రాజీనామాలకు సై.. జగన్‌కు చంద్రబాబు ఉక్కు సవాల్...
posted on Jul 23, 2021 @ 8:38PM
విశాఖ ఉక్క ఫ్యాక్టరీ కోసం ఆంధ్రులంతా ఉద్యమిస్తున్నారు. కార్మికులు ధర్నాలు, దీక్షలతో పోరాడుతున్నారు. టీడీపీ శ్రేణులు అవిశ్రాంతంగా పోరాడుతున్నారు. ప్రజలు ఎంతగా వద్దంటున్నా.. పాలకులు మాత్రం స్టీల్ ప్లాంట్‌ను అంగడి సరుకుగా అమ్మేసుకోడానికి సిద్దమవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ లోపాయికారి సహకారంతో కేంద్రం దూకుడుగా వ్యవహరిస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. ప్రజలను తప్పుదారి పట్టించడానికే అన్నట్టు.. వైసీపీ ఎంపీలు పార్లమెంట్‌లో ఉత్తుత్తి నిరసనలు తెలుపుతున్నారని అనుమానిస్తున్నారు. ఎంపీ విజయసాయి నేతృత్వంలో స్టీల్‌ప్లాంట్‌పై రాజకీయ డ్రామా రంజుగా సాగుతోందని అంటున్నారు.
విశాఖ ఉక్కు పరిరక్షణకు టీడీపీ అధినేత చంద్రబాబు దూకుడు పెంచారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం టీడీపీ నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధులంతా రాజీనామాకు సిద్ధమని ప్రకటించి సంచలనం సృష్టించారు చంద్రబాబు. గెలుపు-ఓటములు పట్టించుకోకుండా.. విశాఖ ఉక్కు కోసం రాజీనామాలకు సిద్ధపడ్డారు చంద్రబాబు. ఈ మేరకు విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ కమిటీ నేతలకు ఆయన లేఖ రాశారు.
విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు నినాదంతో 1960లో తెలుగు ప్రజలు విశాఖ స్టీల్ ప్లాంట్ సాధించారని గుర్తు చేశారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీకి చంద్రబాబు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ‘‘ఎన్నో ఆటంకాలు దాటి 1992లో స్టీల్ ప్లాంట్‌ను దేశానికి అంకితం చేస్తే.. 2000 సంవత్సరంలో నాటి వాజ్‌పేయీ ప్రభుత్వం ఈ ప్లాంటును రూ.4వేల కోట్లకు ప్రైవేటీకరించేందుకు సిద్ధపడింది. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న నేను వ్యక్తిగతంగా అభ్యర్థించడం, రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తితో రూ.1,333 కోట్ల ప్యాకేజీ ఇచ్చింది. దీంతో విశాఖ ప్లాంట్ తిరిగి లాభాల బాట పట్టేలా చేశాం. విశాఖ ఉక్కు పరిరక్షణకు సీఎం జగన్ నేతృత్వం వహించాలి. ఉక్కు ఉద్యమాన్ని సీఎం జగన్ ముందుండి నడిపించాలి. ఐక్య పోరాటం వల్లే ఉక్కును ప్రైవేటీకరించకుండా కాపాడగలం’’ అని చంద్రబాబు లేఖలో తెలిపారు.
మరి, చంద్రబాబు సవాల్ విసిరినట్టుగా రాజీనామాలకు జగన్ సిద్ధమా? తమదే అధికారమంటూ విర్రవీగుతున్న వైసీపీకి రాజీనామాలు చేసేంత ధైర్యం ఉందా? చంద్రబాబు డిమాండ్ చేసినట్టు.. విశాఖ ఉక్కు పరిరక్షణకు సీఎం జగన్ నేతృత్వం వహిస్తారా? చంద్రబాబు సవాల్‌ను జగన్ స్వీకరిస్తారా? విశాఖ ఉక్కు కోసం చిత్తశుద్ధి చూపిస్తారా? లేక, ఎప్పటిలానే ప్రజలను మభ్యపెట్టేలా రాజకీయ కార్యక్రమాలు కొనసాగిస్తారా?