నువ్వు ఏమైనా పోటుగాడివా.. రైతుపై వైసీపీ ఎమ్మెల్యే దాష్టికం..
posted on Jul 9, 2021 @ 10:41AM
ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ ఎమ్మెల్యేల అరాచకాలు ఆగడం లేదు. తమ సమస్యలపై ప్రశ్నించిన వారిపై ప్రతాపం చూపిస్తున్నారు. తన బాధను చెప్పుకున్న రైతుపై వైసీపీ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు తీవ్ర స్థాయిలో ఊగిపోయారు. " నువ్వు ఏమైనా పోటుగాడివి అనుకుంటున్నావా" అంటూ కోపంతో రైతుపై ఎమ్మెల్యే నాగేశ్వరరావు మండిపడ్డారు. ఈ ఘటనతో స్థానికులు షాకయ్యారు.
పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం ఇరగవరం మండలంలోని అర్జునపాలెం గ్రామంలో రైతులపై ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు దినోత్సవ కార్యక్రమం గ్రామంలో జరిగింది. ఈ సందర్భంగా ఈ కార్యరక్రమంలో ఎమ్మెల్యే నాగేశ్వరరావు పాల్గొన్నారు. మూడు నెలలుగా తనకు ధాన్యం డబ్బులు పడలేదని ఎమ్మెల్యే నాగేశ్వరరావును ఓ రైతు అడిగాడు. దీంతో కోపోద్రిక్తుడైన ఎమ్మెల్యే, ఆ రైతును ఉద్దేశించి "నువ్వు ఏమైనా పోటుగాడివి అనుకుంటున్నావా" అంటూ కోపంతో ఊగిపోయారు. దీంతో అక్కడున్న రైతులు విస్తూపోయారు.
ధాన్యం డబ్బులు అడిగిన రైతుపై ఎమ్మెల్యే దురుసుగా వ్యవహరించడంపై టీడీపీ తీవ్రంగా స్పందించింది. అన్నదాతలంటే అంత అలుసా ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు అంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు. అధికారమదంతో విర్రవీగుతూ రైతుల్నే బెదిరిస్తారా? అష్టకష్టాలు పడి రైతులు తాము పండించిన ధాన్యం అమ్ముకుని మూడు నెలలైనా డబ్బులు ఇవ్వలేదని అడిగితే వారినే తిరిగి బెదిరిస్తారా! ఇదేమి అరాచక ప్రభుత్వం? అంటూ నిలదీశారు.
వ్యవసాయరంగాన్ని సంక్షోభంలోకి నెట్టేసి, రైతు బతుకు దినదినగండంగా మార్చేసిన జగన్‌రెడ్డి ప్రభుత్వంలో రైతు దినోత్సవం అంటే, ప్రశ్నించిన రైతుల్ని అవమానించి దౌర్జన్యం చేయడమా? అన్నదాతల్ని సన్మానించాల్సిన చోట అవమానిస్తారా? అంటూ లోకేష్ మండిపడ్డారు. సభలోనే రైతుల్ని బెదిరించిన ఎమ్మెల్యే తక్షణమే వారికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ధాన్యం బకాయిలు తక్షణమే చెల్లించాలి. లేదంటే అన్నదాతలకు అండగా వైసీపీ ప్రభుత్వం, ఎమ్మెల్యేలకు బుద్ధి చెప్పేవరకూ తెలుగుదేశం పోరాడుతుందని నారా లోకేష్ హెచ్చరించారు