గుట్కా, గంజాయి, డ్రగ్స్ తీసుకునే మంత్రులు.. బండి సంజయ్ స్ట్రాంగ్ వార్నింగ్
posted on Jul 24, 2021 @ 1:33PM
మంత్రులంటే ఎంత హుందాగా ఉండాలి? ప్రజలకు ఎంత ఆదర్శంగా ఉండాలి? కానీ, తెలంగాణ మంత్రులు కొందరు తమ చేష్టలతో మంత్రి హోదాకే కలంకం తీసుకొస్తున్నారు. ఇటీవల తెలంగాణ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్‌లు చాటుమాటుగా గుట్కా తింటున్న యవ్వారం కెమెరాలకు చిక్కడం.. ఆ దృశ్యాలు వైరల్‌గా మారడం కలకలం రేపుతున్నాయి. మంత్రుల తీరుపై తాజాగా బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గంగుల కమలాకర్ హుజురాబాద్‌లో టీఆర్ఎస్ గెలుపునకు తీవ్రంగా పని చేస్తుండటం.. ఈటలను కట్టడి చేసే కుట్రలు చేయడంపై బీజేపీ బాస్ ఫైర్ అయ్యారు.
గుట్కా, గంజాయి, డ్రగ్స్ తీసుకునే మంత్రులా ఈటలను ఓడించేదంటూ గట్టిగా ప్రశ్నించారు. హుజురాబాద్‌లో పర్యటించిన బండి సంజయ్.. ఈటల పాదయాత్ర సీఎం కేసీఆర్‌కు నిద్ర లేకుండా చేస్తోందన్నారు. ఈటల గెలిచిన తర్వాత డైరెక్ట్‌గా అయోధ్యకు వెళతామన్నారు. కేసీఆర్ సర్వేలను మాత్రమే నమ్ముకున్నారని.. తాము ప్రజలనే నమ్ముకున్నామన్నారు.
దళిత బంధు.. రాజకీయ డ్రామా అంటూ బండి సంజయ్ మండిపడ్డారు. అంబేద్కర్ జయంతి, వర్ధంతిలకు కేసీఆర్ ఎందుకు రాలేదని ప్రశ్నించారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏది అంటూ కేసీఆర్‌ను నిలదీశారు. బీజేపీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ నడి బొడ్డున అంబేద్కర్ విగ్రహం పెడతామన్నారు బండి సంజయ్. హుజురాబాద్‌లో బీజేపీ గెలుపును ఎవరూ అడ్డుకోలేరంటూ సవాల్ విసిరారు.