అవును.. ఆ ఇద్దరు ఒకటయ్యారు! అన్న బండారం బయటపెట్టిన చెల్లె..
posted on Jul 9, 2021 @ 4:46PM
వైఎస్సార్ టీపీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, ఇలా పార్టీ పేరు ప్రకటించి, అలా జెండా ఎగరేసారో లేదు, జగనన్నపై తొలి బాణం వేశారు. అయితే ఆమె తెలిసి, ఈ బాణం సంధించారా, లేక అసలు సమస్యను పక్కదారి పట్టించేందుకే ఈ వ్యాఖ్య చేశారా, అన్నది అలా ఉంచితే, ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య సాగుతున్న జల వివాదానికి సంబదించి షర్మిలా చేసిన మూడు ముక్కల వ్యాఖ్య, జగనన్నను అష్ట దిగ్బంధనం చేసింది.
వైఎస్సార్ టీపీ ఆవిర్భావ సభలో షర్మిల, ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతలకు దారి తీస్తున్న జల వివాదం అంశాన్ని ప్రస్తావిస్తూ, ఇద్దరు ముఖ్యమంత్రులు రెండు నిమిషాలు కూర్చొని మాట్లాడుకోలేరా..? జల వివాదాన్ని పరిష్కరించుకోలేరా..? అని ప్రశ్నించారు. అంతే అయితే అది అలా కొట్టుకుపోయేదేమో కానీ, ఆమె గతంలో ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి చేసుకున్న విందులు వినోదాల వివరాలతో పాటుగా,ఇద్దరు కలిసి ఉమ్మడి శత్రువు (చంద్రబాబు)ను ఓడించారని అన్నారు. ఆ విధంగా ఆమె కేసీఆర్, జగన్ రెడ్డి మధ్య ఉన్న సీక్రెట్ లవ్ అఫ్ఫైర్, ను బయట పెట్టార్టు. అంటే, గత ఎన్నికలలో ఇద్దరికీ ఉమ్మడి శత్రువు చంద్రబాబు నాయుడుని ఓడించేందుకు ఆ ఇద్దరూ ఒక టయ్యారని షర్మిల్ చెప్పకనే చెప్పారు.
నిజానికి, ఇది కొత్త విషయం కాదు, 2019 ఎన్నికల్లో చంద్రబాబును ఓడించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వైసీపెకి,జగన్ రెడ్డికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించారని, అనేక సందర్భాలలో వివిధ పార్టీల నాయకులు విమర్శించారు. అలాగే, ఎన్నికల తర్వాత ఇద్దరు ముఖ్యమంత్రులు, అవును ఆ ఇద్దరూ ... అనుకునేలా చెట్టాపట్టాలేసుకు తిరిగారు. విందులు, వినోదాలు, కౌగిలింతలు, శాలువలు, బొకేలు, పూలదండలు, ఫ్యామిలీ మీట్స్ ఒకటేమిటి, అనేక రకాలుగా ఒకటిగా కలిసి పోయారు. అయితే ఇప్పుడు అదే ఆరోపణ జగనన్న వదిలిన బాణం షర్మిల నోటి నుంచి రావడంతో టీడీపీ ఆరోపణలకు బలం చేకూరింది. అందుకే, ఇప్పుడు షర్మిల ప్రశ్నకు సమాధానం చెప్పమని ఏపీ టీడీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. చంద్రబాబును ఓడించేందుకు 2019ఎన్నికలకు ముందు నుంచే కేసీఆర్ వ్యూహత్మకంగా జగన్ తో చేతులు కలిపారు. ఒక దశలో తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్, ఏపీకి వచ్చి మరీ రిటన్ గిఫ్ట్ ఉంటుందని చంద్రబాబుపై కామెంట్స్ చేశారు. ఆ సమయంలో టీడీపీ, టీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది. అప్పటి నుంచే చంద్రబాబును ఓడించేందుకు పథక రచన చేశారని షర్మిల వ్యాఖ్యలే దానికి నిదర్శనమని టీడీపీ నాయకులు అంటున్నారు. ఎన్నికల సమయంలో జగన్’కు కేసీఆర్ డబ్బులు పంపారని టీడీపీ మొదట్నుంచి ఆరోపిస్తోంది. ఇప్పుడు షర్మిల చేసిన ఒక్క కామెంట్ తో అది రుజువైందని అంటున్నారు విశ్లేషకులు.
షర్మిల చేసిన ఈ ఒక్క కామెంట్ పై తెలుగురాష్ట్రాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. కుట్ర చేసి చంద్రబాబును ఓడించారని టీడీపీ వర్గాలు అంటున్నాయి. వైసీపీ శ్రేణులు సామెతల చాటున సమాధానం దాట వేస్తున్నారు. టీడిపి ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ అయితే, తెలుగు రాష్ట్రాల మధ్య తలెత్తిన జల వివాదం పై ముఖ్యమంత్రి వద్ద షర్మిల అడిగిన ప్రశ్నకు సమాధానం ఉందా అంటూ ప్రశ్నించారు. పార్టీ పుట్టి పుట్టక ముందే షర్మిల చేసిన వ్యాఖ్యలు ఇంత దుమారం సృష్టిస్తే, ముందుముందు ఇంకెంత రచ్చ చేస్తాయో అన్నమాట రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.
అయితే, అదే సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ... వైఎస్ షర్మిల ఒకే తల్లి బిడ్డలు ...అనే విషయం మరిచి పోరాదని, అలాగే వైఎస్సార్ సీపీ, వైఎస్సార్ టీపీ.. కూడా ఒకే దేవుని బిడ్డలు అనే నిజాన్ని, మరిచి పోరాదని కూడా రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అలాగే, షర్మిల పార్టీ వెనక ముందు ఎవరు న్నారు అనే ప్రశ్నకు ఇంకా స్పష్టమైన సమాధానం రాలేదన్న విషయాన్ని విస్మరించరాదని విశ్లేషకులు అంటున్నారు.చూడాల్సింది చాలా వుంది