వివేకా హత్యలో ఇద్దరు ప్రముఖులు? కీలక ఆధారాలు సేకరించిన సీబీఐ...
posted on Jul 23, 2021 @ 5:10PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తులో కీలక పురోగతి చోటు చేసుకుంది. రాష్ట్రంలో సంచలనం స్పష్టించిన వివేకా హత్య కేసులో సీబీఐ కీలక ఆధారాలు సేకరించింది. వివేకా హత్యకు రూ. 8 కోట్లు సుపారీ ఇచ్చినట్లు తేలిందని తెలుస్తోంది. ఇద్దరు ప్రముఖులు ఈ మొత్తన్ని అందజేసినట్లు సీబీఐ విచారణలో స్పష్టమైందని సమాచారం. ఈ కేసుకు సంబంధించి దాదాపు 45 రోజులుగా సీబీఐ బృందం కడప జిల్లాలో మకాం వేసి విచారణ జరుపుతోంది. సుమారు 16 వందలమందికిపైగా విచారించింది. వివేకా ఇంటి వాచ్‌మెన్ రంగయ్య ఇచ్చిన సమాచారంతో కేసుకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయని అంటున్నారు.
వివేకా హత్య కోసం ఇద్దరు వ్యక్తులు రూ. 8 కోట్లు సుపారీ ఇచ్చినట్లుగా రంగయ్య జమ్మలమడుగు మేజిస్ట్రేట్ ఎదుట వాంగ్మూలం ఇచ్చినట్లు సమాచారం. ఇప్పుడు ఆ వాంగ్మూలం కీలకంగా మారబోతోంది. సుపారీ ఇచ్చిన ఇద్దరు వ్యక్తులతోపాటు మరో ఐదుగురు వ్యక్తులకు ఈ హత్యతో సంబంధం ఉందని రంగయ్య చెప్పినట్లుగా తెలుస్తోంది. హత్యలో పాల్గొన్న ఆ ఐదుగురు బయట ప్రాంతానికి చెందినవారని, ఇద్దరు సుపారీ ఇచ్చారని, మరో వ్యక్తి.. మొత్తం 8 మంది ఈ హత్యలో పాల్గొన్నట్లు రంగయ్య వాంగ్మూలం ఇచ్చినట్లుగా సమాచారం. ఈ వాంగ్మూలంతో సీబీఐ అధికారులు ముందుకువెళ్లే అవకాశం ఉంది
మరోవైపు వివేకా హత్య కేసు విచారణలో మరో కీలక మలుపు కూడా చోటు చేసుకుంది. కేసు విచారణ పర్యవేక్షణ అధికారిని సీబీఐ మార్చేసింది. డీఐజీ సుధాసింగ్ నుంచి ఎస్పీ రాంకుమార్‌కు కేసు బదిలీ అయ్యింది. వివేకా హత్య కేసులో ఇప్పటికే 44 రోజుల పాటు విచారణ కొనసాగింది. కేంద్ర దర్యాప్తు బృందం కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహంలో విచారణ కొనసాగిస్తోంది. కొన్ని రోజులుగా అక్కడే సీబీఐ అధికారులు అనుమానితులను ప్రశ్నిస్తున్నారు. కీలక సమాచారాన్ని సీబీఐ రాబట్టింది. ఈ కేసులో మరిన్ని వివరాలను రాబట్టేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇంతలోనే పర్యవేక్షణ అధికారి మార్పు చర్చనీయాశంగా మారింది.