విజయసాయి తలుచుకుంటే ప్రాబ్లమ్ సాల్వ్.. విశాఖ ఉక్కుకు సింపుల్ సొల్యూషన్!
posted on Jul 9, 2021 @ 11:34AM
విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ. ఏపీ ముందున్న అతిపెద్ద సమస్య. ఆంధ్రుల హక్కు అయిన విశాఖ ఉక్కును అంగడి సరుకుగా అమ్మేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఆ అమ్మకానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం లభిస్తోందంటూ కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దొందుదొందేనని తేలిపోయింది. ఏడాదికి ముందే పోస్కో కంపెనీ ఎండీ సీఎం జగన్‌ను కలిసి ఆ మేరకు వారిద్దరూ మాట్లాడుకున్నారని తెలుస్తోంది. ఇలా తెరవెనుక తానే ఉన్నా.. తెరమీద మాత్రం విశాఖ ఉక్కును కాపాడేందుకంటూ తనవంతు ప్రయత్నాలు చేస్తున్నట్టు.. నాటకం రక్తి కట్టిస్తున్నారని చెబుతున్నారు. ఇక విశాఖకు సామంతరాజైన విజయసాయిరెడ్డి అయితే ఏకంగా జీవించేస్తున్నారు. ధర్నాలు, బంద్‌లు తానే చేయిస్తున్నట్టు.. తన డైరెక్షన్‌లోనే విశాఖ ఉక్కు ఉద్యమం జరుగుతున్నట్టు.. బాగానే కలరింగ్ ఇస్తున్నారు.
అందుకే, ప్రధాని మోదీకి చాలా క్లోజ్ అయిన విజయసాయిరెడ్డి తలుచుకుంటే విశాఖ ఉక్కు సమస్యను పరిష్కరించగలరంటూ సీపీఐ నేత నారాయణ అన్నారు. మోదీ కాళ్లపై పడే విజయసాయిరెడ్డి స్టీల్ ప్లాంట్ గురించి ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. తాము ఢిల్లీలో ధర్నాకు ప్రయత్నం చేసామని.. కానీ, విజయసాయిరెడ్డి వలన అది సాధ్యంకాలేదని చెప్పారు. సీఎం మోదీకి రాసే ప్రేమలేఖల వల్ల ఉపయోగం లేదంటూ సీఎం జగన్‌పైనా సెటైర్లు వేశారు. ముఖ్యమంత్రి ప్రత్యక్ష ఆందోళనలో పాల్గొనాలని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ దగ్గర శిబిరానికి జగన్ రావాలని, ఆయన ఆధ్వర్యంలో పోరాటం జరగాలని అన్నారు నారాయణ.
విశాఖకు అన్యాయం జరుగుతుంటే.. కంభంపాటి హరిబాబు ఎందుకు మాట్లాడరని నిలదీశారు. విశాఖకు, స్టీల్ ప్లాంట్‌కు న్యాయం జరిగే వరకు.. మిజోరాం గవర్నర్‌గా వెళ్లనని హరిబాబు చెప్పాలన్నారు. కేంద్ర వైఖరిని నిరసిస్తూ మిజోరాం గవర్నర్ పదవిని హరిబాబు తిరస్కరించాలని డిమాండ్ చేశారు.
అన్నీ అదానీకి, అంబానీలకు ఇస్తారా అంటూ ప్రశ్నించారు. దేశాన్ని, సంపదను అమ్మేస్తున్నారని మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్‌పై కోర్టుకు వెళ్లడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని.. ప్రజాపోరాటాలకు, ప్రాణ త్యాగానికి సిద్ధం కావాలని నారాయణ పిలుపునిచ్చారు.