రేవంత్ రెడ్డి తొలి పోరాటం ఎక్కడో తెలుసా?
posted on Jul 9, 2021 @ 12:42PM
తెలంగాణ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ లీడర్ గా పేరున్న ఎంపీ రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా మరింత దూకుడు పెంచారు. తనకు పదవి ప్రకటించినప్పటి నుంచే సంచలన కామెంట్లతో కాక రేపిన రేవంత్ రెడ్డి.. బాధ్యతలు తీసుకున్న వెంటనే జరిగిన సభలనూ తన స్టాండ్ ఏంటో చెప్పేశారు. అటు ప్రధాని మోడీని, ఇటు సీఎం కేసీఆర్ ను ఏకి పడేశారు. రెండు పార్టీల టార్గెట్ గా తన ఉద్యమం ఉండబోతుందని చెప్పారు. అంతేకాదు తర్వాత రోజే పీసీసీ కమిటీతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణ రూపొందించారు. వివిధ ప్రజా సమస్యలపై దశలవారీగా పోరాడాలని నిర్ణయించారు. అందులో భాగంగానే టీపీసీసీ చీఫ్ గా తొలి పోరాటానికి సిద్ధమవుతున్నారు రేవంత్ రెడ్డి.
రేవంత్ రెడ్డి తొలి పోరాటం ఏ సమస్యపై, ఎక్కడి నుంచి మొదలు పెడతారనే ఆసక్తి కాంగ్రెస్ కేడర్ తో పాటు జనాల్లో కనిపిస్తోంది. అయితే రేవంత్ రెడ్డి తొలి ఉద్యమం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రారంభించబోతున్నారు. ఈ నెల 12న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాని నిర్మల్ లో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆందోళన కార్యక్రమం నిర్వహించబోతున్నారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. పీసీసీ చీఫ్ గా తన తొలి ఉదయాన్ని సైకిల్ పై మొదలుపెట్టబోతున్నారు రేవంత్ రెడ్డి. పెరిగిన పెట్రో ధరలకు నిరసనగా ఆయన సైకిల్ ర్యాలీ జరపనున్నారు. పెరిగిన పెట్రోల్ ధరలకు నిరసనగా జులై 12 సోమవారం రోజున దేశ వ్యాప్తంహా సైకిల్ ర్యాలీకి ఏఐసీసీ పిలుపునిచ్చింది.ఏఐసీసీ పిలుపుగా భాగంగా తెలంగాణలోనూ సైకిల్ ర్యాలీలు నిర్వహించబోతున్నారు. ఏఐసీసీ కార్యక్రమాల పర్యవేక్షణ కమిటి చైర్మన్ గా ఉన్న ఏలేటి మహేశ్వర్ రెడ్డి సొంత నియోజకవర్గం నిర్మల్ లో జరగనున్న ఆందోళనలో రేవంత్ రెడ్డి పాల్గొనబోతున్నారు.
నిర్మల్ లో ఐదు కిలోమీటర్ల మేర పీసీసీ రేవంత్ రెడ్డి సైకిల్ ర్యాలీలో పాల్గొంటారు. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డిగారు బాధ్యతలు చేపట్టిన తర్వాత జరుగుతున్న మొట్టమొదటి నిరసన కార్యక్రమం ఇది. నిర్మల్ నుంచే రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు ఆయన శంఖారావం పూరించబోతున్నారు. అదే సమయంలో అన్ని జిల్లా కేంద్రాలలో ఆయా జిల్లాల డీసీసీ అధ్యక్షులు, ఉమ్మడి జిల్లా ఇంఛార్జిలు, ముఖ్యనాయకులతో సమన్వయం చేసుకుని ఈ నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని పీసీసీ నిర్ణయించింది. ప్రధాన పట్టణాలలో ఐదు కిలోమీటర్ల మేర సైకిల్ ర్యాలీలు తీయనున్నారు.ఈ ర్యాలీలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు అందరూ పాల్గొని విజయవంతం చేయబోతున్నారు. ఆందోళన కార్యక్రమాలకు సంబంధించి అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్ కు ఇంఛార్జీలను నియమించారు.