రబాబు, లోకేష్ అంటున్నారని, టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రా, తెలంగాణ పోలీసులు కొట్టుకున్న విషయాన్ని మర్చిపోయారా అని గుర్తు చేశారు. టీడీపీ జగన్ ప్రభుత్వాన్ని విమర్శించడం చూస్తుంటే.. దెయ్యాలు వేదాలు వళ్లించినట్లు ఉందని వ్యాఖ్యానించారు.