నాడు-నేడుపై లోకేశ్ మన్‌కీ బాత్.. దేశంలోనే ఏపీ 4వ స్థానం..
posted on Aug 12, 2021 @ 8:14PM
జాబ్ క్యాలెండర్ అంటోంది సర్కారు. జాబ్‌లెస్ క్యాలెండర్ అని మండిపడుతోంది ప్రతిపక్షం. జాబ్ క్యాలెండర్‌ను ప్రకటించినప్పటి నుంచీ ఆంధ్రప్రదేశ్ అట్టుడుకుతోంది. నిరుద్యోగులంతా రోడ్డెక్కి ఉద్యమిస్తున్నారు. ఆందోళనలు, నిరసనలు, ధర్నాలతో హోరెత్తిస్తున్నారు. నిరుద్యోగులకు టీడీపీ మద్దతుగా నిలుస్తోంది. ప్రభుత్వంపై అలుపెరగని పోరాటం చేస్తోంది. వెంటనే ఖాళీలన్నీ భర్తీ చేసేలా జగన్ సర్కారుపై ఒత్తిడి తెస్తోంది.
ఇటు ప్రభుత్వ ఉద్యోగాలనే కాదు.. ప్రైవేటులోనూ పరిస్థితి ఏమాత్రం బాగా లేదు. రెండేళ్లుగా కొత్త పరిశ్రమలు వచ్చింది లేదు. కొత్త ఉద్యోగాలు కల్పించింది లేదు. పైగా ఉన్న కంపెనీలే వరుసకట్టి వెళ్లిపోతున్న దుస్థితి. రిలయన్స్ నుంచి అమరరాజా వరకు ఇదే తీరు. అదే చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడైతే.. అనేక అంతర్జాతీయ స్థాయి సంస్థలు నవ్యాంధ్రకు వలస వచ్చాయి. సన్‌రైజ్ స్టేట్‌గా ఏపీ వెలిగిపోయింది. ఒక్క ఛాన్స్ ఇస్తే.. రాష్ట్రాన్ని సీఎం జగన్ దివాళా తీయించేశారని ప్రతిపక్షం విరుచుకుపడుతోంది. తాజాగా, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. నాడు-నేడును పోల్చి సర్కారుపై మండిపడ్డారు.
చంద్రబాబు హయాంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నెలకో పెద్ద సంస్థ వచ్చేదని నారా లోకేశ్ గుర్తు చేశారు. టీడీపీ హయాంలో రూ.5లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని స్వయంగా వైసీపీ మంత్రే చెప్పారన్నారు. జగన్ పాలనలో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా రాకపోగా.. ఎన్నో పరిశ్రమలు ఇక్కడి నుంచి వెళ్లిపోయాయని దుయ్యబట్టారు. శాంతి భద్రతలు బాగుంటేనే రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు వస్తాయన్నారు నారా లోకేశ్.
ఏపీలో ఇక ఉద్యోగాలు రావని తెలిసి యువత నిరాశలో మునిగిపోయిందని.. ఉద్యోగాలు రావనే బెంగతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అర్ధరాత్రి వచ్చి అరెస్టు చేస్తున్నారని మండిపడ్డారు.
కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం జగన్ సీఎం అయిన తర్వాత ఏపీలో 300 మంది నిరుద్యోగ యువత ఆత్మహత్య చేసుకున్నారని లోకేశ్ మండిపడ్డారు. నిరుద్యోగితలో దేశంలోనే ఏపీ 4వ స్థానంలో ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు నారా లోకేశ్.