సలహాదారులకు త్వరలో మంగళం? హైకోర్టు కామెంట్లతో వైసీపీలో కలవరం
posted on Jul 24, 2021 @ 11:45AM
ప్రభుత్వానికి కొందరు సలహాదారులు ఉంటారు. పాలనలో సహకరించేందుకు కొందరని ఇలా నియమిస్తుంటారు. గతంలో చాలా పరిమితంగా సలహాదారులు ఉండేవారు. కాని ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మాత్రం సలహదారుల పదవికి అర్ధమే మారిపోయిందనే విమర్శలు వస్తున్నాయి. ఎడాపెడా సలహదారులను నియమించేశారు సీఎం జగన్ రెడ్డి. అవసరాలు, అర్హతలు ఇవేమి లేకుండా ఇష్టారాజ్యంగా కట్టబెట్టేశారు. ఏపీలో 50 మందికి పైగానే సలహదారులు ఉన్నారంటే నమ్మక తప్పదు. ఇందులో దాదాపు 80 శాతం ఒక సామాజిక వర్గం వారే ఉండటం మరో విశేషం. అంటే ఓ వర్గం వారి కోసమే సలహాదారుల పదవి స్పష్టించి అపాయింట్ చేసుకున్నారనే ఆరోపణలు జగన్ రెడ్డిపై ఉన్నాయి.
సలహాదారులుగా నియమించబడిన వారు ఏం చేస్తున్నారో , ఏం ఎలగబెడుతున్నారో ఎవరికీ తెలియదు. ఇక్కడ మరో కీలక అంశం ఏంటంటే.. ఏపీ ప్రస్తుతం పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయింది. ఉద్యోగులకు వేతనాలు కూడా ఇవ్వాలన్న రుణం తీసుకోవాల్సిందే. ఇలాంటి పరిస్థితుల్లోనూ అడ్డగోలుగా సలహాదారులను నియమించుకుని ఖజానా ఖాళీ చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. సలహాదారులకు ప్రభుత్వం నుంచి వేతనాలు ఇవ్వడంతో పాటు ఇతరత్రా అలవెన్సుల పేరుతో నెలనెలా కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోంది జగన్ రెడ్డి సర్కార్. సలహాదారుల నియామకం, వాళ్ల పనితీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. తాజాగా ఏపీ హైకోర్టు కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేసింది. రాష్ట్ర ప్రభుత్వ, ముఖ్యమంత్రి సలహాదారులకు కల్పిస్తున్న ప్రత్యేక సౌకర్యాలు హైకోర్టు న్యాయమూర్తులకు సైతం లేవని హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రభుత్వం ఖజానా నుంచి వారికి అలవెన్స్‌లు, ఇతర సౌకర్యాలు రూపేణా లక్షల్లో చెల్లిస్తున్నదని పేర్కొంది.
సలహాదారులనే పేరుతో 50 నుంచి 60 మందిని నియమించడం ఏమిటని హైకోర్టు ఆక్షేపించింది. వారి నియామకం విషయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా చూసుకోవాలి కదా అని వ్యాఖ్యానించింది. గతంలో సలహాదారులు మీడియా ముందుకు వచ్చిన సందర్భాలు చాలా తక్కువని...ప్రసుత్తం కొంతమంది మీడియా ముందుకు వచ్చి రాజకీయాలు కూడా మాట్లాడుతున్నారని పేర్కొంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ కు సలహాదారుగా ఉన్న కేవీపీ రామచంద్రరావు... రాజశేఖరెడ్డి మరణించిన తరువాత ప్రజలకు ధైర్యం చెప్పేందుకే మీడియా ముందుకు వచ్చారని వ్యాఖ్యానించింది. ఎస్‌ఈసీగా నీలం సాహ్ని నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
నీలం సాహ్నిని ఎన్నికల కమిషనర్‌గా నియమించడాన్ని సవాల్ చేస్తూ విజయనగరం జిల్లా సాలూరుకు చెందిన న్యాయవాది రేగు మహేశ్వరరావు హైకోర్టులో కోవారెంటో వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై జరిగిన విచారణలో పిటిషనర్ తరఫున న్యాయవాది బి.శశిభూషణ్‌రావు, రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ వాదించారు. విచారణ సందర్భంగా ఎస్‌ఈసీగా నియామకానికి గల అర్హతలు గురించి చర్చ జరిగింది. ముఖ్యకార్యదర్శి హోదాకు తగ్గని అధికారి ఎస్‌ఈసీగా నియమితులయ్యేందుకు అర్హులని పంచాయతీరాజ్ చట్టంలో స్పష్టంగా ఉన్నప్పుడు స్వతంత్ర వ్యక్తే ఆ పోస్టుకు అర్హులని ఎలా చెబుతారని పిటిషనర్ తరఫు న్యాయవాదిని న్యాయమూర్తి ప్రశ్నించారు. విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి సలహాదారుల నియామకం విషయం చర్చకు వచ్చింది. సలహాదారుల అర్హత, నియామకం విషయంలో నిబంధనలు ఏమైనా ఉన్నాయా అని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఎలాంటి నిబంధనలు లేవని...వివిధ రంగాల్లో నిపుణులైన వారిని నిర్దిష్ట కాలంపాటు సలహాదారులుగా నియమించుకుంటారని ఏజీ బదులిచ్చారు. ‘‘సలహాదారుల నియామక జీవోలో వారి విధులు పేర్కొన్నారు. అర్హత గురించి ఎలాంటి నిబంధనలు లేవు. ప్రభుత్వ ఖజానా నుంచే వారికి జీతం, అలవెన్స్‌లు చెల్లిస్తారు. న్యాయమూర్తి స్పందిస్తూ.. 40, 50 సలహాదారులను నియమించుకొనేటప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా చూడాలి కదా అని వ్యాఖ్యానించారు. దీంతో ప్రభుత్వ సలహాదారుల అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. తాజా పరిణామాలు చూస్తుంటే.. త్వరలోనే సలదాహారులకు మంగళం పాడే రోజులు ఉన్నాయని తెలుస్తోంది.