రా.. ఒరేయ్ అనడమే ఆత్మగౌరవమా ఈటల! రెచ్చిపోయిన హరీష్ రావు
posted on Aug 11, 2021 @ 5:01PM
హుజురాబాద్ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి ఖరారు కావడంతో ఉప సమరం ఒక్కసారిగా వేడెక్కింది. గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరును టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించిన రోజే మంత్రి హరీష్ రావు నియోజకవర్గంలో హల్చల్ చేశారు.పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన హరీష్ రావు.. భారీగా బల ప్రదర్శన చేశారు. ఇల్లందుకుంట, వీణవంకలో బైక్ ర్యాలీ తీశారు. హరీష్ రావు పర్యటనకు టీఆర్ఎస్ కేడర్ భారీ ఏర్పాట్లు చేయడంతో.. అంతా ప్రణాళిక ప్రకారమే సాగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
హుజురాబాద్ పర్యటనలో హడావుడి చేసిన మంత్రి హరీష్ రావు.. ఘాటైన వ్యాఖ్యలు చేశారు. తనకు గతంలో అత్యంత సన్నిహితుడిగా పేరున్న ఈటల రాజేందర్ పై ఓ రేంజ్ లో ఫైరయ్యారు హరీష్ రావు. కొన్ని రోజులుగా టీఆర్ఎస్ పై ,సీఎం కేసీఆర్ పై ఈటల రాజేందర్ చేస్తున్న వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. ఇల్లందకుంటలో పర్యటించిన మంత్రి.. బీజేపీ, ఈటల లక్ష్యంగా విమర్శనాస్త్రాలు సంధించారు. హుజురాబాద్‌లో గెల్లు శ్రీనివాస్ గెలుపు ఖాయమైందన్నారు హరీష్ రావు. ఈటల గెలిస్తే ప్రతిపక్ష ఎమ్మెల్యేగా మాత్రమే ఉంటాడు తప్ప నియోజకవర్గానికి ఏమీ చేయలేడన్నారు. రైతుబంధు వద్దు, దళిత బంధు వద్దు, ఆసరా పెన్షన్లు ఎవరడుగుతున్నారని ఈటల అంటున్నాడని.. రైతు బంధు వద్దంటూనే రూ. 10 లక్షల రైతు బంధు సాయం ఎందుకు తీసుకున్నారని హరీష్ రావు ఆరోపించారు.
ఈటలకు ఆరు సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు మంత్రిగా కేసీఆర్ అవకాశం ఇచ్చారన్నారు. రాజకీయ బిక్ష పెట్టిన కేసీఆర్‌ను ఇప్పుడు ఈటల రా అంటున్నారని అన్నారు. ఒరేయ్ హరీష్ రారా అంటున్నాడని చెప్పారు. బీజేపీలోకి వెళ్లాక ఈటల బాష మారిందన్న హరీష్ రావు.. ఇదేం సంస్కారమని ప్రశ్నించారు. రారా.. ఒరేయ్ అనడమే ఆత్మగౌరవమా ఈటల అని హరీష్ ప్రశ్నించారు.గడియారాలు, మిక్సీలు పంచి పెట్టడం ఆత్మగౌరవమా అని ప్రశ్నించారు. ఈటల రాజేందర్ చెప్పేదొకటి చేసేది మరొకటి అని హరీష్ రావు ఫైర్ అయ్యారు. ఓటమి భయంతోనే ఈటల అలా మాట్లాడుతున్నాడని, తాను ఓడి పోతున్నానని ఈటల ఒప్పుకున్నారని హరీష్ రావు అన్నారు. సిరిసేడు గ్రామాన్ని దత్తత తీసుకున్న ఈటల ఒక్క పని చేయలేదని, నియోజకవర్గంలో 4 వేల ఇండ్లు కట్టాలని ముఖ్యమంత్రి మంజూరు చేస్తే ఒక్క ఇల్లు కూడ కట్టలేదని విమర్శించారు.
హుజురాబాద్‌లో 2 గుంటలకు 2 వందల ఎకరాలకు మధ్య పోటీ జరుగుతోందని వ్యాఖ్యానించారు. అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులు టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే చేసిందన్నారు. బీజేపీ పార్టీ ఏం చేయలేకపోయిందని, కాంగ్రెస్ పార్టీ ఉనికే లేదని వ్యాఖ్యానించారు. హుజూరాబాద్ టీఆర్ఎస్, బీజేపీ మధ్యే పోటీ ఉంటుందని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. పెట్రోల్, డీజిల్,గ్యాస్ ధరలు పెంచి బీజేపీ ప్రజలపై భారం మోపిందని ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేయడం తప్ప కేంద్రంలోని బీజేపీ ప్రజల గురించి పట్టించుకోలేదని విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం సాయం చేస్తుంటే కేంద్రంలోని బీజేపీ సర్కార్ లాక్కుంటోందని హరీష్ రావు మండిపడ్డారు.
ఈటల గెలిస్తే వ్యక్తిగా గెలుస్తాడు తప్ప ప్రజలుగా మనమంతా ఓడిపోతామన్నారు హరీష్ రావు. మంత్రిగానే ఏమీ పనిచేయలేకపోయిన ఈటల ఇప్పుడు గెలిచి ఏం చేస్తాడో ప్రజలు ఆలోచించాలని హరీష్ రావు కోరారు. ఇండ్లు కట్టించే బాధ్యత తనదేనని, గెల్లు శ్రీనివాస్‌ను ఆదరించి గెలిపించాలని పిలుపునిచ్చారు. హుజురాబాద్ ప్రజలకు లాభం జరగాలో ఈటలకు లాభం జరగాలోనన్న విషయంపై చర్చ జరగాల్సిన అవసరం ఉందని హరీష్ రావు అన్నారు. రాజేందర్‌ను ఎమ్మెల్యేను మంత్రిని చేసింది కేసీఆరేనని, తల్లి లాంటి పార్టీని గుండెలమీద తన్నాడని, ఆయనను గులాబీ జెండానే ఇంతవాన్ని చేసిందన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వాదంతో రూ. 10 కోట్లతో ఇల్లందకుంట రామాలయాన్ని అభివృద్ది చేస్తానని మంత్రి హరీష్ హామీ ఇచ్చారు. సిద్దిపేటలో మహిళా సంఘ భవనాలు లేని ఊరు లేదని, ఇక్కడ కూడా గెల్లు శ్రీనివాస్‌ను గెలిపిస్తే కట్టించి తీరుతామన్నారు.