వివేకా టీడీపీలో చేరాలనుకున్నారా? హత్యకు సుపారీ ఇచ్చిందెవరు?
posted on Jul 23, 2021 @ 10:20PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య కేసు కీలక మలుపు తిరుగుతోంది. వివేకా మర్డర్ కి సంబంధించి సీబీఐ విచారణలో సంచలన విషయాలు వెలుగుచూశాయని తెలుస్తోంది. వివేకా అనుచరుడు ఎర్రగంగి రెడ్డి, పీఏ కృష్ణా రెడ్డి, డ్రైవర్ దస్తగిరి, పులివెందులకి చెందిన కృష్ణయ్య కుటుంబం, వాచ్మెన్ రంగన్న, ఇనాయతుల్లాను ప్రశ్నించిన సీబీఐ అధికారులు .. కీలక సమాచారం సేకరించారని సమాచారం.
వివేకా హత్య కేసులో అత్యంత కీలకంగా భావిస్తున్న వాచ్మెన్ రంగన్న స్టేట్మెంట్ ను జమ్మలమడుగు మేజిస్ట్రేట్ ఎదుట రికార్డు చేసినట్లు సమాచారం. వివేకానంద రెడ్డిని సుపారీ గ్యాంగ్ హత్య చేశారని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. వివేకా హత్యకు రూ.8 కోట్లు సుపారీ ఇచ్చారని.. తొమ్మిది మంది ప్రమేయం ఉన్నట్లు రంగన్న చెప్పాడని తెలుస్తోంది. హత్య జరిగిన రోజు ఇంటికి ఐదుగురు కొత్త వ్యక్తులు వచ్చినట్లు స్టేట్మెంట్ లో రంగన్న పేర్కొన్నట్లు సమాచారం. ఇద్దరు ప్రముఖుల హస్తం కూడా ఉందని రంగన్న చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో వాచ్ మెన్ రంగయ్య చెప్పిన ఆ ఇద్దరు ప్రముఖులెవరన్నదీ ఇప్పుడు సస్పెన్స్ మారింది. వివేకా హత్యకు సుపారీ ఇచ్చిందెవరు.. హత్య చేసిందెవరు అన్నది కొన్ని రోజుల్లోనే తేలిపోయే అవకాశాలు కన్పిస్తున్నాయి.
వివేకా హత్య కేసులో ఇద్దరు ప్రముఖుల హస్తం ఉందని తెలుస్తుండటంతో దీని వెనుక రాజకీయ కోణం ఖచ్చితంగా ఉందనే అనుమానాలు వస్తున్నాయి. అదే సమయంలో వివేకానంద రెడ్డి హత్య కావడానికి కొన్ని రోజుల ముందు జరిగిన రాజకీయ పరిణామాలు బయటికి వస్తున్నాయి. అందులో సంచలన అంశాలు ఉన్నాయి. 2019 మార్చి 15న పులివెందులలోని తన నివాసంలోనే దారుణ హత్యకు గురయ్యారు వివేకానంద రెడ్డి. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు రెండు నెలల ముందు ఈ హత్య జరగడం తీవ్ర కలకలం రేపింది. అయితే వివేకానంద రెడ్డి చనిపోయినప్పుడు వైసీపీలోనే ఉన్నా... ఆయన పార్టీ మారాలనే ఆలోచనలో అప్పుడు ఉన్నారని తెలుస్తోంది.
రాజకీయ వర్గాలు, వైఎస్ వివేకా సన్నిహితులు చెబుతున్న వివరాల ప్రకారం వైఎస్ వివేకానంద రెడ్డి టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. వైఎస్ జగన్ తో విభేదాలు పెరగడంతో పార్టీ మారాలని ఆయన భావించారని అంటున్నారు. అప్పటి ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుతోనూ వివేకా టచ్ లోకి వెళ్లారట. చంద్రబాబు కూడా కడప జిల్లా టీడీపీ నేతలతో పాటు ముఖ్య నేతలకు ఈ విషయం చెప్పారని తెలుస్తోంది. వైఎస్ వివేకానంద రెడ్డి మన పార్టీలోకి రాబోతున్నారు.. కడప జిల్లాలోనూ మంచి ఫలితాలు సాధించబోతున్నామని పార్టీ ముఖ్య నేతలతో చంద్రబాబు చెప్పారని చెబుతున్నారు. వివేకా టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్న కొన్ని రోజులకే హత్య జరగడం పలు అనుమానాలకు తావిచ్చిందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
2019 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ మధ్య పోరు హోరాహోరీగా సాగింది. ఆ సమయంలో వివేకానంద రెడ్డి పార్టీ మారితే వైసీపీకి భారీగా నష్టం జరిగేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో వివేకా హత్య జరగడంతో.. దీని వెనుక రాజకీయ కోణం ఉండే అవకాశాలు ఉన్నాయని వాళ్లంతా అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు వాచ్ మెన్ రంగయ్య కూడా వివేకా హత్య వెనుక ఇద్దరు ప్రముఖులు ఉన్నారని చెప్పారని వార్తలు వస్తుండటంతో.. ముందు నుంచి అనుమానిస్తున్నట్లుగా రాజకీయ కోణంలోనే హత్య జరిగిందనే వాదన నిజం కావచ్చనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. చూడాలి మరీ సీబీఐ దర్యాప్తులో ఏం తేలుతుందో, వివేకా హత్య కేసులో ఉన్న ప్రముఖులు ఎవరో.. వైసీపీ నేతల హస్తం ఉందని తేలితే మాత్రం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు రావడం ఖాయం...