పొయ్యేటోడు పోక పొగ బెట్టి పాయె..
posted on Jul 24, 2021 @ 3:12PM
కాషాయ దళానికి గుడ్ బై చెప్పిన మోత్కుపల్లి నరసింహులు... పోతూపోతూ తెలంగాణ బీజేపీ గాలి తీసి పోయారంటూ బీజేపీ శ్రేణులు వాపోతున్నాయి. చంద్రబాబు బంటుగా టీడీపీలో రాచమర్యాదలు అందుకున్న మోత్కుపల్లి.. తమ పార్టీలోకి వస్తే ఎస్సీల్లోని అతిపెద్ద వర్గం తమకు అండగా ఉండడం ఖాయమనుకొని సంబరపడ్డారు బీజేపీ నేతలు. అటు మోత్కుపల్లి కూడా చాలా హై రేంజ్ లో ఊహించుకున్నారు. అందుకే జాతీయ పార్టీలో చేరితే ఏదో ఒక స్థాయిలో చక్రం తిప్పవచ్చనుకొని ఎంతో సంతోషంతో బీజేపీలో చేరిపోయారు. అనుకోకుండా వచ్చి పడ్డ హుజూరాబాద్ ఉపఎన్నికతో తనకు బీజేపీలో గల స్థానమేంటోతెలిసొచ్చిందని, ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదని ఇప్పుడాయన వాపోతున్నారు. టీఆర్ఎస్ లో సెకండ్ ప్లేస్ లో ఉన్న నాయకుడు పార్టీలో చేరితే కనీసం తనకు మాట మాత్రమైనా చెప్పకూడదా... తన అభిప్రాయం తీసుకోకూడదా... అంటూ అసంతృప్తితో రగిలిపోయారు మోత్కుపల్లి.
ఉమ్మడి రాష్ట్రంలో ఒక వెలుగు వెలిగిన తననే పూచికపుల్లతో సమానంగా చూస్తే ఇక పార్టీలోకి ఇతర పార్టీల సీనియర్లు ఎలా వస్తారంటూ అక్కసు, ఆవేదన వెళ్లగక్కారు. అసలు వేరే పార్టీ నుంచి వచ్చినవారు బీజేపీలో ఇమడలేరని, ఇప్పుడున్నవారు కూడా ఎప్పుడో ఒకప్పుడు వెళ్లిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. మోత్కుపల్లి శాపరనార్థాలతో కంగుతినడం బీజేపీ నేతల వంతైంది.
మోత్కుపల్లి బీజేపీని వీడాక మీడియాతో మనసులోని అంశాలు బయటపెట్టుకున్నారు. రాష్ట్ర నాయకత్వంలో సమర్థత లోపించిందని, ఎవరిని ఏ విధంగా ఆకర్షించాలో ఇక్కడ ఎవరికీ తెలియదన్న మోత్కుపల్లి.. పనిలోపనిగా జాతీయ పార్టీ నాయకత్వాన్ని సమర్థించడం విశేషం. ఇదే స్థానిక నాయకులకు మింగుడపడని అంశంగా మారింది. ఎవరైనా ఏ పార్టీ నుంచైనా తమకు నచ్చనప్పుడు ఎప్పుడైనా బయటికి వెళ్లిపోవచ్చు. ప్రజాస్వామ్యబద్ధంగా వచ్చిన హక్కు అది. కానీ.. పోతూపోతూ స్థానిక నాయకత్వం మీద అసమర్థ ముద్ర వేసి వెళ్లిపోవడంతో బండి అనుచరులు జుట్టు పీక్కుంటున్నారు. అదీగాక జాతీయ నాయకత్వాన్ని చూడండి... మోడీ గానీ, అమిత్ షా గానీ.. ఏ విధంగా పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారో.. ఇతర పార్టీల నేతలను ఎంత సక్సెస్ ఫుల్ గా క్యారీ చేస్తున్నారో చూసి నేర్చుకోవాలంటూ హితవు పలకడాన్ని బండి ఫ్యాన్స్, రాష్ట్ర బీజేపీ కేడర్ జీర్ణించుకోలేకపోతోంది. అది కూడా హుజూరాబాద్ లో ఉపఎన్నికలు జరుగుతున్న తరుణంలో మోత్కుపల్లి కామెంట్లు భారీ కుదుపేనంటున్నారు బీజేపీ శ్రేణులు. హుజూరాబాద్ ఎన్నికల ముందే ఒక్క వారం రోజుల్లోనే మోత్కుపల్లి, ఎర్రా శేఖర్, గండ్ర సత్యనారాయణరావు బీజేపీని వీడారు. అటు జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు స్వామిగౌడ్ లాంటి సీనియర్ నేతలు బీజేపీలో చేరారు. నాగం జనార్దన్ రెడ్డి సైతం బీజేపీలో ఇమడలేకపోయారు. నాగం పార్టీని వీడినప్పుడు సైతం స్థానిక బీజేపీ నాయకత్వ మూస ధోరణిపై తీవ్రమైన విమర్శలే వచ్చాయి. అప్పుడు లక్ష్మణ్ పోస్టుకు ఎసరు పెట్టింది కూడా ఇలాంటి పరిస్థితులేనని చెబుతారు.
అలాంటిది తాజాగా రిపీట్ కాకుండా ఉండేందుకు బండి సంజయ్ ఎర్రా శేఖర్, గండ్రతో ఫోన్లో మాట్లాడి బుజ్జగించినట్లు సమాచారం. అయినా ఫలితం లేకపోవడంతో.. మోత్కుపల్లి శాపనార్థాల ప్రభావం ఇంకా ఏ రూపం తీసుకుంటుందోనని ఆందోళన చెందుతున్నారు. అందుకే పార్టీని వీడే మోత్కుపల్లి తన దారి తాను చూసుకోక.. మరికొందరికి కూడా దారి చూపిస్తున్నాడా అన్న వ్యాఖ్యానాలు పార్టీ నుంచి వినిపిస్తున్నాయి.