ఉద్యోగులకు ఐదేళ్ల సెలవులు.. ఆర్థిక కష్టాలతో సర్కారు కీలక నిర్ణయం..
posted on Jul 23, 2021 @ 7:09PM
కరోనా వైరస్ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసింది. దాదాపు అన్ని వ్యవస్థలూ దారుణంగా దెబ్బతిన్నాయి. ప్రజల కొనుగోలు శక్తి పడిపోయింది. ప్రభుత్వానికి రాబడి తగ్గిపోయింది. మరోవైపు, సంక్షేమ పథకాల గుదిబండ ఉండనే ఉంది. వస్తున్న కాస్తో కూస్తో సొమ్ము కూడా ఉద్యోగుల జీతాలకే పోతోంది. ఆ శాలరీలు ఇవ్వడం కూడా చాలా కష్టమవుతోంది. అప్పులతో, భూముల అమ్మకాలతో ప్రభుత్వ ఖర్చులు నెట్టుకొస్తున్నారు. అయినా.. దమ్మిడి రాక లేకపోవడంతో చేసేది లేక చేతులెత్తేస్తోంది సర్కారు. తాజాగా, ప్రభుత్వానికి ఓ బంపర్ ఐడియా వచ్చింది. ఆ ఐడియా రాష్ట్ర ఆర్థిక దుస్థితిని మార్చేస్తుందని భావిస్తున్నారు పాలకులు. ఇంతకీ ఆ ఐడియా ఏంటంటే....
అత్యవసరమైన పోలీస్, వైద్యం, రెవెన్యూ, విద్యా విభాగాలు మినహా ఇతర అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు ఐదేళ్ల పాటు సెలవులు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ సుదీర్ఘ సెలవు సమయంలో వారికి సగం జీతం ఇస్తారు. ఈ మేరకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులకు ఐదేళ్ల సెలవుల ఐడియాకు ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆమోదం తెలిపారు.
మధ్యప్రదేశ్ రాష్ట్రానికి 2.53 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి. కరోనా వల్ల ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. నిరర్థక ఆస్తులు అమ్మి రూ. 500 కోట్లను సమీకరించారు. అయినా, ఏ మూలకూ సరిపోక పోవడంతో.. తాజాగా ఉద్యోగులకు సగం వేతనంతో కూడిన దీర్ఘకాల సెలవులు ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నారు. సగం శాలరీ మిగులుతుండటంతో.. ఏటా రూ. 6 వేల కోట్ల మేర ఆదా అవుతుందని అధికారులు అంచనా వేశారు. ఉద్యోగులు మూడేళ్ల నుంచి ఐదేళ్ల వరకు సెలవు తీసుకునే వెసులుబాటు కల్పించారు. ఐడియా అదిరిందని పాలకులు భావిస్తున్నా.. సెలవులు తీసుకోవడానికి మాత్రం ఉద్యోగులు సిద్ధంగా లేరని తెలుస్తోంది. సర్కారు ఇచ్చిన ఈ ఆఫర్‌ను వినియోగించుకునే ఉద్యోగుల సంఖ్య తక్కువగానే ఉంటుందని అంటున్నారు.
ఈ మధ్యప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ ఆఫర్ గురించి ఇంకా మన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు తెలియలేదేమో. లేదంటే, అప్పుల కుప్పగా మారి, దివాళా స్థితికి చేరిన రాష్ట్రాన్ని గట్టెక్కించేందుకు మనోళ్లు సైతం ఇలా ఉద్యోగులను సెలవులపై పంపే కార్యక్రమం చేపట్టినా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు.