గంటలో మూడు కోట్ల మొక్కలు! కేటీఆర్ కు గ్రీన్ గిఫ్ట్..
posted on Jul 23, 2021 @ 9:59PM
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, మున్సిపల్ శాఖా మంత్రి కేటీఆర్ జన్మదిన సందర్భంగా టీఆర్ఎస్ నేతలు ఫుల్ హడావుడి చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా శనివారం పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేశారు. కేటీఆర్ కు బర్త్ డే కానుకగా గంటలోనే మూడు కోట్ల మొక్కలు నాటే లక్ష్యంగా తలపెట్టిన ముక్కోటి వృక్షార్చనకు ఏర్పాట్లు పూర్తి అయినట్లు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నిర్వాహకులు ప్రకటించారు. వివిధ జిల్లాల్లో నమోదవుతున్న వర్షాలను దృష్టిలో పెట్టుకుని ఒక్క గంటలో నాటాలన్న నియమాన్ని సడలించినట్లు తెలిపారు.
వర్షాల తెరిపి, వీలును బట్టి రోజంతా తమ తమ ప్రాంతాల్లో మొక్కలు నాటి ముక్కోటి వృక్షార్చనను విజయవంతం చేయాల్సిందిగా ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపునిచ్చారు. మూడు కోట్ల మొక్కలు నాటడమే కేటీఆర్‌కు పుట్టినరోజు కానుక అని తెలిపారు. అన్ని స్థాయిల్లోని ప్రజా ప్రతినిధులు, టీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు తమ పరిధిలో వీలైనన్ని మొక్కలు నాటి, వాటి సంరక్షణ బాధ్యతను తీసుకోవటం ద్వారా హరిత తెలంగాణ సాధనలో భాగస్వామ్యం కావాలని పిలుపు నిచ్చారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్ఫూర్తిని దేశవ్యాప్తం చేయాలన్న తమ సంకల్పానికి ప్రజలు ఇచ్చే ఈ మద్దతు చాలా విలువైనదని ఎంపీ చెప్పారు.
మంత్రి కేటీఆర్‌పై వరంగల్ తూర్పు ఎమ్మెల్యే టీఆర్ఎస్ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ తన అభిమానాన్ని చాటుకున్నారు. కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని, ముక్కోటి వృక్షార్చన కార్యక్రమానికి మద్దతుగా వరంగల్‌లోని గ్రౌండ్‌లో కేటీఆర్ రూపాన్ని వంద అడుగుల్లో గ్రీన్ ఆర్ట్ రూపొందించారు.
వరంగల్ కు చెందిన TRS నాయకుడు రాజనాల శ్రీహరి ఒక రోజు ముందే వినూత్న రీతిలో KTR జన్మదిన వేడుకలు నిర్వహించి తన అభిమానాన్ని చాటాడు.. KTR చిత్ర పటాలను మొక్కలకు అంటించి ఓ నర్సరీలోని మొక్కలన్నీ ప్రజలకు పంచాడు. KTR చిత్ర పటాలతో సిద్ధం చేసిన మొక్కలను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశాడు. 500 మొక్కలు పంపిణీ చేసి పంపిణీ ముక్కోటి వృక్ష అర్చన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.