ఎస్టీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు మళ్లింపు! జగన్ రెడ్డిపై దళిత, గిరిజన సంఘాల ఫైర్
posted on Jul 9, 2021 @ 12:04PM
జగన్ రెడ్డి ప్రభుత్వ అస్తవ్యస్థ విధానాలు, అనాలోచిత నిర్ణయాలతో పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఖజానా ఖాళీ కావడంతో ఏం చేయాలో తెలియక అడ్డదారులు తొక్కుతోంది. రూల్స్ కు విరుద్దంగా ఇతర శాఖల నిధులను అడ్డగోలుగా వాడేస్తోంది జగన్ సర్కార్. ఎన్‌ఎస్‌ఎఫ్‌డీసీ నిధులను నవరత్నాలకు మళ్లించింది. ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల నుంచి రూ.4341 కోట్లు, ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల నుండి రూ.662 కోట్లు అమ్మఒడికే దారి మళ్లించారని తేలింది.
సబ్ ప్లాన్ నిధులను మళ్లించడం వివాదాస్పదమవుతోంది. జగన్ రెడ్డి సర్కార్ తీరుపై దళిత, గిరిజన సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఎన్‌ఎస్‌ఎఫ్‌డీసీ నిధులను నవరత్నాలకు మళ్లించే హక్కు జగన్‌కు ఎవరిచ్చారని టీడీపీ నేత వర్ల రామయ్య ప్రశ్నించారు. షెడ్యూల్డ్ కులాల కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్లను భ్రష్టు పట్టించిన సీఎంగా జగన్ చరిత్రలో నిలిచిపోతారని విమర్శించారు. రాజ్యాంగ పరంగా దళితులకు, గిరిజనులకు కేంద్రం నుండి వస్తున్న నిధులకు కూడా వైఎస్ ఆర్ పేరు తగిలించి సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నారని వర్ల రామయ్య మండిపడ్డారు.
సబ్ నిధులతో తెలుగుదేశం హయాంలో చంద్రబాబు నాయుడు దళితులకు స్వయం ఉపాధి కల్పిస్తే జగన్ రెడ్డి మాత్రం ముష్టి విసిరినట్లు విసురుతున్నారన్నారు రామయ్య. చంద్రబాబు నాయుడు దళితులకు జేసీబీలు, ఇన్నోవా కార్లు, ట్రాక్టర్లు, వాహనాలు ఇచ్చి వారి సాధికారతను సాయం చేస్తే జగన్ మాత్రం జేసీబీలు పెట్టి కూల్చడమే పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కులానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేశానని చెబుతున్న జగన్ రెడ్డి ఆ కార్పోరేషన్ల నుంచి ఒక లోన్ అయినా ఇచ్చారా అని ప్రశ్నించారు.
తెలుగుదేశం పాలనలో 2018-19లో బడ్జెట్ కేటాయింపుల్లో ఎస్సీ వర్గాల అభ్యున్నతికి రూ.14,367 కోట్లు కేటాయించి 90 శాతం ఖర్చు చేశామని వర్ల రాయ్య గుర్తుచేశారు. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఆర్భాటంగా రూ.15 వేల కోట్లు కేటాయించి... ఖర్చు చేసింది కేవలం రూ. 4,700 కోట్లు మాత్రమేనని చెప్పారు. 2020-21 బడ్జట్‌లో కూడా ఎస్సీ సంక్షేమానికి రూ.15,735 కోట్లు కేటాయించామని అబ్బదాలు చెబుతూ నవరత్నాలకు కూటాయించిన రూ.7525 కోట్ల కలిపి చూపించారన్నారు. 2021-22లో కూడా నవరత్నాలకు కేటాయించిందే దళిత సంక్షేమం కింద లెక్కకట్టి మాయల పకీర్ లెక్కలు చెబుతున్నారని వ్యాఖ్యానించారు. జగన్ రెడ్డి చెప్పే మోసపు లెక్కలు విని మోసపోవడానికి దళితులు సిద్ధంగా లేరని స్పష్టం చేశారు. చట్టపరంగా దళితులకు రావాల్సిన నిధులకు పేర్లు తగిలించడం మాని కార్పొరేషన్ల ద్వారా ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో దళితులందరూ సంఘటితంగా ప్రభుత్వ దళిత వ్యతిరేక చర్యలకు నిరసనగా పోరాడుతారని వర్ల రామయ్య హెచ్చరించారు.