నిమిషానికి 11 చావులు.. కరోనా కన్నా ఆకలి వైరసే డేంజర్
posted on Jul 9, 2021 @ 4:21PM
కరోనా మహమ్మారి 20 నెలలుగా ప్రపంచాన్ని వణికిస్తోంది. రూపం మార్చుకుంటూ విజృంభిస్తూ మరణ మృదంగం మోగిస్తోంది. కరోనా కాటుకు ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే లక్షలాది మంది చనిపోయారు. కోట్లాది మంది బాధితులుగా మిగిలిపోయారు. ఇంకా కరోనా వైరస్ విలయం కొనసాగుతూనే ఉంది. ఇటీవలే ఇండియాలో కల్లోలానికి కారణమైన డెల్టా వేరియంట్.. ఇప్పుడు అమెరికా సహా పలు దేశాలను గజగజలాడిస్తోంది. కరోనా మహమ్మారితో నిమిషానికి ఏడుగురు చనిపోతున్నట్లు వివిధ దేశాలు వెల్లడిస్తున్న రిపోర్టుల ఆధారంగా తెలుస్తోంది.
కరోనా కంటే మరో డేంజర్ వైరస్ ప్రపంచంలో ఉందని తాజాగా వెల్లడైంది. ఆ వైరస్ తో నిమిషానికి 11 మంది ప్రాణాలు కోల్పోతున్నారని తేలింది. ఆ వైరస్ మరేదో కాదు ఆకలి. అవును తినడానికి తిండి లేక ప్రపంచ వ్యాప్తంగా నిమిషానికి 11 మంది చనిపోతున్నారని ఒక నివేదిక వెల్లడించింది. ‘ద హంగర్ వైరస్ మల్టిప్లైస్ (ఆకలి వైరస్ అధికమైంది)’ పేరిట విడుదల చేసిన ఆ నివేదికలో ఇంకా అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి.పేదరిక నిర్మూలన కోసం పనిచేస్తున్న ఆక్స్ ఫాం అనే సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం నిమిషానికి 11 మంది ఆకలికి తట్టుకోలేక, తినడానికి తిండి లేక చనిపోతున్నారు.
ఈ ఏడాది కరోనా తెచ్చిన కష్టంతో ప్రపంచంలోని 15.5 కోట్ల మంది తీవ్రమైన ఆహార సంక్షోభంలో కూరుకుపోయారని తెలిపింది. గత ఏడాదితో పోలిస్తే ఆ సంఖ్య 2 కోట్లు పెరిగిందని ఆందోళన వ్యక్తం చేసింది. ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న వారిలో 66 శాతం మంది సైనిక సంక్షోభంలో చిక్కుకున్న దేశంలోని వారేనని తెలిపింది. కరోనా, లాక్ డౌన్ లతో ముదిరిన ఆర్థిక సంక్షోభానికి తోడు యుద్ధ సంక్షోభంతో దాదాపు 5.2 లక్షల మంది ఆకలి చావులకు గురయ్యారని ఆక్స్ ఫాం ఆవేదన వ్యక్తం చేసింది.
చాలా దేశాలు కరోనా ఉన్నా తమ తమ బలగాల పటిష్ఠత కోసం 5,100 కోట్ల డాలర్లను ఖర్చు చేశాయని, అది ప్రపంచంలోని పేదల ఆకలి తీర్చేందుకు ఐక్యరాజ్యసమితి ఖర్చు చేయాలనుకున్న దాని కన్నా ఆరు రెట్లు ఎక్కువని వెల్లడించింది. ఆఫ్ఘనిస్థాన్, ఇథియోపియా, దక్షిణ సూడాన్, సిరియా, యెమన్ వంటి యుద్ధ సంక్షుభిత దేశాల్లో ఆకలి చావుల తీవ్రత చాలా ఎక్కువగా ఉందని నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. మహమ్మారి వల్ల విధించిన లాక్ డౌన్ లతో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని, దాంతో ఆహార పదార్థాల ధరలు ప్రపంచవ్యాప్తంగా 40 శాతం వరకు పెరిగాయని, అది ఈ దశాబ్దంలోనే అత్యంత ఎక్కువని ఆవేదన చెందింది. అది కూడా నిరుపేదలను ఆకలి రాజ్యంలోకి నెట్టేసిందని ఆక్స్ ఫాం నివేదికలో వెల్లడించింది.