ఈటల అనుచరులకు పదవులు.. కేసీఆర్ కు హుజురాబాద్ భయం!
posted on Jul 24, 2021 @ 10:04AM
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు హుజురాబాద్ భయం పట్టుకుందా? ఉప ఎన్నికపై సర్వేల్లో ఆశాజనక ఫలితాలు రావడం లేదా? అంటే అవుననే తెలుస్తోంది. టీఆర్ఎస్ వర్గాల నుంచి కూడా ఇదే సమాచారం వస్తోంది. అంతేకాదు కేసీఆర్ వరుసగా తీసుకుంటున్న నిర్ణయాలు కూడా అలాగే ఉన్నాయి. ఉప ఎన్నికలో గెలవకపోతే పార్టీ భవిష్యత్ కు గండం వస్తుందన్న ఆలోచనలో ఉన్న కేసీఆర్.. హుజురాబాద్ లో ఎలాగైనా గెలిచేలా వ్యూహాలు రచిస్తున్నారు. ప్రభుత్వ పరంగా తీసుకుంటున్న నిర్ణయాలన్ని హుజురాబాద్ కేంద్రంగానే ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. దీంతో కేసీఆర్ కు హుజురాబాద్ భయం పట్టుకుందనే చర్చ జరుగుతోంది,
హుజురాబాద్ నియోజకవర్గంలోని దళితులకు భారీగా మేలు జరిగేలా దళిత బంధు స్కీం ప్రకటించారు కేసీఆర్. ఒక్క హుజురాబాద్ నియోజకవర్గంలోనే దాదాపు 12 వందల కోట్ల రూపాయలు ఈ స్కీం కింద ఖర్చు పెట్టేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందుకోసం నియోజకవర్గంలోని దాదాపు 400 మంది దళితులతో ఈనెల 26న ప్రగతి భవన్ లో సమావేశం కానున్నారు. గ్రామానికి నలుగురుని పిలిపించుకుంటున్నారు. నియోజకవర్గంలోని దళితుల ఓట్లన్ని గంపగుత్తగా కారుకు పడేలా కేసీఆర్ ఈ వ్యూహ రచన చేస్తున్నారని అంటున్నారు. ప్రభుత్వ పరంగా ఈ నిర్ణయాలు ఉండగానే.. పదవుల పందేరంలోనూ హుజురాబాద్ కు పెద్ద పీట వేస్తున్నారు కేసీఆర్. తాజాగా తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి సంస్థ (ఎస్సీ కార్పోరేషన్) చైర్మన్గా బండా శ్రీనివాస్ ను నియమించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ నామినేటెడ్ నియామకం వెనుక ఆసక్తికర కారణాలు ఉననాయి. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ వాసి ఎస్సీ (మాదిగ) సామాజిక వర్గానికి చెందిన బండా శ్రీనివాస్. టీఆర్ఎస్ పార్టీ హుజూరాబాద్ మండలాధ్యక్షునిగా జిల్లా కార్యదర్శిగా రాష్ట్ర జాయింట్ సెక్రటరీ గా పలు హోదాల్లో పనిచేశారు. దీంతో పాటుగా హుజూరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరక్టర్గా హుజూరాబాద్ టౌన్ నుంచి ఎంపీటీసీగా రెండుసార్లు ఎన్నికయ్యారు. ఈ శ్రీనివాస్ మాజీ మంత్రి ఈటల రాజేందర్ ముఖ్య అనుచరుడు. ఎందరో రాష్ట్ర స్థాయి నాయకులు ముఖ్య నేతలు మాజీ మంత్రులుఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉండగా శ్రీనివాస్కు పదవి కట్టబెట్టడం వెనుక కారణం హుజురాబాద్ ఉప ఎన్నికేనని అంటున్నారు.
హుజూరాబాద్‌లో మాజీమంత్రి ఈటల రాజేందర్‌కు ఓడించడంపై ఫోకస్ చేసిందిఅధికార టీఆర్ఎస్. ఈ క్రమంలోనే అనేక వ్యూహాలు రచిస్తోంది. హుజూరాబాద్‌లోని టీఆర్ఎస్ క్యాడర్ ఈటల వెంట వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్న టీఆర్ఎస్ నాయకత్వం.. ఆయన ప్రధాన అనుచరులు కూడా ఆయన వెంట వెళ్లకుండా చూస్తోంది. ఈ క్రమంలోనే ఆయన ముఖ్య అనుచరుల్లో ఒకరైన బండా శ్రీనివాస్‌కు కీలక పదవి కట్టబెట్టిందని చెబుతున్నారు. నియోజకవర్గంలో మాజీమంత్రి ఈటల రాజేందర్ ముఖ్య అనుచరుల్లో ఒకరిగా శ్రీనివాస్ కొనసాగుతూ వచ్చారు. ఆయన ఈటల వెంట వెళ్లకుండా ఉండేలా కీలకమైన కార్పొరేషన్ పదవి అప్పగించినట్టు తెలుస్తోంది.