కేసీఆర్ ను టార్గెట్ చేసిన ప్రవీణ్ కుమార్.. వీఆర్ఎస్ కు కారణం ఇదేనా?
posted on Jul 23, 2021 @ 8:46PM
ఐపీఎస్ కు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన భవిష్యత్ కార్యాచరణపై ఒక్కొక్కటిగా క్లారిటీ ఇస్తున్నారు. రాజకీయ ప్రవేశం ఖాయమన్నట్లుగా సంకేతాలు ఇస్తున్న సీనియర్ ఐపీఎస్.. సంచలన వ్యాఖ్యలతో కాక రేపుతున్నారు. తాజాగా తెలంగాణ సిఎం కేసిఆర్ పై సంచలన కామెంట్స్ చేశారు. సంగారెడ్డిలో స్వేరోస్ సంస్థ సభ్యులతో సమావేశం నిర్వహించిన ప్రవీణ్ కుమార్.. కేసిఆర్ పై విమర్శల వర్షం కురిపించారు.
తన పైన నమోదైన కేసులపై ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. తాను ఉద్యోగానికి వీఆర్ఎస్ చేసిన మరుసటి రోజునే కరీంనగర్‌లో తనపైన పోలీస్ కేస్ పెట్టారని, తాను వాటికి భయపడనని ప్రవీణ్ కుమార్ అన్నారు. రాష్ట్రంలో ఉన్న 29 మంది దళిత ఎమ్మెల్యేలు ఏమి చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. సీఎం హుజరాబాద్‌లో ఖర్చు పెట్టే వెయ్యి కోట్లు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకుల పాఠశాలల కోసం ఖర్చు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.దళిత ముఖ్యమంత్రి అని ఓట్ల కోసం మోసం చేస్తారు, అలాంటివి మళ్ళీ రానీయకండని ఆయన పిలుపునిచ్చారు. ఇటువంటి అవకాశము వెయ్యి ఏళ్ళు వరకు రాదన్నారు.
దేశవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలలో రెండు శాతం మాత్రమే దళిత ప్రొఫెసర్లు ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఒక్క ప్రవీణ్ మీద కేసు పెడితే కోట్ల ప్రవీణ్‌లు పుట్టుకు వస్తారని ఆయన అన్నారు. బహుజన రాజ్యం సృష్టించుకుందామని ఆయన పేర్కొన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్ళు అయిందని, మన బతుకులు ఎక్కడ వేసిన గొంగళిలా ఉన్నాయని ఆయన అన్నారు. ఆ బతుకులు మార్చడానికే తాను రాజీనామా చేసి పదవిని త్యాగం చేసి వచ్చానని ఆయన తెలిపారు. తమకు నిజమైన అభివృద్ధి కావాలి, అధికారం కావాలని అన్నారు. ఉద్యోగాన్ని వదిలేసి వచ్చినప్పుడు కుటుంబములో చాలా బాధ ఉంటుందన్నారు. కోట్ల మంది బాగుపడాలనే తాను ఒంటరి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు.
ప్రవీణ్ కుమార్ తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. కేసీఆర్ డైరెక్షన్ లోనే ఆయన నడుస్తున్నారన్న వాదనకు చెక్ పడినట్లైంది. అంతేకాదు కేసీఆర్ టార్గెట్ గానే ఆయన రాజకీయ అడుగులు ఉండబోతున్నాయన్నది స్పష్టమవుతోంది. ప్రవీణ్ కుమార్ తాజా కామెంట్లతో టీఆర్ఎస్ పార్టీలో కలవరం కనిపిస్తోందని అంటున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికలో దళిత ఓట్లపైనే ఆశలు పెట్టుకున్నారు కేసీఆర్. అందుకోసమే దళిత బంధు స్కీం తీసుకువస్తున్నారు. అయితే ప్రవీణ్ కుమార్ తమకు వ్యతిరేకంగా మాట్లాడితే.. దళిత వర్గాలపై ఆ ప్రభావం ఉంటుందనే ఆందోళన గులాబీ లీడర్ల నుంచి వస్తోంది.