యడ్డీ రాజకీయ జీవితం ముగిసినట్లేనా?
అనూహ్యం కాకపోయినా, ఆఖరి క్షణం వరకు ఉత్కంఠ భరితంగా సాగిన, కర్నాటక పొలిటికల్ డ్రామా, చివరాఖరికి ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప రాజీనామాతో అలా ముగింపుకు చేరింది. యడియూరప్ప రాజీనామాను గవర్నర్ ఆమోదించారు. ప్రత్యాన్మాయ ఏర్పాట్లు జరిగే వరకు తత్కాలికంగా పదవిలో కొనసాగమని గవర్నర్ కోరారు. అయితే, ఇప్పుడు అందరి ముందున్న ప్రశ్న అదే .. యడ్డీ వ్రాసుడు ఎవరు? వారసుని ఎంపిక, అధికార మార్పిడి సజావుగా సాగుతుందా? ఇదే ఇప్పుడు అందరి ముందున్న ప్రశ్న. అయితే,పార్టీ అధినాయకత్వం,యడ్డీని పదవినుంచి తప్పించడం మొదలు, వారసుని ఎంపిక వరకు ఎదురయ్యే సమస్యలను ముందుగానే ఊహించి, అన్ని ఏర్పట్లు చేసుకున్న తర్వాతనే యడ్డీ పుట్టలో వేలు పెట్టిందని పార్టీ వర్గాల సమాచారం. అందుకే చివరి క్షణం వరకు వ్యూహత్మకంగా పావులు కలిపి యడ్డీ నోటితోనే రాజీనామా మాట చెప్పించడం జరిగిందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
అదలా ఉంటే, యడ్డీ వారసుని ఎంపిక విషయంలోకూడా బీజేపీ అధిష్ఠానం ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చిందని అంటున్నారు. అయితే, ఎవరా వారసుడు, అనేది ప్రస్తుతానికి సస్పెన్సుగానే వుంది. మరో 18 నెలలలో 2023 ఏప్రిల్ - మే నెలల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకు వచ్చే లక్ష్యంతో బీజేపీ యువతకు ప్రాధాన్యత ఇచ్చే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.అలాగే, కులాల సమీకరణలు ఇతరత్రా అంశాలను కూడా పార్టీ అధినాయకత్వం అనివార్యంగా పరిగణనలోకి తీసుకుంటుంది. ఈ నేపధ్యంలో, ప్రధానంగా ఆరేడు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇందులో లిగాయత్ సామాజిక వర్గం నుంచి రాష్ట్ర హోమ్ మంత్రి, మాజీ ముఖ్యమంత్రి ఎస్ఆర్ బొమ్మై కుమారుడు, బసవరాజ్ బొమ్మై,రాష్ట్ర గనుల శాఖ మంత్రి మురుగేశ్ నిరాణి, ఎమ్మెల్యే అరవింద్ బెల్లార్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇందులో, బసవరాజ్ బొమ్మైకి ముఖ్యమంత్రి పదవినుంచి తప్పుకుంటున్న యడ్యూరప్ప ఆశీస్సులు ఉన్నాయని అంటున్నారు. అయితే అలాంటిదేమీ లేదని, తాను ఎవరి పేరు ప్రతిపాదించలేదని యడ్డీ పదేపదే చెప్పుకొస్తున్నారు.
అయితే ఒకే వర్గం ఓటు బ్యాంకుపై ఆధారపడకుండా, ఇతర వర్గాలలో కూడా పార్టీ పునాదులు విస్తించేందుకు, ఈసారి, ఓబీసీ, వక్కళిగ సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వాలనే ఆలోచన కూడా పార్టీ అధినాయకత్వానికి ఉన్నట్లుగా కూడా వినవస్తోంది. అదే జరిగితే, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి అశ్వత్ నారాయణ్, కేంద్ర మంత్రి ప్రహ్లాద జోషి, రాష్ట్ర చీఫ్ విప్ సునీల్ కుమార్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే, ఈ ఎవరూ కాకుండా, ఎవరి ఊహకు అందని ఆగంతకుడు ముఖ్యమంత్రి అయినా ఆశ్చర్య పోనవసరం లేదని, పార్టీ వర్గాల సమాచారం.
యడ్డీ వాట్ నెక్స్ట్ అనేది కూడా ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగ ఉంది. ముందుగా, యడ్డీని ఏపీ లేదా మరో రాష్ట్రానికి గవర్నర్’గా పంపుతారని వార్తలు వచ్చినా, అందుకు ఆయన సుముఖంగా లేరు. ఈ రోజు (సోమవారం) విలేకరుల సమవేశంలో ఇదే ప్రశ్న వచ్చినప్పుడు అయన, అలాంటి పదవులపై తనకు ఆసక్తి లేదని కుండబద్దలు కొట్టారు. మరో 15 ఏళ్ళు క్రియాశీల రాజకీయాల్లో ఉంటానని పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని అన్నారు. దక్షిణాది రాష్ట్రాలలో కాషాయ దళానికి బాటలు వేసిన 78 ఏళ్ల యడ్యూరప్ప, నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినా, ఒక్కసారి కూడా ఐదేళ్ళు అధికారంలో కొనసాగలేదు. యడ్డీ తొలిసారి, 2007 నవంబర్’ లో కేవలం ఏడు రోజులు మాత్రమే పదివిలో కొనసాగారు. ఆ తర్వాత 2008 మే నెలలో రెండవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన యడ్డీ, మూడు సంవత్సరాల రెండు నెలలు,మూడవసారి 2018 మే లో కేవలం మూడు రోజులు, చివరకు 2019జులై 26 నుంచి, 2021 జూలై 26 వరకు రెండేళ్ళు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు. అందులో చివరి రెండేళ్ళలో రెండు వరదలు, సంవత్సరంన్నర కరోనా కష్టాలతోనే కాలం కరిగి పోయింది.
అదలా ఉంటే,75 సంవత్సరాల వయసు నిండిన ఎవరైనా ప్రభుత్వ పదవుల నుంచి తప్పుకోవాలన్న పార్టీ నియమావళి ప్రకారం, ఆయన మరోమారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేక పోయినా, యడ్యూరప్ప రాజకీయ జీవితం ముగిసినట్లే అనుకోలేము. ఎందుకంటే ఆయన యడ్యూరప్ప కాబట్టి ..అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.