మల్లీశ్వరి తర్వాత మీరాబాయి.. సరిలేరు నీకెవ్వరూ...
posted on Jul 24, 2021 @ 2:11PM
టోక్యో ఒలంపిక్స్‌లో భారత్ మురిసింది. మీరాబాయి చాను వెండి పతకం ముద్దాడింది. మణిపుర్ మణిపూస ఆ ఘనత సాధించింది. వెయిట్ లిఫ్టింగ్‌లో కరణం మల్లీశ్వరి తర్వాత భారత్‌కు పతకం అందించింది మీరాబాయి చాను. 24 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్ వెయిట్ లిఫ్టింగ్‌లో భారత్ పతకదారిగా నిలిచింది.
మహిళల 49 కిలోల విభాగంలో మీరాబాయి చాను మెడల్ సాధించారు. స్నాచ్‌లో 87 కిలోలు, క్లీన్ అండ్ జర్క్‌లో 115 కిలోలు.. మొత్తంగా 202 కిలోలు ఎత్తి.. వెండి వెలుగులు విరజిమ్మింది. క్లీన్ అండ్ జర్క్‌లో అద్భుతమే చేసింది. ఎందుకంటే ఈ విభాగంలో మీరాకు ప్రపంచంలోనే తిరుగులేదు. పోటీల్లో మీరాబాయికి గట్టి పోటీనిచ్చింది చైనా వెయిట్ లిఫ్టర్ హూ జిహూయి. మొత్తంగా 210 కిలోలు ఎత్తి స్వర్ణం అందుకుంది.
టోక్యో ఒలింపిక్స్‌లో తొలి పతకం సాధించి భారత్‌కు శుభారంభం అందించిన వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చానుకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు సోషల్‌మీడియాలో అభినందనలు చెప్పారు.
టోక్యో ఒలింపిక్స్‌లో రజత పతకం గెలిచి భారత పతకాల పట్టికను తెరిచిన వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చానుకు హృదయపూర్వక అభినందనలు - రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
టోక్యో ఒలింపిక్స్‌లో మీరాబాయి చాను అద్భుతమైన ప్రదర్శనతో యావత్ భారతం ఉప్పొంగిపోతోంది. వెయిట్‌లిఫ్టింగ్‌లో రజత పతకం సాధించిన ఆమెకు అభినందనలు. ఆమె విజయం ప్రతి భారతీయుడికి స్ఫూర్తి దాయకం - ప్రధాని మోదీ
తొలి రోజే.. తొలి పతకం. మీరా.. భారత్ గర్వపడుతోంది - క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్
టోక్యో ఒలింపిక్స్ ఆరంభంలోనే దేశానికి తొలి పతకం అందించిన మీరాబాయి చానుకు అభినందనలు. తన పుత్రికను చూసి భారతావని గర్వపడుతోంది - కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ
వెయిట్ లిఫ్టింగ్‌లో రజత పతకం సాధించిన మీరాబాయి చానుకు అభినందనలు. టోక్యో ఒలింపిక్స్‌లో భారతదేశానికి గొప్ప ఆరంభం లభించింది. కరణం మల్లీశ్వరి తర్వాత ఒలింపిక్స్ వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో పతకాన్ని గెలుచుకున్న రెండో భారతీయ మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు. - తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు
ఎంత మంచి రోజు! భారత్‌కు ఎంత మంచి విజయం. 49 కిలోల విభాగంలో వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను రజతాన్ని ముద్దాడింది. దీంతో భారత పతకాల పట్టిక మొదలైంది. యావత్ దేశాన్ని గర్వపడేలా చేశావు చాను - మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్. బీరేన్ సింగ్
టోక్యోలో భారత్ తొలి పతకం నమోదు చేసింది. వెయిట్ లిఫ్టింగ్‌లో మీరాబాయి చాను రజత పతకం అందుకుంది. యావత్ భారతావని గర్వపడే విషయం. అభినందనలు చాను - కేంద్రమంత్రి కిరణ్ రిజిజు